పుతిన్ కంటే జెలెన్స్కీ తో డీల్ చేయడమే కష్టం - ట్రంప్
రష్యాతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కుదుర్చుకున్న డీజిల్ ఒప్పందం ట్రంప్, జెలెన్ స్కీల మధ్య సంబంధాలు దెబ్బతినేందుకు దారితీశాయి.
By: Tupaki Political Desk | 16 Oct 2026 6:00 PM ISTరష్యాతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కుదుర్చుకున్న డీజిల్ ఒప్పందం ట్రంప్, జెలెన్ స్కీల మధ్య సంబంధాలు దెబ్బతినేందుకు దారితీశాయి. ప్రస్తుతం ట్రంప్ - జెలెన్ స్కీల మధ్య మాటల యుద్దం మొదలయింది. ట్రంప్ ఒకవైపు రష్యాతో డీజిల్ వ్యాపారం చేస్తూ ఉక్రెయిన్ మీద వత్తిడి పెంచుతున్నాడు. జెలెన్ స్కీ దీనిని ద్రోహంగా భావిస్తున్నాడు.
ట్రంప్ రష్యా అధ్యక్షుడు పుతిన్ తో ఒప్పందం చేసుకుని రష్యా డీజిల్ ఎగుమతుల మీద ఉన్న ఆంక్షలను సడలించి అమెరికా, గ్లోబల్ మార్కెట్లకు సరఫరా చేయడం ప్రారంభించాడు. మిడ్ టర్మ్ ఎన్నికలకు ముందు ఇంధన ధరలు తగ్గించడానికి అని ట్రంప్ ప్రచారం చేసుకుంటున్నాడు. అయితే ఉక్రెయిన్, యూరప్ లు దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.
ట్రంప్ మొదట ఏకపక్షంగా ఉక్రెయిన్ - రష్యాలు ఎనర్జీ సీజ్ ఫైర్ కు రెండు పక్షాలు అంగీకరించాయని ఏకపక్షంగా ప్రకటించాడు. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ సహకరించడానికి సిద్దం అంటూ మూడు రోజులు ఆపింది. కానీ రష్యా మాత్రం ఉక్రెయిన్ పవర్ గ్రిడ్ల మీద దాడులు చేసింది. దీంతో ముందుగా అనుకున్న ఒప్పందం కుప్పకూలింది.
అయితే తాజా ఇంటర్వ్యూలో ట్రంప్ జెలెన్ స్కీని తీవ్రంగా విమర్శించాడు. ‘జెలెన్ స్కీతో డీల్ చేయడం పుతిన్ కన్నా ఎక్కువ కష్టం అనిపిస్తుందని,ఆయన మంచి వ్యక్తి కాదు. ఆయన సమస్యకు పరిష్కారం కోరుకోవడం లేదు. నేను జెలెన్ స్కీ అభిమానిని కాదు. ఉక్రెయిన్ రష్యా ఆయిల్ రిఫైనరీల మీద దాడులు చేయడం మూలంగా ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు పెరగడానికి కారణం అవుతున్నాయి. ఉక్రెయిన్ కు కొత్త అధ్యక్షుడు రావాలి అంటూనే యుద్దం ముగిసేందుకు జెలెన్ స్కీ ప్రధాన అడ్డంకి’గా భావిస్తున్నాడు.
ఈ నేపథ్యంలో జెలెన్ స్కీ కూడా ట్రంప్ విషయంలో బహిరంగంగా తీవ్రంగా స్పందించాడు. ‘ట్రంప్ పుతిన్ తో స్నేహం చేయడం తప్పు. ట్రంప్ అధికారంలో ఉండే వ్యక్తులను, ధనవంతులను ఇష్టపడతాడు. ఇది ఆయిల్, గ్యాస్ వ్యాపార ఒప్పందాలకు కూడా సంబంధించినది. ఆయన ఉక్రెయిన్ వైపు కాకుండా రష్యా వైపు ఎంచుకుంటే నొప్పిగా ఉంటుంది’ అని వ్యాఖ్యానించాడు. ప్రస్తుతం జెలెన్ స్కీ బ్రస్సెల్స్ లో ఈయూ నాయకుల సహాయం కోరుతున్నాడు. ఈ పరిణామాలు ఎటు వైపు దారితీస్తాయో తెలియాలంటే కొన్నాళ్లపాటు వేచిచూడాలి.
