బాలికపై అత్యాచారం కేసు... చెరువులోకి దూకిన తాత ఏమయ్యాడు?
అవును... మనవరాలి వయసున్న బాలికను గురుకుల పాఠశాల నుంచి తీసుకువెళ్లి అత్యాచారానికి ఒడిగట్టిన ఓ అమానవీయ ఘటన తునిలో వెలుగులోకి వచ్చింది.
By: Raja Ch | 23 Oct 2025 9:51 AM ISTకాకినాడ జిల్లా తునిలో తాత వయసున్న ఓ వ్యక్తి కీచక పర్వం వెలుగులోకి వచ్చి తీవ్ర సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఓ మైనర్ పట్ల సదరు నేత అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఆయన బాగోతాన్ని గుర్తించిన స్థానికులు సదరు బాలికను రక్షించారు. ఆ సమయంలో స్థానికులతో సదరు వ్యక్తి తీవ్ర వాగ్వాదానికి దిగారు, ఆమెను మూత్ర విసర్జన కోసం తీసుకెళ్లానంటూ వాదించాడు.
అవును... మనవరాలి వయసున్న బాలికను గురుకుల పాఠశాల నుంచి తీసుకువెళ్లి అత్యాచారానికి ఒడిగట్టిన ఓ అమానవీయ ఘటన తునిలో వెలుగులోకి వచ్చింది. తుని కొండవారిపేటకు చెందిన తాటిక నారాయణరావు(62)... గురుకుల పాఠశాలలో చదువుతున్న బాలికకు తినుబండారాలు కొనిపెట్టి, మాయమాటలు చెప్పి దగ్గరయ్యాడు. ఆమెకు తాను తాతనంటూ సిబ్బంది వద్ద నమ్మబలికాడు.
ఈ క్రమంలో ఆమెను బయటకు తీసుకెళ్లి, తొండంగి సమీపంలోని ఓ తోట వద్ద అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అయితే ఆ దుశ్చర్యను స్థానికుడొకరు చూసి, గట్టిగా నిలదీయడంతో... ఆమెను మూత్ర విసర్జను తీసుకొచ్చానని బొంకుతూ, తాను మున్సిపల్ కౌన్సిలర్ ని అంటూ బెదిరించి అక్కడి నుంచి జారుకున్నాడు. ఈ ఘటనను స్థానికులు వీడియో తీసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
పోక్సోతో పాటు మరో రెండు కేసులు!:
తుని ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ నేపథ్యంలో.. పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ సందర్భంగా... నారాయణరావుపై పోక్సోతో పాటు బీ.ఎన్.ఎస్ 137, 65(1) సెక్షన్ల కింద కేసులు నమోదుచేశారు. ఈ విషయంపై స్కూల్ కి వెళ్లి విచారించినట్లు శ్రీహరి రాజు తెలిపారు.
చెరువులోకి దూకిన నిందితుడు!:
ఇప్పటికే తీవ్ర సంచలనంగా మారిన ఈ కేసులో.. తాజాగా మరో షాకింగ్ ఘటన తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా... బుధవారం అర్ధరాత్రి నారాయణరావుని పోలీసులు కోర్టుకు తరలిస్తున్న సమయంలో బహిర్భూమికి వెళ్తానని చెప్పి చెరువులో దూకాడు. తుని గ్రామీణ పోలీస్ స్టేషన్ నుంచి కోర్టుకు తీసుకెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. గల్లంతైన నిందితుడి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.
టీడీపీలో ఎలాంటి పదవీ లేదు!:
నారాయణరావు గతంలో తుని టీడీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా వ్యవహరించాడు. అయితే.. ప్రస్తుతం ఆయనకు పార్టీలో ఎలాంటి పదవీ లేదు. మరోవైపు.. నిందితుడికి ఓ కుమారుడు, కుమార్తె ఉండగా.. వారికి వివాహాలయ్యాయి.. ఇద్దరు మనవలు ఉన్నారు.
ఈ సమయంలో... నిందితుడిని కఠినంగా శిక్షించాలని, పాఠశాల సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని కుటుంబసభ్యులు, దళిత సంఘాల నాయకులు, పలువురు ప్రజాప్రతినిధులు ఆందోళనకు దిగారు.
