Begin typing your search above and press return to search.

'ఎఫ్' పదం.. 'మిడిల్' ఫింగర్.. ట్రంప్ వీడియో వైరల్!

ఈ సమయంలో దీన్ని గుర్తుచేస్తూ ఓ వ్యక్తి చేసిన వ్యాఖ్యలకు ట్రంప్ కు బీపీ పీక్స్ కి చేరినట్లుంది. ఆయన రియాక్షన్ కు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

By:  Raja Ch   |   14 Jan 2026 11:56 AM IST
ఎఫ్ పదం.. మిడిల్ ఫింగర్.. ట్రంప్ వీడియో వైరల్!
X

లైంగిక నేరస్థుడు జెఫ్రీ ఎప్ స్టీన్ వ్యవహారం అమెరికాను కుదిపేస్తున్న సంగతి తెలిసిందే! ఈ ఫైల్స్ లో బడా బడా వ్యక్తుల పేర్లు ఉండటం.. అందులోనూ ట్రంప్ కు – ఎప్ స్టీన్ కు మంచి స్నేహం ఉందనే ప్రచారం జరగడం.. ఈ పరిణామాల నేపథ్యంలో అతడు జైలు గదిలోనే మరణించడం వంటి ఘటనలతో ఈ వ్యవహారం మరింత హాట్ టాపిక్ గా మారింది. ఈ సమయంలో దీన్ని గుర్తుచేస్తూ ఓ వ్యక్తి చేసిన వ్యాఖ్యలకు ట్రంప్ కు బీపీ పీక్స్ కి చేరినట్లుంది. ఆయన రియాక్షన్ కు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

అవును... అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మిచిగాన్‌ లోని ఫోర్డ్ ప్లాంట్‌ ను సందర్శించిన సందర్భంగా ఓ ఆసక్తికర విషయం తెరపైకి వచ్చింది. ఈ సందర్భంగా ట్రంప్ ను అక్కడున్న ఓ వ్యక్తి "పెడోఫైల్ ప్రొటెక్టర్" అని పిలిచాడు. దీంతో.. అమెరికన్ తయారీని హైలైట్ చేయడానికి ఉద్దేశించిన ఫ్యాక్టరీ పర్యటన కాస్తా ఒక్కసారిగా బిగ్ టర్న్ తీసుకుంది. ఈ సమయంలో ట్రంప్ రియాక్షన్ వైరల్ గా మారింది. డియర్‌ బోర్న్‌ లోని ఫోర్డ్ మోటార్ కంపెనీ రివర్ రూజ్ కాంప్లెక్స్‌ లో ఈ ఘటన చోటు చేసుకుంది.

ఈ సందర్భంగా ట్రంప్ ఫ్యాక్టరీ వద్ద నడుస్తున్నప్పుడు.. అక్కడున్న ఓ కార్మికుడు "పెడోఫైల్ ప్రొటెక్టర్" అని అరిచారు. దీంతో ట్రంప్ కు ఒక్కసారిగా పట్టలేనంత ఆగ్రహం వచ్చినట్లుంది. వెంటనే ఆ సౌండ్ వినిపించిన వైపు చూసిన ఆయన.. ముఖం చిట్లించి.. "ఎఫ్" పదం ప్రయోగిస్తూ.. మిడిల్ ఫింగర్ పైకెత్తి స్పందించారు. దీనికి సంబంధించిన వీడియో ఒక్కసారిగా నెట్టింట వైరల్ గా మారింది. ట్రంప్ "ఎఫ్" పదం వాడటం ఇదే తొలిసారి కాదు కానీ.. ఈసారి దానికి మిడిల్ ఫింగర్ కూడా యాడ్ చేయడం గమనార్హం!

దీనిపై తీవ్ర విమర్శలు వస్తున్న వేళ.. వైట్ హౌస్ మాత్రం ట్రంప్ ప్రతిస్పందనను సమర్ధించింది. ఈ సందర్భంగా వైట్ హౌస్ ప్రతినిధి స్టీవెన్ చియుంగ్ స్పందిస్తూ... ఒక పిచ్చివాడు పూర్తి కోపంతో అసభ్య పదజాలంతో అరుస్తున్నప్పుడు.. అధ్యక్షుడు తగిన, స్పష్టమైన ప్రతిస్పందన ఇచ్చారు అని అన్నారు. అందుకు ఆ వ్యాఖ్యలు చేసిన వ్యక్తి అర్హుడని తెలిపారు.

కాగా... ట్రంప్ కు ఒకప్పుడు స్నేహితుడు అయిన లైంగిక నేరస్థుడు జెఫ్రీ ఎప్ స్టీన్ కు సంబంధించిన ఫైళ్లను విడుదల చేయాలనే డిమాండ్స్ ఇటీవల బలంగా వినిపించిన సంగతి తెలిసిందే. ఫైనాన్షియర్ అయిన ఎప్ స్టీన్.. మైనర్ బాలికలను, యువతులను అక్రమంగా రవాణా చేశాడనే ఆరోపణలపై విచారణ కోసం ఎదురుచూస్తున్న సమయంలో అతడు 2019లో జైలు లోనే మరణించాడు. అయితే.. ఈ మరణాన్ని అధికారికంగా ఆత్మహత్యగా నిర్ధారించారు.

అయితే.. ట్రంప్ మద్దతుదారులు మాత్రం దీన్ని విస్తరించిన కుట్రంగా అభివర్ణిస్తుంటారు. ఈ క్రమంలో ఇటీవల ఆ ఫైళ్లను విడుదల చేయడానికి ద్వైపాక్షిక చట్టాన్ని ఆమోదించారు.. డిసెంబర్ 19న అందుకు చివరి రోజుగా నిర్ధారించారు! అయితే.. న్యాయ శాఖ వాటన్నింటినీ ఆ గడువులోపు విడుదల చేయలేకపోయింది. దీంతో.. ఈ నెల ప్రారంభంలో విడుదల కోసం ఇంకా రెండు మిలియన్లకు పైగా పత్రాలను సమీక్షిస్తున్నట్లు అధికారులు తెలిపారు.