Begin typing your search above and press return to search.

కుక్కతోక వంకర.. ట్రంప్ బుద్ధి మారదా? భారత్‌పై మళ్లీ టారిఫ్స్ కొరడా!

"కుక్క తోకను తీసుకెళ్లి గొట్టంలో పెట్టినా వంకర తిరగదు" అంటారు పెద్దలు. వైట్ హౌస్ సీట్లో కూర్చున్నా డొనాల్డ్ ట్రంప్ మైండ్ సెట్ మాత్రం మారదని మరోసారి రుజువైంది.

By:  A.N.Kumar   |   8 July 2026 8:08 AM IST
కుక్కతోక వంకర.. ట్రంప్ బుద్ధి మారదా? భారత్‌పై మళ్లీ టారిఫ్స్ కొరడా!
X

"కుక్క తోకను తీసుకెళ్లి గొట్టంలో పెట్టినా వంకర తిరగదు" అంటారు పెద్దలు. వైట్ హౌస్ సీట్లో కూర్చున్నా డొనాల్డ్ ట్రంప్ మైండ్ సెట్ మాత్రం మారదని మరోసారి రుజువైంది. కోర్టులు మొట్టికాయలు వేసినా అంతర్జాతీయంగా విమర్శలు వచ్చినా... "నా రూటే సపరేటు" అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్లీ తన పాత 'టారిఫ్' రాగాన్ని అందుకున్నారు. ఈసారి కూడా మన భారతదేశం ఆయన హిట్ లిస్ట్‌లో ఉండటం విశేషం.

అమెరికాకు దిగుమతి అయ్యే వస్తువులపై అదనపు సుంకాలు బాదడానికి అమెరికా ట్రేడ్ రిప్రజెంటేటివ్ (యూఎస్.టీఆర్) తాజాగా రంగం సిద్ధం చేసింది. భారత్‌తో సహా సుమారు 60 దేశాలపై ఈ టారిఫ్స్ కత్తి వేలాడుతోంది.

అమెరికా వింత వాదన.. మీ దగ్గర కూలీలు చౌక.. మాకు నష్టం

పెద్దన్న అమెరికా చెబుతున్న కారణాలు వింటే ఎవరికైనా నవ్వాగదు. భారతదేశం లాంటి దేశాల్లో కార్మికులకు తక్కువ వేతనాలు ఇస్తున్నారట, సరైన భద్రతా ప్రమాణాలు లేవట. అలా చౌక శ్రామికులతో తక్కువ ధరకే వస్తువులు తయారు చేసి అమెరికా మార్కెట్‌ను ముంచెత్తుతున్నారట. దీనివల్ల పాపం... అమెరికాలో ఉన్న పరిశ్రమలు నష్టపోతున్నాయట.

ఇదెక్కడి న్యాయం సామీ?

మనదేశంలో జీవన వ్యయం తక్కువ, శ్రామిక శక్తి ఎక్కువ. దాంతో వస్తువుల ధరలు తక్కువగా ఉంటాయి. దీన్ని 'వ్యాపార చతురత' అనాలో లేక 'అమెరికాను ముంచే కుట్ర' అనాలో ట్రంప్ తాతకే తెలియాలి. 'గ్లోబలైజేషన్' అని ప్రపంచమంతా ఒకటే అని చెప్పిందేమో అమెరికా... ఇప్పుడు రేట్లు తక్కువగా ఉన్నాయని ఏడవడం కూడా అమెరికానే!

భారత్‌పై 12.5% వాత?

ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం.. భారతీయ ఉత్పత్తులపై దాదాపు 12.5 శాతం అదనపు టారిఫ్ విధించే ఆలోచనలో అమెరికా ఉంది. ఈ విచారణ ప్రక్రియ ఈ నెల 9వ తేదీ వరకు కొనసాగనుంది. మరి ఈ 'టారిఫ్ తడాఖా' ఎలా ఉంటుందో చూపించడానికి యూఎస్.టీఆర్ రెడీ అవుతుంటే భారత్ ఊరికే కూర్చుంటుందా? ట్రంప్ ప్లాన్లకు చెక్ పెట్టేందుకు భారత్ కూడా తన అమ్ములపొదిలోని అస్త్రాలను సిద్ధం చేసుకుంది. యూఎస్.టీఆర్ విచారణలో భాగంగా రేపు భారత్ తన బలమైన వాదనలను వినిపించనుంది. అంతర్జాతీయ వాణిజ్య నిబంధనల ప్రకారం అమెరికా చేస్తున్న ఈ గారడీలు చెల్లవని గట్టిగానే చెప్పబోతోంది.

వ్యాపార నిపుణులు ఏమంటున్నారు?

ఒకవేళ ట్రంప్ గనుక పట్టుబట్టి ఈ టారిఫ్‌లు విధిస్తే భారత్ నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే ఐటీ, టెక్స్‌టైల్స్, ఫార్మా రంగాలు కాస్త ఇబ్బంది పడే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. అయితే... అమెరికా గనుక మనపై పన్నులు పెంచితే, భారత్ కూడా అమెరికా నుంచి వచ్చే యాపిల్ ఐఫోన్లు, హార్లే డేవిడ్‌సన్ బైకులపై 'కౌంటర్ టారిఫ్స్' వడ్డించడానికి వెనుకాడదు. విచారణ ముగిసి అన్ని దేశాల వాదనలు విన్నాకే తుది నిర్ణయం వస్తుంది కాబట్టి ఇప్పుడే కంగారు పడాల్సిన పనిలేదు.

ట్రంప్ తన పాత బుద్ధిని మార్చుకోకుండా ఎంత ప్రయత్నించినా, భారత్ ప్రయోజనాలను కాపాడటానికి మన ప్రభుత్వం గట్టిగానే పోరాడుతోంది. చూద్దాం... ట్రంప్ గారి ఈ 'టారిఫ్ నాటకం' ఎక్కడికి దారితీస్తుందో..