Begin typing your search above and press return to search.

పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ మునీర్ మగతనానికి పరీక్ష పెడుతూ వీడియో..!

నిజంగా దమ్ముంటే.. మగాడైతే తమను ఎదుర్కోవాలని మునీర్ కు సవాల్‌ విసిరారు. ఇదే సమయంలో.. పాక్‌ సైన్యంలోని ఉన్నతాధికారులకు సైతం సవాల్‌ చేశారు.

By:  Raja Ch   |   23 Oct 2025 6:06 PM IST
పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ మునీర్ మగతనానికి పరీక్ష పెడుతూ వీడియో..!
X

పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ఆసీం మునీర్ వ్యవహారం ఎంత వివాదాస్పదంగా ఉంటుందనేది తెలిసిన విషయమే. పాకిస్థాన్ కు మునీర్ అనధికారిక నియంత అని అంటారు. గతంలో పహల్గాంలో ఉగ్రదాడికి ఇతడి రెచ్చగొట్టే వ్యాఖ్యలే కారణం కాగా... ఈ క్రమంలో అలాంటి మునీర్ కు బిగ్ షాకిస్తూ తెహ్రీక్-ఇ-తాలిబన్ పాకిస్థాన్ (టీటీపీ) ఓ వీడియో విడుదల చేసింది. ఇది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

అవును... పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ మునీర్ కు బిగ్‌ షాక్‌ తగిలింది. ఇందులో భాగంగా.. తెహ్రీక్-ఇ-తాలిబన్ పాకిస్థాన్ కు చెందిన కమాండర్‌.. మునీర్‌ ను టార్గెట్‌ చేసి చాలెంజ్‌ విసిరిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది. నిజంగా దమ్ముంటే.. మగాడైతే తమను ఎదుర్కోవాలని మునీర్ కు సవాల్‌ విసిరారు. ఇదే సమయంలో.. పాక్‌ సైన్యంలోని ఉన్నతాధికారులకు సైతం సవాల్‌ చేశారు.

మునీర్ కు ఉన్నతాధికారులకు ఉమ్మడి సవాల్!:

ఈ వీడియోలో.. టీటీపీ కమాండర్‌ కాజిమ్‌ గా చెప్పబడుతున్న వ్యక్తి మాట్లాడుతూ.. 'మాతో పోరాటం చేయడానికి పాకిస్తాన్‌ సైన్యం ఎందుకు?.. వారికి బదులుగా పాక్‌ సైన్యంలోని ఉన్నతాధికారులు యుద్ధభూమికి రావాలి. పాకిస్తాన్‌ ఆర్మీ చీఫ్‌ మునీర్‌ కు నిజంగా దమ్ముంటే.. మాగాడే అయితే మమ్మల్ని ఎదుర్కోవాలి' అని అన్నాడు.

అక్కడితో ఆగని ఆ కమాండర్... 'అతను (మునీర్!) నిజంగా తల్లి పాలే తాగి ఉంటే మాతో యుద్ధం చేయాలి' అని సవాల్‌ విసిరారు. దీనికి సంబంధించిన వీడియో బయటకు రావడంతో అతడి వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఇదే సమయంలో... అలాగే అక్టోబర్‌ 8న ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌ లో దాడి జరిపిన దృశ్యాలను విడుదల చేసింది.

కాజిమ్ పై రివార్డు ప్రకటించిన పాక్!:

ఈ రేంజ్ లో తమ ఆర్మీ చీఫ్ మునీర్ ను, ఆ దేశ సైన్యంలోని ఉన్నతాధికారులను సవాల్ చేసిన విషయాన్ని పాకిస్థాన్ అధికారులు తీవ్రంగా తీసుకున్నారు. ఈ నేపథ్యంలో... పాకిస్థాన్ అధికారులు కాజిమ్ తలపై 10కోట్ల పాకిస్థానీ రూపాయల రివార్డు ప్రకటించారు. అతడి గురించి సమాచారం ఇచ్చినవారికి ఆ మొత్తం ఇస్తామని వెల్లడించారు.

పాత పాటే పాడిన పాక్!:

ఈ సందర్భంగా... తన భూభాగాన్ని ఉపయోగించుకుంటున్న తెహ్రీక్‌-ఇ-తాలిబన్‌ పాకిస్థాన్‌ (టీటీపీ) ఉగ్రవాదులపై అఫ్గానిస్థాన్ కఠిన చర్యలు తీసుకోవాలని పాకిస్థాన్ డిమాండ్ చేసింది. అయితే... సరిహద్దుల్లో దాడులకు పాల్పడే ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తున్నారనే ఆరోపణలను అఫ్గాన్‌ మరోసారి ఖండించింది. కాగా.. ఆ అంశమే ఇరుదేశాల మధ్య తీవ్ర ఘర్షణలకు దారితీసిన సంగతి తెలిసిందే.

ఇదిలా ఉండగా.. ఇటీవల ఖతార్, టర్కీ మధ్యవర్తిత్వంతో పాకిస్తాన్‌, ఆఫ్గనిస్థాన్‌ లోని తాలిబన్ ప్రభుత్వాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే. ఆఫ్ఘన్ భూభాగం నుంచి పనిచేస్తున్న టీటీపీ వంటి సాయుధ గ్రూపులపై కఠిన చర్యలు తీసుకుంటేనే ఈ ఒప్పందం నిలుస్తుందని పాకిస్తాన్ స్పష్టం చేసింది. అయినప్పటికీ.. టీటీపీ దాడులు ఏమాత్రం తగ్గలేదని తెలుస్తోంది.

మరోవైపు పాకిస్తాన్‌ తో శాంతి ఒప్పందాన్ని కొనసాగించడానికి పరస్పర గౌరవం, నిబద్ధత కీలకమని పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ స్పష్టం చేశారు. ఈ విషయంలో ఖతార్, టర్కీ దాని అమలుకు సహాయం చేయాలని, దీన్ని పర్యవేక్షించాలని కోరారు.