టీటీడీ లడ్డూ కేసులో సంచలనం.. ఏం జరిగిందంటే!
తిరుమల తిరుపతి శ్రీవారి మహాప్రసాదం లడ్డూ తయారీలో కల్తీ నెయ్యిని వినియోగించారన్న కేసులో మరో సంచలన ఘట్టం చోటు చేసుకుంది.
By: Garuda Media | 29 Nov 2025 11:37 PM ISTతిరుమల తిరుపతి శ్రీవారి మహాప్రసాదం లడ్డూ తయారీలో కల్తీ నెయ్యిని వినియోగించారన్న కేసులో మరో సంచలన ఘట్టం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుల సంఖ్య అమాంతం పెరిగింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో 11 మందిపై ఏపీ సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. ఇప్పటికే ఈ కేసులో 24 మందిపై కేసు పెట్టిన సీఐడీ అధికారులు.. వీరిలో 10 మందిని అరెస్టు చేశారు. వారు ప్రస్తుతం జైల్లో ఉన్నారు. ఇక, తాజాగా అందిన సమాచారం మేరకు.. మరో 11 మందిపై ఒకేసారి కేసులు పెట్టడం గమనార్హం.
వైసీపీ హయాంలో శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో నకిలీ నెయ్యి వినియోగించారని సీఎం చంద్రబాబు ఆరోపించిన విషయం తెలిసిందే. దీంతో ఇక్కసారిగా ఈ విషయం రచ్చకు దారితీసింది. దీనిపై సుప్రీంకో ర్టు సీబీఐని కూడా నియమించింది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం దీనిపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని కూడా నియమించి విచారణ చేయిస్తోంది. ఈ నేపథ్యంలోనే 24 మందిని అప్పటి వరకు అరెస్టు చేశారు. వీరిలో తిరుమల శ్రీవారి ఆలయ పోటు అధికారుల నుంచి స్టోర్ అధికారి దాకా ఉన్నారు.
ఇక, వీరిచ్చిన సమాచారంతో తాజాగా శనివారం ఉదయం మరో 11 మందిని పోలీసులు అదుపులోకి తీసు కున్నారు. వీరిలో 9 మంది తిరుమల దేవస్థానంలో పనిచేస్తున్న ఉద్యోగులేనని అధికారులు చెప్పారు. ఇక, నెల్లూరు ఏసీబీ కోర్టులో నిందితుల వివరాలతో కూడిన చార్జి మెమోను పోలీసులు దాఖలు చేశారు. దీనిపై విచారణ జరగనుంది. అనంతరం వారిని అదుపులోకి తీసుకుని విచారించనున్నారు. కాగా.. ఇప్పటికే ఈ కేసులో గోశాల సిబ్బంది, అధికారులను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. తాజా పరిణామాంతో దాదాపు లడ్డూ కేసు కొలిక్కివచ్చినట్టేనని అదికారులు భావిస్తున్నారు.
