Begin typing your search above and press return to search.

టీటీడీ పరకామణి కేసులో బిగ్ ట్విస్టు.. ఎవీఎస్వో సతీష్ కుమార్ అనుమానాస్పద మృతి

టీటీడీ పరకామణి కేసులో పెను సంచలన ఘటన నమోదైంది. పరకామణి చోరీ కేసు నిందితుడు రవికుమార్ తో రాజీ చేసుకున్న అప్పటి ఎవీఎస్వో సతీష్ కుమార్ అనుమానాస్పద స్థితి మరణించారు.

By:  Tupaki Political Desk   |   14 Nov 2025 1:45 PM IST
టీటీడీ పరకామణి కేసులో బిగ్ ట్విస్టు.. ఎవీఎస్వో సతీష్ కుమార్ అనుమానాస్పద మృతి
X

టీటీడీ పరకామణి కేసులో పెను సంచలన ఘటన నమోదైంది. పరకామణి చోరీ కేసు నిందితుడు రవికుమార్ తో రాజీ చేసుకున్న అప్పటి ఎవీఎస్వో సతీష్ కుమార్ అనుమానాస్పద స్థితి మరణించారు. శుక్రవారం అనంతపురం జిల్లా గుంతకల్లు సమీపంలో రైలు పట్టాలపై సతీష్ కుమార్ మృతదేహం లభ్యమైంది. చోరీ కేసులో నిందితుడు రవికుమార్ పై పోలీసులకు ఫిర్యాదు చేసిన సతీష్ కుమార్.. ఆ తర్వాత లోక్ అదాలత్ ద్వారా కేసును రాజీ చేసుకున్నారు. అయితే కేసు రాజీ చేయడంపై అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీనిపై కొందరు భక్తులు కోర్టుకు వెళ్లడం, రాజీకి టీటీడీ అనుమతి లేదని ఈవో కోర్టుకు నివేదించడంతో ఈ మొత్తం వ్యవహారంపై సిట్ విచారణకు హైకోర్టు ఆదేశించింది. కోర్టు సూచనల ప్రకారం సిట్ విచారణ జరుగుతుండగా, సతీష్ కుమార్ మరణించడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

సతీష్ కుమార్ ప్రస్తుతం గుంతకల్లు జీఆర్పీలో పనిచేస్తున్నట్లు చెబుతున్నారు. పరకామణి చోరీ కేసులో సిట్ దర్యాప్తు జరుగుతుండగా, ఈ నెల 6న సతీష్ కుమార్ విచారణ ఎదుర్కొన్నారు. మరోసారి ఆయన విచారణకు రావాల్సివుంటుందని సిట్ అధికారులు అప్పట్లో తెలిపినట్లు సమాచారం. పరకామణి కేసు రాజీకి ఎవరు ఆదేశాలు ఇచ్చారు? ఎవరి సూచనల మేరకు రాజీ చేసుకోవాల్సి వచ్చింది అనేది సతీష్ కుమార్ ద్వారానే తెలియాల్సివుంది. కేసు చిక్కు ముడి వీడటానికి ఆయనే కీలక సాక్షిగా చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సతీష్ కుమార్ అనుమానస్పద స్థితిలో మరణించడం సంచలనంగా మారింది.

2023లో టీటీడీ పరకామణిలో రవికుమార్ అనే ఉద్యోగి అమెరికన్ డాలర్లను చోరీ చేస్తే.. అప్పటి ఏవీఎస్వోగా పనిచేసిన సతీష్ కుమార్ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. నిందితుడుపై ఫిర్యాదు చేశారు. అయితే అప్పట్లో ఆయన 12 నోట్లు పట్టుకుంటే.. 9 నోట్లు మాత్రమే చూపినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇక ఆ తర్వాత నిందితుడిని జైలుకు పంపకుండానే కేసు రాజీ చేసుకున్నారు. నిందితుడు రవికుమార్ ఆస్తులను స్వామి వారి పేరున రాయించి, లోక్ అదాలత్ లో కేసు ఉపసంహరించుకున్నారు. ఈ మొత్తం ఎపిసోడ్ లో సతీష్ కుమార్ కీలక పాత్రపోషించారని ఫిర్యాదులు ఉన్నాయి. అయితే ఆయనను రాజీకి ఒప్పుకునేలా ప్రోత్సహించిన వారు ఎవరన్నది తెలియాల్సివుంది.

టీటీడీ అనుమతి లేకుండానే సతీష్ కుమార్ కేసును రాజీ చేసుకున్నారని ఇప్పటికే ఈవో హైకోర్టుకు నివేదించారు. దీంతో సతీష్ కుమార్ పై ఒత్తిడి తెచ్చింది ఎవరో తేలాల్సివుంది. ఇక ఈ విషయమై ఒకసారి స్పందించిన సతీష్ కుమార్.. అప్పట్లో పోలీసులు ఒత్తిడి చేయడం వల్లే కేసు రాజీ చేసుకున్నట్లు ప్రకటించారని వార్తలు వచ్చాయి. ఇలాంటి పరిస్థితుల్లో రైలు పట్టాలపై సతీష్ కుమార్ శవమైపోవడం సంచలనంగా మారింది. అనేక సందేహాలకు కారణమవుతోంది.