Begin typing your search above and press return to search.

జ‌న‌సేన వ‌ర్సెస్ జ‌న‌సేన‌.. 'తుని' త‌గువు విన్నారా.. ?

నిన్న మొన్న‌టి వ‌ర‌కు టీడీపీలో ఉన్న మ‌ళ్ల‌ గ‌ణేష్.. తుని స్థానాన్నిజ‌న‌సేన‌కు కేటాయించార‌ని తెలియ‌డంతో అనూహ్యంగా ప్లేట్ ఫిరాయించారు.

By:  Garuda Media   |   19 Oct 2026 3:07 PM IST
జ‌న‌సేన వ‌ర్సెస్ జ‌న‌సేన‌.. తుని త‌గువు విన్నారా.. ?
X

రాజ‌కీయాలంటే ఎలా ఉంటాయో.. స‌హ‌జంగా అసెంబ్లీ, పార్ల‌మెంటు ఎన్నిక‌లు చాటుతుంటాయి. అప్ప‌టి వ‌ర‌కు ఒక పార్టీలో ఉన్న‌వారు.. టికెట్ రాక‌పోతే..మ‌రుస‌టి రోజే కండువా కూడా మార్చేస్తున్నారు. టికెట్ ద‌క్కించుకుంటు న్నారు. మ‌రి ఇలాంటి ప‌రిస్థితి మునిసిపాలిటీ ఎన్నిక‌ల్లోనూ ఉంటుంద‌ని ఎవ‌రైనా ఊహించ‌గ‌ల‌రా? .. అంటే క‌ష్ట‌మే. కానీ, ఇప్పుడు తుని మునిసిపాలిటీ ప‌రిధిలో ఇలానే జ‌రిగింది. నిన్న మొన్న‌టి వ‌ర‌కు టీడీపీలో ఉన్న మ‌ళ్ల‌ గ‌ణేష్.. తుని స్థానాన్నిజ‌న‌సేన‌కు కేటాయించార‌ని తెలియ‌డంతో అనూహ్యంగా ప్లేట్ ఫిరాయించారు.

రాత్రికి రాత్రి గ‌ణేష్‌.. జ‌న‌సేన తీర్థం పుచ్చేసుకుని త‌న స‌తీమ‌ణి మీనాక్షితో.. నామినేష‌న్ కూడా వేయించేశారు. ఇంకేముంది.. కూట‌మి ధ‌ర్మానికి క‌ట్టుబ‌డి అంద‌రూ క‌ల‌సి ప‌నిచేసి.. త‌న స‌తీమ‌ణిని చైర్ ప‌ర్స‌న్ చేస్తార‌ని ఆయ‌న లెక్క‌లు వేసుకున్నారు. కానీ, ఇక్క‌డే ప్లేట్ తిర‌గ‌బ‌డింది. అదెలా కుదురుతుంది? అంటూ.. కూటమి లోనే కీల‌క వ‌ర్గం యూట‌ర్న్ తీసుకుంది. గ‌ణేష్ అభ్య‌ర్థిత్వాన్ని జ‌న‌సేన గుర్తించ‌రాదంటూ.. టీడీపీ నాయ‌కులు నిర‌స‌న‌కు దిగారు. దీంతో విష‌యం కాస్తా.. ప‌వ‌న్ క‌ల్యాణ్ వ‌ద్ద‌కు చేరుకుని.. ఆయ‌న ఈ నిర్ణ‌యాన్ని మార్చేశారు.

ఆ వెంట‌నే సంస్థాగ‌తంగా జ‌న‌సేన‌కు బ‌ల‌మైన నాయ‌కురాలిగా ఉన్న సరకణం శ్రీలత పేరును ప్రతిపాదించారు. దీంతో ఆమె చివ‌రి నిమిషంలో నామినేష‌న్ వేశారు. సో.. టీడీపీ నుంచి జ‌న‌సేన‌లోకి వ‌చ్చిన గ‌ణేష్ త‌న భార్య‌తో నామినేష‌న్ వేయిస్తే.. పుట్టుక నుంచి జ‌న‌సేన‌లోనే ఉన్న శ్రీల‌త సైతం అదే పార్టీ త‌ర‌ఫున నామినేష‌న్ వేశారు. అంటే.. జ‌న‌సేన వ‌ర్సెస్ జ‌న‌సేన అన్న‌ట్టుగా ప‌రిస్థితి మారిపోయింది. ఈ వ్య‌వ‌హారం ముఖ్యంగా జ‌న‌సేన‌కు సెగ పెంచుతుంద‌ని అంటున్నారు. దీంతో ఇప్పుడు బుజ్జ‌గింపుల ప‌ర్వం ప్రారంభ‌మైంది.

త‌ప్ప‌క‌పోతే..

గ‌ణేష్ స‌తీమ‌ణికి ఎలానూ.. బీఫాం ద‌క్క‌దు. సో.. అధికారికంగా జ‌న‌సేన అభ్య‌ర్థిగా శ్రీల‌తే రంగంలో ఉంటారు. అయినప్ప‌టికీ.. నామినేష‌న్ వెన‌క్కి తీసుకోకుండా మీనాక్షి క‌నుక ఇండిపెండెంటుగా బ‌రిలో నిలిస్తే.. అప్పుడు పూర్తిస్థాయిలో పోటీత‌ప్ప‌దు. ఈ క్ర‌మంలో టీడీపీ ఓటు బ్యాంకు ఎటువైపు ప‌డుతుంద‌న్న‌ది ప్ర‌శ్న‌. గ‌ణేష్ విష‌యానికి వ‌స్తే.. త‌న స‌తీమ‌ణి ఇండిపెండెంటుగా పోటీ చేసినా.. త‌న వ‌ర్గం వారు త‌న‌కే అనుకూలంగా ఉంటార‌ని ఆయ‌న భావిస్తున్నారు. అంటే.. గుండుగుత్త‌గా టీడీపీ ఓటు బ్యాంకు మీనాక్షికి ప‌డుతుంద‌న్న ఆశ ఉంది. కానీ, ఈ విష‌యంలో చ‌ర్య‌లు తీసుకోవాల‌ని జ‌న‌సేన కోరుతోంది. గ‌ణేష్ స‌తీమ‌ణి పోటీలో ఉంటే శ్రీల‌త కు క‌ష్టాలు త‌ప్ప‌వ‌ని అంటున్నారు.