సోమవారం ద్వై, శుక్రవారం త్రై.. ఈసారి కాకపోతే పరిస్థితి?
ఉక్రెయిన్ - రష్యా మధ్య జరుగుతున్న యుద్ధానికి ముగింపు పలకడంపై చర్చించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అవిరామంగా ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే.
By: Raja Ch | 17 Aug 2025 9:00 PM ISTఉక్రెయిన్ - రష్యా మధ్య జరుగుతున్న యుద్ధానికి ముగింపు పలకడంపై చర్చించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అవిరామంగా ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. రష్యా అధ్యక్షుడు పుతిన్ తో ఇప్పటికే అలాస్కాలో భేటీ అయ్యారు. అనంతరం సోమవారం ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ సమావేశం కానున్నారు. ఈ నేపథ్యంలో ముగ్గురు అధ్యక్షుల మధ్య సమావేశం అంశం తెరపైకి వచ్చింది.
అవును... ఉక్రెయిన్ - రష్యా యుద్ధం ఆగాలని అటు అగ్రరాజ్యంతో పాటు ఇటు యూరోపియన్ కంట్రీలు బలంగా కోరుకుంటున్నాయి. ఈ సమయంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ సోమవారం ట్రంప్ తో భేటీ అవ్వనున్నారు. ఈ సమావేశానికి యూరోపియన్ దేశాల నాయకులను కూడా ట్రంప్ ఆహ్వానించినట్లు తెలుస్తోంది. దీంతో ఈ భేటీ మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.
ఈ సమయంలో... ఫిన్ లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్ లేదా నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టే జెలెన్ స్కీతో పాటు రావచ్చని పొలిటికో నివేదించింది. స్టబ్, రుట్టే ఇద్దరూ ట్రంప్ తో సత్సంబంధాలను కొనసాగిస్తూ దౌత్యపరమైన బఫర్ లుగా వ్యవహరిస్తారు. ఈ సమయంలో ట్రంప్ - జెలెన్ స్కీల మధ్య ఎలాంటి ఘర్షణ జరగకుండా నిరోధించడం వీరి పని అని అంటున్నారు.
త్వరలో త్రైపాక్షిక భేటీ!:
అటు పుతిన్ తో భేటీ ముగిసిన అనంతరం సోమవారం జెలెన్ స్కీతోనూ చర్చలు జరగనున్న నేపథ్యంలో... త్రైపాక్షిక శిఖరాగ్ర సమావేశం గురించి ట్రంప్ జెలెన్ స్కీ ఫోన్ లో మాట్లాడుకొన్నారు. ఈ నేపథ్యంలో ముగ్గురు అధ్యక్షుల మధ్య సమావేశాన్ని ఆగస్టు 22న ఏర్పాటు చేయాలని అమెరికా అధ్యక్షుడు యోచిస్తున్నట్లు ఆ దేశ మీడియా సంస్థలు పేర్కొన్నాయి. ఈ విషయాన్ని పుతిన్ తో సమావేశం అనంతరం ట్రంప్ యూరోపియన్ నాయకులతో చెప్పినట్లు సమాచారం.
ఇదే విషయంపై జర్మన్ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్ మాట్లాడుతూ.. సోమవారం ట్రంప్, జెలెన్ స్కీల మధ్య సమావేశం జరిగిన అనంతరం ముగ్గురు నేతల మధ్య త్రైపాక్షిక సమావేశాం జరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. యుద్ధం ముగింపుపై సోమవారం కీలక ప్రకటన వెలువడుతుందని భావిస్తున్నట్లు తెలిపారు.
కాగా.. ఉక్రెయిన్ తో యుద్ధం గురించి ఇటీవల అలాస్కా వేదికగా ట్రంప్, పుతిన్ లు భేటీ అయ్యి రెండున్నర గంటలకు పైగా చర్చించిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ ఎలాంటి ఒప్పంద ఫలితమూ రాలేదు కానీ... చర్చలు సానుకూలంగా జరిగాయని ఇరువురు నేతలు ప్రకటించారు. సమావేశం గురించి ట్రంప్ మాట్లాడుతూ.. ఒప్పందంపై నిర్ణయం జెలెన్ స్కీ చేతుల్లోనే ఉందని అన్నారు.
