తుఫాన్ లో చిక్కుకున్న విమానం.. పైలెట్ సంచలన నిర్ణయం.. వణికిన ప్రయాణికులు.. వైరల్ వీడియో
ఇస్తాంబుల్ నుంచి ట్యునీషియాకు బయలుదేరిన టర్కిష్ ఎయిర్‌లైన్స్ విమానం ట్యునిస్-కార్తేజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగాల్సి ఉంది.
By: A.N.Kumar | 14 Sept 2026 10:23 PM ISTవిమానం గాల్లో ఉన్నప్పుడు వాతావరణం ఒక్కసారిగా ప్రతికూలంగా మారితే ప్రయాణికుల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. బయట ఉరుములు, మెరుపులతో కూడిన తుఫాను.. లోపల విమానం తీవ్ర కుదుపులకు గురవుతుంటే.. ప్రతి క్షణం ప్రాణభయంతో గడపాల్సిందే. టర్కిష్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఓ విమానంలో ఇలాంటి అనుభవమే ప్రయాణికులకు ఎదురైంది. అయితే చివరి నిమిషంలో పైలట్ తీసుకున్న నిర్ణయం వారిని సురక్షితంగా బయటపడేలా చేసింది.
ల్యాండింగ్ సమయంలో అసలు సమస్య
ఇస్తాంబుల్ నుంచి ట్యునీషియాకు బయలుదేరిన టర్కిష్ ఎయిర్‌లైన్స్ విమానం ట్యునిస్-కార్తేజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగాల్సి ఉంది. ప్రయాణం సాధారణంగానే సాగుతున్న సమయంలో ల్యాండింగ్ దశలో ప్రతికూల వాతావరణం సమస్యగా మారింది.
తుఫాను ప్రభావంతో విమానం తీవ్ర కుదుపులకు గురైంది. పైలట్ విమానాశ్రయం చుట్టూ తిరుగుతూ ల్యాండింగ్‌కు ప్రయత్నించినప్పటికీ.. పరిస్థితులు అనుకూలించలేదు. ఒకసారి కాదు.. ఏకంగా మూడు సార్లు ల్యాండింగ్ ప్రయత్నం చేసినట్లు సమాచారం.
విమానం కిందికి పడిపోతున్నట్లుగా అనిపించింది..
మూడోసారి ల్యాండింగ్‌కు ప్రయత్నిస్తున్న సమయంలో పరిస్థితి మరింత భయానకంగా మారింది. విమానం ఒక్కసారిగా కిందికి పడిపోతున్నట్లు అనిపించడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. విమానంలో ఉన్న ఓ ప్రయాణికురాలు ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్న వీడియోలో ప్రయాణికుల ఆందోళన స్పష్టంగా కనిపించింది. తీవ్ర కుదుపులతో కొందరు భయంతో అరుస్తూ.. సీట్లను గట్టిగా పట్టుకున్నట్లు వీడియోలో కనిపించింది. ‘ప్రయాణం సాధారణంగానే సాగింది. కానీ ల్యాండింగ్ ప్రారంభమైన వెంటనే పరిస్థితి భయానకంగా మారింది. నా జీవితంలో ఇంతగా ప్రాణభయం ఎప్పుడూ కలగలేదు. నా తల్లి కూడా నాతోనే ఉన్నారు’ అంటూ ఆమె తన అనుభవాన్ని వివరించారు.
మూడోసారి కూడా ప్రయత్నం.. చివరకు మార్గం మార్చిన పైలట్
వరుసగా ల్యాండింగ్ ప్రయత్నాలు విఫలమైన తర్వాత పైలట్ పరిస్థితిని అంచనా వేసి కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రమాదకర పరిస్థితుల్లో ల్యాండింగ్‌ను కొనసాగించడం కంటే ప్రత్యామ్నాయ విమానాశ్రయానికి విమానాన్ని మళ్లించడం సురక్షితమని నిర్ణయించారు.
దీంతో విమానాన్ని ట్యునిస్-కార్తేజ్ నుంచి దారి మళ్లించి.. ట్యునిస్‌కు సుమారు 100 కిలోమీటర్ల దూరంలోని ఎన్‌ఫిదా-హమ్మమెట్ అంతర్జాతీయ విమానాశ్రయానికి తీసుకెళ్లారు. అక్కడ విమానం సురక్షితంగా ల్యాండ్ కావడంతో ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు.
ప్రయాణికుల భయానికి మించి.. పైలట్ నిర్ణయమే కీలకం
ఈ ఘటనలో ప్రయాణికులను భయపెట్టింది విమానం కుదుపులే అయినప్పటికీ.. చివరకు ప్రమాదాన్ని తప్పించింది మాత్రం పైలట్ తీసుకున్న నిర్ణయమే. ప్రతికూల వాతావరణంలో ఒకే విమానాశ్రయంలో ల్యాండింగ్ కోసం పదేపదే ప్రయత్నించడం కంటే.. పరిస్థితులకు అనుగుణంగా ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంచుకోవడం ఎంత ముఖ్యమో ఈ ఘటన మరోసారి చూపించింది.
విమాన ప్రయాణంలో ప్రయాణికులకు కొన్ని నిమిషాలు అత్యంత భయానకంగా అనిపించినప్పటికీ.. చివరికి విమానం సురక్షితంగా ప్రత్యామ్నాయ విమానాశ్రయంలో దిగడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
