తాటిమట్ట నోరేసుకున్న ట్రంప్ ను సీరియస్ గా తీసుకోవాలా?
నోటికి వచ్చినట్లు మాట్లాడే అగ్రరాజ్య అధినేత డొనాల్డ్ ట్రంప్ మాటల్ని సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఉందా? ఏ రోజుకు ఆ రోజు అన్నట్లుగా.. స్థిమితం లేని మాటల్ని మాట్లాడే అతడి మాటలకు ఆగమాగం కావటంలో అర్థం లేదు.
By: Garuda Media | 1 Aug 2025 9:58 AM ISTనోటికి వచ్చినట్లు మాట్లాడే అగ్రరాజ్య అధినేత డొనాల్డ్ ట్రంప్ మాటల్ని సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఉందా? ఏ రోజుకు ఆ రోజు అన్నట్లుగా.. స్థిమితం లేని మాటల్ని మాట్లాడే అతడి మాటలకు ఆగమాగం కావటంలో అర్థం లేదు. భారత ఆర్థిక వ్యవస్థ నిర్వీర్యమైనదన్న ట్రంప్ తాజా వ్యాఖ్యలే దీనికి నిదర్శనం. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు గ్లోబల్ సౌత్ ప్రధానమన్న విషయం తెలిసిందే. ఇందులో భారత్ కీలకంగా మారింది.
అధికయువ జనాభా కలిగిన భారత ఆర్థిక వ్యవస్థ చురుకైన.. చైతన్యవంతమైన పాత్రను పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఐక్యరాజ్యసమితి 2024 లెక్కల్నే ప్రాతిపదికగా తీసుకుంటే భారత్ లో సగటు వయసు 28.8 సంవత్సరాలు అయితే.. అమెరికాలో ఇది 38.5 ఏళ్లు. యూరోప్ లో 42.8 ఏళ్లు. సగటు వయసు.. అవకాశాల పరంగా చూస్తే.. డెవలప్ అయిన దేశాలు మరింత పెద్ద వయసులోకి వెళుతున్న పరిస్థితి. భారత ఆర్థిక వ్రద్ధి సైతం అంతకంతకూ స్థిరత్వంలోకి.. వ్రద్ధిలోకి వెళుతున్న సంగతి తెలిసిందే.
ఇలాంటి వేళ.. భారత్ ను తక్కువ చేసి చూడటం..తక్కువ చేసి మాట్లాడటం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. భారతీయులు సొంతంగా తమ సత్తా చాటేందుకు తెగ ఉత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారు. ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ జనాభా కలిగిన దేశంగా ఉండటం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక సానుకూలతగా చెప్పాలి. ఎందుకంటే.. ప్రపంచంలోని తోపు కార్పొరేట్ కంపెనీలకు అవసరమైన భారీ మార్కెట్ భారత్ సొంతం. తమ ఉత్పత్తుల్ని అమ్ముకోవటానికి అవసరమైన అతి పెద్ద మార్కెట్ భారత్ కు ఉంది
గతంలో మాదిరి భారత ప్రజల కొనుగోలు శక్తి బలహీనంగా లేదు. గడిచిన ఇరవైఏళ్లుగా చోటు చేసుకుంటున్న మార్పుల కారణంగా భారతదేశ ఆర్థిక పరిస్థితి కంటే కూడా భారతీయులు వ్యక్తిగతంగా బలంగా ఉన్నారని చెప్పాలి. అంచనాలకు అందని రీతిలో ఉన్న భారతీయుల సంపద అనధికారికంగా ఉందన్నది మర్చిపోకూడదు దీనికి తోడు పొదుపును సైతం ఖర్చుగా భావిస్తూ దాచి పెట్టే నైజం.. మరింత సంపదకు కారణమవుతుందన్నది మర్చిపోకూడదు. ఒక రకంగా ట్రంప్ మేలు చేస్తున్నారని చెప్పాలి.
ఇంతవరకు ప్రాశ్చాత్య దేశాల మీద ఫోకస్ చేసే తీరును మార్చుకొని.. పలు రంగాల్లో స్వయం సమృద్ధి సాధించే దిశగా అడుగులు వేసేందుకు సాయం చేస్తుందని చెప్పాలి. సొంత వనరులు.. నైపుణ్యాలు.. సామర్థ్యాల్ని పెంచుకోవటానికి ట్రంప్ తీరు కారణమవుతుందని చెప్పక తప్పదు. ఇప్పటి వరకు అమెరికా మీద ఏయే రంగాల్లో ఎక్కువగా ఆధారపడుతున్నామో.. ఆయా రంగాల మీద ప్రత్యేక ఫోకస్ చాలా అవసరమన్న విషయాన్ని యువ భారతం గుర్తిస్తోంది. వందల ఏళ్లు బానిస బతుకుల నుంచి బయటకు వచ్చి.. సొంతంగా.. స్వేచ్ఛగా బతుకుతున్న వేళ.. ట్రంప్ లాంటి అధినేత ఆంక్షల రూపంలో దూస్తున్న కత్తికి.. యువ భారతం అంతే బలంగా సమాధానం ఇస్తుందని చెప్పక తప్పదు. ఇందుకు కాలమే సాక్షిగా మారుతుందని చెప్పక తప్పదు. ట్రంప్ మాటలకు అదే పనిగా అదిరిపడే కన్నా.. ఫలితాల దిశగా వేసే అడుగులు.. అగ్రరాజ్యానికి సరైన సమాధానాల్ని ఇస్తాయని చెప్పక తప్పదు.
