Begin typing your search above and press return to search.

ప్రైవేటు ఆసుపత్రుల దోపిడీని బయటపెట్టిన రియల్ సింగం

అలాంటి ఆయన తాజాగా మహారాష్ట్రలోని ప్రైవేటు ఆసుపత్రుల దోపిడీ భాగోతాన్ని బయటపెట్టి.. సంచలనంగా మారారు.

By:  Garuda Media   |   17 Sept 2026 12:03 PM IST
ప్రైవేటు ఆసుపత్రుల దోపిడీని బయటపెట్టిన రియల్ సింగం
X

నీతికి.. నిజాయితీకి నిలువెత్తు రూపం లాంటి మాటల్ని సినిమాల్లో వింటాం. అలాంటి వారు రియల్ లైఫ్ లో ఉంటారా? అంటే ఉంటారు. కానీ.. అలాంటి వారు అతి తక్కువగా ఉంటారు. అందునా ఐఏఎస్.. ఐపీఎస్ లలో తాము నమ్మిన సిద్ధాంతాం కోసం ప్రభుత్వాలను.. ప్రభుత్వాధినేతలను.. పవర్ ఫుల్ వ్యక్తులను ఎదుర్కొనేందుకు ఏ మాత్రం సంకోచించని ముక్కుసూటి అధికారులు వేళ్ల మీద లెక్కేసేంతమంది మాత్రమే ఉంటారు. ఆ కోవలోకే చెందుతారు ఐఏఎస్ అధికారి తుకారం ముండే. మహారాష్ట్ర క్యాడర్ కు చెందిన ఆయన ప్రస్తుతం మహారాష్ట్ర ఆహార - ఔషధ పరిపాలన కమిషనర్ (ఎఫ్ డీఏ) గా వ్యవహరిస్తున్నారు.

2005 బ్యాచ్ కు చెందిన ఈ ఐఏఎస్ అధికారి తన 21 ఏళ్ల సర్వీసులో ఏకంగా 25 సార్లు బదిలీ అయ్యారు. రాజీ పడటం ఆయన కెరీర్ లో కనిపించదు. తప్పు చేసే ఎవరిని వదిలిపెట్టని మొండిఘటంగా పేరుంది. ఎఫ్ డీఏ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత పెద్ద ఎత్తున తనిఖీలు నిర్వహించి.. ఎందరికో షాకులు ఇచ్చారు. పొగాకు ఉత్పత్తుల ప్రకటనలు చేసిన బాలీవుడ నటులు షారూక్ ఖాన్.. అజయ్ దేవగన్.. టైగర్ ష్రాఫ్ లకు నోటీసులు ఇవ్వటం ద్వారా వార్తల్లో నిలిచారు. అంతేనా.. ఈ మధ్యన బాంబే హైకోర్టు కేసుల విచారణ సందర్భంగా ఎప్పుడూ ప్రైవేటు క్యాంటీన్ల మీదనే తనిఖీలా? ప్రభుత్వ క్యాంటీన్ల మీద తనిఖీలు చేయరా? అని ప్రశ్నించిన తర్వాతి రోజే హైకోర్టు క్యాంటీన్ లో తనిఖీలు నిర్వహించి.. అక్కడి లోపాల్ని బయటపెట్టటం ద్వారా సంచలనంగా మారారు.

అలాంటి ఆయన తాజాగా మహారాష్ట్రలోని ప్రైవేటు ఆసుపత్రుల దోపిడీ భాగోతాన్ని బయటపెట్టి.. సంచలనంగా మారారు. రోగులకు సెలైన్ అందించే ఐవీ ఇన్ పూజన్ సెట్ ఉత్పత్తి ఖర్చు రూ.11.05 మాత్రమేనని.. ఆసుపత్రులు దానికి ఏకంగా కొన్ని వందల రెట్లు అధికంగా రూ.325 వసూలు చేస్తున్న వైనాన్ని బయటపెట్టారు. తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్లో ఆయన పలు అంశాల్ని వెల్లడించటం ద్వారా ప్రైవేటు ఆసుపత్రుల దోపిడీ ఎంత భారీగా ఉంటుందన్న విషయాన్ని బట్టబయలు చేశారు.

ప్రైవేటు ఆసుపత్రులు రోగులకు వినియోగిస్తున్న పరికరాల ఉత్పత్తి ఖర్చు..వాటికి అత్యధిక ధరలు వసూలు చేసే తీరును ఒక పట్టిక రూపంలో వెల్లడించి అందరిని షాక్ కు గురి చేశారు. సిరెంజి తయారు చేయటానికి రూ.6.75 మాత్రమే అవుతుందని.. మెడికల్ బిల్లులో రూ.57.20 వేస్తున్నట్లు చెప్పారు. మూత్రం లాంటి మలినాలను శరీరం నుంచి బయటకు పంపేందుకు వినియోగించే క్యాథటర్ పైప్ తయారీకి అయ్యే ఖర్చు రూ.29.41 మాత్రమే అయితే.. దానికి ఆసుపత్రులు రూ.310 వసూలు చేస్తున్న విషయాన్ని వెల్లడించారు.

ఆసుపత్రుల్లో వినియోగించే కొన్ని ఔషధాల ధరల మీద నియంత్రణ ఉన్నప్పటికి.. వైద్య పరికరాలపై నియంత్రణ లేదని.. అందువల్ల ఆసుపత్రులు ఇష్టం వచ్చినట్లుగా ధరలు వసూలు చేస్తున్నట్లుగా పేర్కొన్నారు. తాను చేసిన పరిశోధనల్లో తాను గుర్తించిన దోపిడీని సోషల్ మీడియా అకౌంట్ లో చెప్పటం ద్వారా.. కోట్లాదిమందికి అవగాహన కల్పించటమే కాదు.. ప్రైవేటు ఆసుపత్రుల దారుణ దోపిడీకి వ్యతిరేకంగా ప్రభుత్వాలు చేపట్టాల్సిన చర్యల గురించి చెప్పకనే చెప్పారని చెప్పాలి. ఈ రియల్ సింగం కారణంగా ప్రైవేటు ఆసుపత్రుల దోపిడీకి కొంతమేర చెక్ పడినా.. కోట్లాది మంది ప్రజలకు మేలు కలిగిస్తుందని చెప్పక తప్పదు.