బిగ్ ట్విస్ట్... వైవీ సుబ్బారెడ్డి పీఏ రిమాండ్ రిపోర్ట్ లో సంచలన విషయాలు!
అవును... తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి కేసు కీలక మలుపు తిరిగినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా... కల్తీ నెయ్యి సరఫరా వెనుక భారీ కుట్ర ఉన్నట్లు సిట్ అధికారులు గుర్తించారని అంటున్నారు.
By: Raja Ch | 30 Oct 2025 8:36 PM ISTతిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) లడ్డూ ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యి సరఫరా చేశారన్న కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరమైంది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇందులో భాగంగా... ఈ కల్తీ నెయ్యి కేసులో 24వ నిందితుడిగా ఉన్న వైవీ సుబ్బారెడ్డి మాజీ పీఏ చిన్నఅప్పన్న అరెస్టుతో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయని తెలుస్తోంది. ఇప్పుడు ఈ విషయం కేసులో కీలక మలుపుగా చెబుతున్నారు.
అవును... తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి కేసు కీలక మలుపు తిరిగినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా... కల్తీ నెయ్యి సరఫరా వెనుక భారీ కుట్ర ఉన్నట్లు సిట్ అధికారులు గుర్తించారని కొన్ని రిపోర్ట్స్ ప్రకారం తెలుస్తుంది . ఈ మేరకు అప్పన్న రిమాండ్ రిపోర్టులో కుట్ర కోణాలను సిట్ ప్రస్తావించిందని తెలుస్తోంది. ఈ సందర్భంగా... 2022లోనే నెయ్యి కొనుగోలు వ్యవహారాల్లో అప్పన్న పాత్ర కీలకంగా ఉందనే చర్చ తెరపైకి వచ్చింది.
వివరాళ్లోకి వెళ్తే... అప్పన్న రిమాండ్ రిపోర్టులో కుట్ర కోణాలను ప్రస్తావించిన సిట్... 2022 టీటీడీ కొనుగోళ్ల విభాగం జీఎంను అప్పన్న సంప్రదించారని.. ఈ సందర్భంగా నెయ్యి సరఫరా చేసే భోలేబాబా డెయిరీ యాజమాన్యానికి ఫోన్ చేశారని.. ప్రతి కిలో నెయ్యిపై రూ.25 కమీషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారని.. అయితే, అందుకు భోలేబాబా డెయిరీ యాజమాన్యం నిరాకరించిందని తెలుస్తోంది!
ఇలా తాను అడిగిన కమిషన్ ఇవ్వకపోయే సరికి.. సదరు భోలేబాబా డెయిరీపై అనర్హత వేటు వేసేలా చిన్నఅప్పన్న కుట్రకు తెరలేపారని అంటున్నారు. ఇందులో భాగంగా... డెయిరీని తనిఖీ చేయాలంటూ టీటీడీ అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చారని.. డెయిరీపై అనర్హతవేటు వేసేలా అజ్ఞాతవ్యక్తులతో పిటిషన్లు వేయించారని.. ఈ నేపథ్యంలోనే బోలేబాబా డెయిరీ నుంచి నెయ్యి సేకరణను టీటీడీ నిలిపివేసిందని సిట్ గుర్తించినట్లు చెబుతున్నారు!
అలా చిన్న అప్పన్న కుట్రతో భోలే బాబా డెయిరీ నుంచి నెయ్యి సేకరణను తిరుమల తిరుపతి దేవస్థానం నిలిపేసిందని చెబుతుండగా.. ఆ స్థానంలో ప్రీమియర్ అగ్రిఫుడ్స్ సంస్థ ప్రవేశించింది. ఈ సంస్థ.. రూ.138 ఎక్కువ కోట్ చేసి, పోటీ లేకపోవడంతో కాంట్రాక్టు దక్కించుకుంది! దీంతో ఇప్పుడు చిన్న అప్పన్న వ్యవహారం ఈ కేసులో కీలక పరిణామంగా మారిందని అంటున్నారు.
బుధవారం రాత్రి అప్పన్న అరెస్ట్!:
కాగా... ఈ కేసులో.. వైసీపీ రాజ్యసభ సభ్యుడు, టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మాజీ వ్యక్తిగత సహాయకుడు అప్పన్నను సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) బుధవారం రాత్రి అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో దీన్ని తొలి రాజకీయ సంబంధిత అరెస్టుగా చెబుతున్నారు. అరెస్టు చేసిన తర్వాత నెల్లూరు ఏసీబీ కోర్టులో హాజరుపరిచింది!
ఎవరీ చిన్న అప్పన్న..?:
2014లో వైవీ సుబ్బారెడ్డి ఒంగోలు ఎంపీగా ఎన్నికైనప్పటి నుంచి 2024 ఎన్నికల వరకు ఆయన పీఏగా అప్పన్న పనిచేశారు. ఢిల్లీలో సుబ్బారెడ్డి వ్యవహారాలు ఈయనే చూసుకున్నారని చెబుతారు. ఇదే సమయంలో... వైసీపీ హయాంలో ఢిల్లీలోని ఏపీ భవన్ లో ప్రొటోకాల్ ఓఎస్‌డీ గా కూడా అప్పన్న బాధ్యతలు నిర్వహించారు!
అయితే తాజాగా... టీటీడీలో కల్తీ నెయ్యి సరఫరాలో అప్పన్న కీలక పాత్ర పోషించారని.. సామర్థ్యం లేని డెయిరీలు, టీటీడీ కాంట్రాక్టులు దక్కించుకోవడంలో ఈయనే మధ్యవర్తిగా పనిచేశారని ఆరోపణలు వినిపిస్తున్న పరిస్థితి! వైవీ సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్ గా ఉన్న సమయంలోనే ఈ వ్యవహారాలు తెలిసినా చర్య తీసుకోలేదనీ ఆరోపణలు వినిపిస్తున్నాయి!
