Begin typing your search above and press return to search.

జగన్ విషయంలో షర్మిల అలా...తులసిరెడ్డి ఇలా !

వైఎస్ జగన్ ని ఆయన సోదరి కాంగ్రెస్ ఏపీ విభాగం అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శిస్తూనే ఉంటారు.

By:  Satya P   |   8 Feb 2026 9:52 AM IST
జగన్ విషయంలో షర్మిల అలా...తులసిరెడ్డి ఇలా !
X

వైఎస్ జగన్ ని ఆయన సోదరి కాంగ్రెస్ ఏపీ విభాగం అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శిస్తూనే ఉంటారు. ఆమె తాజాగా విజయవాడలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో పాదయాత్ర జగన్ ఎందుకు చేస్తున్నారు అని ప్రశ్నించారు. జగన్ మళ్ళీ అధికారంలోకి రారు అని కూడా సీరియస్ కామెంట్స్ చేశారు. ఆయన అహంకారం తగ్గించుకోవాలని పూర్తిగా మారాలని సూచనలు కూడా చేశారు. ఇక అదే కాంగ్రెస్ లో సీనియర్ నేత తులసిరెడ్డి మాత్రం జగన్ విషయంలో కొంత సాఫ్ట్ కార్నర్ చూపించడం విశేషం. ఒక ఒకే సమయంలో షర్మిల జగన్ ని చంద్రబాబుని కలిపి విమర్శలు చేస్తున్న వేళ తులసి రెడ్డి జగన్ విషయంలో చంద్రబాబు వైఖరిని పూర్తిగా తప్పుపడుతూ మాట్లాడటం రాజకీయ విశేషంగానే చూడాలని అంటున్నారు.

ఇంతకీ ఏమన్నారు అంటే :

ఏపీలో ఇపుడు హాట్ టాపిక్ గా లడ్డూల కల్తీ వ్యవహారం సాగుతోంది. దీని మీద కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి ఫైర్ అయ్యారు. జగన్ మీద రాజకీయ కక్ష కోసం చంద్రబాబు పవిత్రమైన తిరుమల లడ్డూతో రాజకీయం చేస్తున్నారు అని విమర్శించారు. దేశంలో అత్యున్నత సంస్థ అయిన సీబీఐ తన చార్జ్ షీట్ లో లడ్డూలో జంతు కొవ్వు కలవలేదు అని చెప్పింది అని గుర్తు చేశారు, అదే సమయంలో పాం ఆయిల్ సహా ఇతర పదార్ధాలు కలిసాయని దాంతో 20 కోట్లకు పైగా లడ్డూలు చేశారని నెయ్యి అన్నది ఎక్కడా వాడలేదని కూడా పేర్కొంది అని గుర్తు చేశారు.

ఇక అవినీతి జరిగిందని 250 కోట్ల మేర నష్టం జరిగిందని తేల్చిందని కూడా చెప్పారు. అందువల్ల ప్రభుత్వం అవినీతి చేసిన వారి మీద తప్పుడు విధానం అవలంబించిన వారి మీద చర్యలు తీసుకోకుండా లడ్డూల విషయంలో కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బ తినేలా వ్యవహరించడమేంటి అని తులసీరెడ్డి ప్రశ్నించారు. ఎంత ఎక్కువగా లడ్డూ విషయం టీడీపీ మాట్లాడితే అంతలా ఆ పార్టీకి శ్రీవారి లడ్డూకి టీటీడీకే నష్టం అని కాంగ్రెస్ పెద్దాయన స్పష్టం చేశారు.

మోడీ దత్తపుత్రుడు అంటూ :

ఇక షర్మిల అయితే రాయలసీఅంకు చంద్రబాబు జగన్ ఇద్దరూ ద్రోహం చేశారని నిప్పులు చెరిగారు. తమ సొంత ప్రయోజనాల కోసం సీమ ప్రజల ప్రయోజనాలను ఇద్దరు నేతలూ తాకట్టు పెట్టారని ఆమె మండిపడ్డారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ విషయంలో ఇద్దరి వైఖరి తప్పు అని ఆమె స్పష్టం చేశారు. గత అయిదేళ్ళూ వైసీపీ తన పాలనలో నిద్రపోయిందా ఇపుడు ఉద్యమాలు చేస్తోంది అని షర్మిల జగన్ ని ఘాటు గానే ప్రశ్నించారు. ఐదేళ్ళూ ప్రధాని మోడీ దత్తపుత్రుడుగా జగన్ ఉన్నారని షర్మిల విమర్శించారు.

జలయజ్ఞం ప్రాజెక్టులను తాము అధికారంలోకి వస్తే కేవలం ఆరు నెలలలోనే పూర్తి చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన జగన్ సీఎం అయ్యాక కనీసం రాయలసీమ ప్రాజెక్టుల వైపు కన్నెత్తి కూడా చూడలేదని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె ఎక్కడా లడ్డూ కల్తీ గురించి కానీ ఏపీలో జరుగుతున్న హీటెడ్ డిస్కషన్ గురించి కానీ మాట్లాడలేదు, సీమ ద్రోహులు బాబు జగన్ అంటూ తన విమర్శలు కొనసాగించారు. దీంతో కాంగ్రెస్ లో షర్మిల ఒకలా తులసిరెడ్డి మరోలా వ్యాఖ్యలు చేయడం మీద చర్చ సాగుతోంది.