తిరుమలలో ఆ 10 రోజులు సామాన్యులకే పెద్దపీట
కొత్త సంవత్సరానికి కాస్త ముందుగా తిరుమల శ్రీవారిని దర్శించుకోవటం కోసం భక్తులు తపిస్తుంటారు.
By: Garuda Media | 27 Nov 2025 10:24 AM ISTకొత్త సంవత్సరానికి కాస్త ముందుగా తిరుమల శ్రీవారిని దర్శించుకోవటం కోసం భక్తులు తపిస్తుంటారు. డిసెంబరు 25న వచ్చే క్రిస్మస్ మొదలు తిరుమలలో భక్తుల రద్దీ విపరీతంగా పెరుగుతుంది. ఇక.. కొత్త సంవత్సరం మొదలు నుంచి ఒక వారం వరకు భారీ ఎత్తున భక్తులు తిరుమలకు రావటం.. స్వామి వారిని దర్శించుకోవటం చేస్తుంటారు. సామాన్యుల మాదిరే వీఐపీలు.. ప్రముఖులు కూడా దర్శనానికి వస్తుంటారు.
ఇలాంటి వేళ.. ప్రముఖుల దర్శనాల కోసం సామాన్యుల దర్శనాల సమయంలో కోత పడుతూ ఉంటుంది. ఇలాంటి పరిస్థితి ఎదురుకాకుండా ఉండేందుకు వీలుగా టీటీడీ ప్లాన్ చేస్తోంది. డిసెంబరు 30 నుంచి జనవరి 8 వరకు శ్రీవారి ఆలయంలో పది రోజుల పాటు నిర్వహించే వైకుంఠ ద్వార దర్శనాల కోసం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ మొత్తం పది రోజులకు 182 గంటలు స్వామి వారి దర్శనం కోసం అందుబాటులో ఉంటే.. ఇందులో 90 శాతం సామాన్యులకు పెద్ద పీట వేస్తూ.. వారికే స్వామి వారి సమయాన్ని కేటాయించినట్లుగా పేర్కొన్నారు. మొత్తం 182 గంటల్లో 164 గంటలు సామాన్య భక్తులకు స్వామి వారి దర్శనాన్ని కల్పిస్తారు. ఈ రోజులకు సంబంధించి రూ.300..శ్రీవాణి దర్శన టికెట్లను ముందుగానే ఆన్ లైన్ లో జారీ చేస్తామని టీటీడీ స్పష్టం చేస్తోంది. ఈ నేపథ్యంలో భక్తులు ప్రశాంతంగా స్వామి వారి దర్శనం చేసుకోవచ్చని.. వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకుంటామని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు స్పష్టం చేస్తున్నారు.
