టార్గెట్ టీటీడీ: నాడు జగన్.. నేడు బాబు.. తప్పించుకోలేక!
పార్టీకి సేవ చేసిన వారికి ఏదో ఒక తాయిలం ఇవ్వాలి. ఎన్నికల సమయంలో తమకు సహకరించిన వారిని ఏదో ఒక రూపంలో సంతృప్తి పరచాలి.
By: Garuda Media | 19 Sept 2025 10:04 AM ISTపార్టీకి సేవ చేసిన వారికి ఏదో ఒక తాయిలం ఇవ్వాలి. ఎన్నికల సమయంలో తమకు సహకరించిన వారిని ఏదో ఒక రూపంలో సంతృప్తి పరచాలి. ఇది అన్ని రాజకీయ పార్టీలకు.. ముఖ్యంగా అధికారంలోకి వచ్చిన పార్టీలకు తీవ్ర ఇబ్బందికర విషయంగా మారింది. పోనీ.. ఏవో ఇతర పదవులు ఇస్తే తీసుకుంటున్నారా? అంటే.. అది కూడా లేదు. తాము కోరుకున్న పదవులు ఇవ్వాల్సిందేనని సదరు వ్యక్తులు, నాయకులు కూడా పట్టుబడుతున్నారు. దీంతో అధికార పార్టీలకు ఇబ్బందులు మరింత పెరుగుతున్నాయి.
ఇదే సమస్యతో గత వైసీపీ ప్రభుత్వం ఇబ్బందులు పడింది. తమకు ఎన్నికల్లో సాయం చేశారన్న కారణంగా.. జగన్ అప్పట్లో చాలా మందిని సలహాదారులుగా తీసుకున్నారు. అయితే.. వీరిలో కొందరు పట్టుబట్టి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన బోర్డులోనే తమకు పదవులు కావాలని భీష్మించారు. దీంతో జగన్ ఎట్టకేలకు.. వారిని మెప్పించేందుకు ఆ సాహసం చేశారు. చివరకు కోర్టులో చీవాట్లు తిన్నారు. సరే.. ఆ సమయంలో ఈ విషయాన్ని ఏకేసిన టీడీపీ అధినేత చంద్రబాబు.. మాత్రం ఇప్పుడు ఏం చేస్తున్నారు? అంటే.. తాను కూడా అదే బాటలో నడవకతప్పని పరిస్థితి ఏర్పడింది.
కాకపోతే.. నేరుగా బోర్డులో నిమియమించకుండా.. `సలహాదారుల` పేరుతో కొత్తగా ఒక కమిటీని ఏర్పాటు చేశారు చంద్రబాబు. ఏదేమైనా.. టీటీడీ లక్ష్యంగా కొందరు చేస్తున్న ఒత్తిళ్లకు నాడు జగన్, నేడు చంద్రబాబు కూడా తప్పించుకోలేక పోతున్నారన్న వాదన వినిపిస్తోంది. ఇక, రాష్ట్రంలోని ఇతర దేవాలకు కూడా చంద్రబాబు బోర్డు చైర్మన్‌లుగా పార్టీ నాయకులను (కూటమి) నియమించారు. ఈ మేరకు తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు.
ఇదీ.. టీటీడీ సలహా మండలి బోర్డు
1. టీటీడీ లోకల్ అడ్వైజరీ కమిటీ, జూబ్లీహిల్స్, హైదరాబాద్ – ఏ.వి. రెడ్డి
2. టీటీడీ లోకల్ అడ్వైజరీ కమిటీ, హిమాయత్‌నగర్, హైదరాబాద్ – నేమూరి శంకర్ గౌడ్
3. టీటీడీ లోకల్ అడ్వైజరీ కమిటీ, బెంగళూరు – వీరాంజనేయులు
4. టీటీడీ లోకల్ అడ్వైజరీ కమిటీ, ఢిల్లీ – ఎదుగుండ్ల సుమంత్ రెడ్డి
5. టీటీడీ లోకల్ అడ్వైజరీ కమిటీ, ముంబై – గౌతమ్ సింగానియా
6. టీటీడీ లోకల్ అడ్వైజరీ కమిటీ, విశాఖపట్నం – వెంకట పట్టాభిరామ్ చోడే
కొసమెరుపు: వీరు టీటీడీ పాలకమండలికి అనుబంధ సభ్యులుగా ఉంటారు.
ఇక, రాష్ట్రంలోని దేవాలయాలకు కమిటీలు..
1. శ్రీ బ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానం శ్రీశైలం – పోతుగుంట రమేశ్ నాయుడు
2. శ్రీ కాళహస్తీశ్వర స్వామి దేవస్థానం, శ్రీకాళహస్తి, తిరుపతి జిల్లా – కొట్టె సాయి ప్రసాద్
3. శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం – వి. సురేంద్ర బాబు (మణి నాయుడు)
4. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం, ఇంద్రకీలాద్రి – బొర్రా రాధాకృష్ణ (గాంధీ)
5. శ్రీ వెంకటేశ్వర ఆలయం, వాడపల్లి – ముదునూరి వెంకట్రాజు
