Begin typing your search above and press return to search.

వుహాన్ ల్యాబ్‌కు నిధులు.. వ్యాక్సిన్ వ్యాపారం కోసం కరోనా సృష్టించిన అమెరికన్ సైంటిస్ట్.. సంచలన నిజాలు

అమెరికా మాజీ చీఫ్ మెడికల్ అడ్వైజర్ డాక్టర్ ఆంథోనీ ఫౌచీ చైనాలోని వుహాన్ ల్యాబ్‌కు నిధులు ఇచ్చారని.. కోవిడ్ వాస్తవాలను దాచారంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తున్నాయి.

By:  A.N.Kumar   |   20 Jun 2026 5:00 AM IST
వుహాన్ ల్యాబ్‌కు నిధులు.. వ్యాక్సిన్ వ్యాపారం కోసం కరోనా సృష్టించిన అమెరికన్ సైంటిస్ట్.. సంచలన నిజాలు
X

కోవిడ్‌-19 వైరస్ మూలాల గురించిన వివాదం మరోసారి అంతర్జాతీయంగా అగ్గి రాజేసింది. అమెరికా జాతీయ నిఘా సంస్థ (డీఎన్ఐ) మాజీ డైరెక్టర్ తులసి గబ్బార్డ్ తన పదవీకాలం చివరి రోజున సంచలన నివేదికలు.. రహస్య పత్రాలను విడుదల చేస్తూ డోనాల్డ్ ట్రంప్ వైట్‌హౌస్‌ను వీడే ముందు ఒక పెద్ద బాంబు పేల్చారు. అమెరికా మాజీ చీఫ్ మెడికల్ అడ్వైజర్ డాక్టర్ ఆంథోనీ ఫౌచీ చైనాలోని వుహాన్ ల్యాబ్‌కు నిధులు ఇచ్చారని.. కోవిడ్ వాస్తవాలను దాచారంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తున్నాయి.

వుహాన్ ల్యాబ్‌కు నిధులు.. ‘గెయిన్-ఆఫ్-ఫంక్షన్’ పరిశోధనలు

తులసి గబ్బార్డ్ కార్యాలయం విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. 2020లో అమెరికాను కోవిడ్ మహమ్మారి వణికించిన సమయంలో బైడెన్ ప్రభుత్వ వైద్య విభాగానికి నేతృత్వం వహించిన డాక్టర్ ఆంథోనీ ఫౌచీ.. చైనాలోని వుహాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ కు మిలియన్ల డాలర్ల అమెరికా పన్ను చెల్లింపుదారుల సొమ్మును మళ్లించారు. గబ్బిలాల ద్వారా వ్యాపించే కరోనావైరస్‌లపై అత్యంత ప్రమాదకరమైన "గెయిన్-ఆఫ్-ఫంక్షన్" పరిశోధనల కోసం ఈ నిధులను ఉపయోగించారని గబ్బార్డ్ ఆరోపించారు. వైరస్ ల్యాబ్ నుంచే లీక్ అయిందనే నిజాన్ని కప్పిపుచ్చడానికి ఫౌచీ తెరవెనుక శక్తుల వ్యూహాన్ని అమలు చేశారని ఆమె మండిపడ్డారు.

ట్రిలియన్ డాలర్ల వ్యాక్సిన్ వ్యాపార కుట్ర?

ఫౌచీ దాదాపు 38 ఏళ్ల పాటు నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అలర్జీ అండ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ అధిపతిగా పనిచేశారు. అయితే ఆయన పెద్ద ఫార్మా కంపెనీలతో చేతులు కలిపి ట్రిలియన్ల డాలర్ల విలువైన "యూనివర్సల్ వ్యాక్సిన్ల" వ్యాపారం కోసం ఈ రిస్కీ కరోనావైరస్ పరిశోధనలను ప్రోత్సహించారని తులసి గబ్బార్డ్ కార్యాలయం తీవ్ర ఆరోపణలు చేసింది.

కాంగ్రెస్ ముందు అబద్ధాలు.. విశ్లేషకులపై ప్రతీకారం

2024లో అమెరికా పార్లమెంట్ కమిటీ ముందు ప్రమాణం చేసి ఫౌచీ అబద్ధాలు చెప్పారని గబ్బార్డ్ వెల్లడించారు. మహమ్మారికి ముందు లేదా తర్వాత వైరల్ పరిశోధనలకు సంబంధించి ఎఫ్‌బీఐ, సీఐఏ వంటి నిఘా సంస్థలతో జరిపిన చర్చలపై ఫౌచీని ప్రశ్నించినప్పుడు ఆయన మాట దాటవేశారని నివేదికలు పేర్కొంటున్నాయి. "డాక్టర్ ఫౌచీ లాంటి స్వార్థపూరిత నాయకులు తమ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి నిఘా విభాగాలను తారుమారు చేశారు. కాంగ్రెస్‌కు అబద్ధాలు చెబుతూ దేశాన్ని సురక్షితంగా ఉంచడానికి అవసరమైన కీలక వాస్తవాలను దాచారు." అని మాజీ డీఎన్‌ఐ చీఫ్ తులసి గబ్బార్డ్ సంచలన ఆరోపణలు చేశారు.

అంతేకాకుండా ఫౌచీ నివేదికలను.. ల్యాబ్-లీక్ సిద్ధాంతాన్ని సమర్థించిన ఇంటెలిజెన్స్ విశ్లేషకులపై ప్రతీకార చర్యలు తీసుకున్నారని, వారి నోళ్లు మూయించి వారి కెరీర్‌ను నాశనం చేశారని పలువురు విజిల్ బ్లోవర్ల సాక్ష్యాల ద్వారా స్పష్టమవుతోందని ఆమె ఆరోపించారు.

నిజం తేలేది ఎప్పుడు?

కోవిడ్-19 వల్ల ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలో తులసి గబ్బార్డ్ విడుదల చేసిన ఈ ‘ఇంతకుముందెన్నడూ చూడని’ రహస్య పత్రాలు అంతర్జాతీయ రాజకీయాల్లో సరికొత్త చర్చకు దారితీశాయి. అయితే డాక్టర్ ఆంథోనీ ఫౌచీ ఈ ఆరోపణలను ఎప్పటికప్పుడు ఖండిస్తూనే ఉన్నారు. తాను ఎలాంటి ప్రమాదకర పరిశోధనలకు నిధులు ఇవ్వలేదని స్పష్టం చేశారు. ఏది ఏమైనప్పటికీ ఈ కొత్త పత్రాల నిజానిజాలు తేలాలంటే స్వతంత్ర దర్యాప్తు జరగాల్సిందేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.