వైట్ హౌస్ కూల్చివేతలు స్టార్ట్... తన కలల గది కోసం ట్రంప్ సాహసం!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకునే నిర్ణయాలు ఏ స్థాయిలో ఉంటాయనేది తెలిసిన విషయమే.
By: Raja Ch | 22 Oct 2025 6:07 PM ISTఅమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకునే నిర్ణయాలు ఏ స్థాయిలో ఉంటాయనేది తెలిసిన విషయమే. అందులో కొన్ని అమెరికాలోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశం అవుతుంటాయి. ఈ క్రమంలో సుమారు రెండు శతాబ్దాలుగా అమెరికా అధ్యక్షుడి చారిత్రాత్మక నివాసంగా సేవలందిస్తోన్న వైట్ హౌస్ లోని తూర్పు వింగ్ విషయంలో ట్రంప్ బుల్డోజర్లకు పని చెప్పారు.
అవును... తన కలల గది బాల్ రూమ్ నిర్మాణం కోసం ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా... 1902లో నిర్మించిన ఈస్ట్ వింగ్ ను పాక్షికంగా కూల్చివేస్తున్నారు. ఈ భాగంలో సుమారు $250 మిలియన్ల (సుమారు రూ.2,000 కోట్ల) వ్యయంతో కొత్త బాల్ రూమ్ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ట్రంప్ వైట్ హౌస్ లో తన కలల ప్రాజెక్టుగా ఈ రూమ్ నిర్మాణాన్ని చెబుతున్నారు.
వాస్తవానికి ప్రస్తుతం వైట్ హౌస్ లో అతిపెద్ద హాల్ ‘ఈస్ట్ రూమ్’. దీనిలో సుమారు 200 మంది వరకూ కూర్చునే సామర్థ్యం ఉంది. అయితే... ఈ సైజు సరిపోదని.. స్టేట్ డిన్నర్ లు, ఇతర పెద్ద ఈవెంట్లకు ఇది చాలడం లేదని ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పెద్ద ఎత్తున అతిథులను వైట్ హౌస్ లోనే సౌకర్యవంతంగా ఆహ్వానించడానికి స్పెషల్ బాల్ రూమ్ అవసరమని తెలిపారు.
ఈ నేపథ్యంలోనే కొత్త, సువిశాలమైన 90,000 చదరపు అడుగుల బాల్ రూమ్ నిర్మాణాన్ని తలపెట్టినట్లు చెబుతున్నారు. ఈ కొత్త బాల్ రూమ్ లో 1,000 మంది కూర్చునే సామర్థ్యం కలిగి ఉంటుందని, భవిష్యత్తులో అధ్యక్షుడి ప్రమాణ స్వీకారోత్సవం వంటి కార్యక్రమాలకు కూడా ఇది ఉపయోగపడుతుందని చెబుతున్నారు.
ఈ ప్రాజెక్ట్ ప్రతిపాదించిన సమయంలో ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు.. కొత్త బాల్ రూమ్ వైట్ హౌస్ కు సమీపంలో ఉంటుందని, కూల్చివేతలు ఏమీ ఉండవని తెలిపారు. అయితే.. నిర్మాణ పనులు ప్రారంభమవగానే తూర్పు వింగ్ ముఖభాగంలో కొంత భాగం కూల్చివేశారు. మరోవైపు.. ఈ ప్రాజెక్ట్ కోసం ప్రభుత్వ సొమ్ము ఉపయోగించడం లేదని.. ప్రైవేట్ వ్యక్తుల నుంచి సమకూర్చిన ఫండింగ్ ద్వారా పూర్తి చేస్తున్నట్లు ట్రంప్ స్పష్టం చేశారు.
స్పందించిన నేషనల్ పార్క్ సర్వీస్ మాజీ చరిత్రకారుడు!:
వైట్ హౌస్, దాని పరిసర పార్కులు నేషనల్ పార్క్ సర్వీస్ (ఎన్.పీ.ఎస్.) ద్వారా నిర్వహించబడుతున్నప్పటికీ.. అధ్యక్షుడికి సాధారణంగా పునరుద్ధరణలు చేయడానికి విస్తృత అధికారాలు ఉంటాయని చెబుతున్నారు. ఈ సందర్భంగా స్పందించిన ఎన్.పీ.ఎస్. మాజీ చరిత్రకారుడు రాబర్ట్ కె సుట్టన్... వైట్ హౌస్ నిర్మాణంలో ఉన్నప్పుడు ఎల్లప్పుడూ ప్రజల ఆందోళన ఉంటుందని అన్నారు.
వైట్ హౌస్ నిర్మించబడినప్పటి నుండి దానికి సంబంధించి జరుగుతున్న ప్రతిదానితోనూ వివాదం ఉందని ఆయన అన్నారు. కాగా... ఏదైనా నిర్మాణానికి ఎన్.పీ.ఎస్. మార్గదర్శకాలు, కఠినమైన సమీక్షా ప్రక్రియను కలిగి ఉంటుంది. ప్రాజెక్ట్ కోసం లోతైన ప్రణాళికలను సమీక్షించడం, ఆర్కిటెక్ట్, డిజైన్లను పరిశీలించడంతో పాటు ఖర్చులను సమీక్షించడం వంటివి ఇందులో ఉంటాయి.
ఇదే సమయంలో... ప్రపంచవ్యాప్తంగా చారిత్రాత్మక భవనాల సంరక్షణను అధ్యయనం చేసే అంతర్జాతీయ లాభాపేక్షలేని సంస్థ సొసైటీ ఆఫ్ ఆర్కిటెక్చరల్ హిస్టారియన్స్ కూడా కొత్త వైట్ హౌస్ పునరుద్ధరణ ప్రాజెక్టును విమర్శించారు. ప్రతిపాదిత బాల్ రూమ్ చేర్పులపై చాలా ఆందోళన వ్యక్తం చేస్తోన్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు!
ఇది గత 83 సంవత్సరాలలో దాని బాహ్య రూపానికి వచ్చిన మొదటి ప్రధాన మార్పు అవుతుందని పేర్కొన్నారు. అమెరికన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆర్కిటెక్ట్స్ కూడా దీనిపై ఆందోళన వ్యక్తం చేసి, ప్రాజెక్ట్ యొక్క పారదర్శక సమీక్షకు పిలుపునిచ్చింది. కాగా... తూర్పు వింగ్ ను 1902లో నిర్మించగా.. చివరిగా 1942లో సవరించారు.
మార్పులు ఇదే మొదటిసారి కాదు!:
అయితే వైట్ హౌస్ లో మార్పులు, చేర్పులు చేయడం ఇదే తొలిసారి కాదు. ట్రంప్ కంటే ముందు అధ్యక్షుడు బరాక్ ఒబామా.. వైట్ హౌస్ టెన్నిస్ కోర్టును బాస్కెట్ బాల్ ఆటలను కూడా నిర్వహించడానికి వీలుగా మార్చారు. రిచర్డ్ నిక్సన్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు వైట్ హౌస్ స్విమ్మింగ్ పూల్ ను ప్రెస్ రూమ్ గా మార్చారు.
ఈ ఇండోర్ పూల్ ను మొదట 1933లో అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ డి రూజ్ వెల్ట్ కోసం ఏర్పాటు చేశారు. ఆయన పోలియో నిర్ధారణ కారణంగా వ్యాయామం కోసం క్రమం తప్పకుండా ఈత కొట్టేవారు. అది మూసివేయబడిన తర్వాత.. జెరాల్డ్ ఫోర్డ్ 1975లో ఒక బహిరంగ పూల్ ను ఏర్పాటు చేశారు.
