వీకెండ్‌లోనే దాడులు ఎందుకు? ట్రంప్ వ్యూహంపై మార్కెట్ విశ్లేషణ
డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాలు అంతర్జాతీయ రాజకీయాల్లో ఎప్పుడూ సంచలనమే. అయితే ఆయన హయాంలో జరిగిన ప్రధాన దాడులు, ముఖ్యంగా ఇరాన్, వెనిజులా వంటి దేశాలపై తీసుకున్న కఠిన చర్యలన్నీ శని, ఆదివారాల్లోనే జరగడం గమనార్హం.
By: Madhu Reddy | 4 March 2026 5:48 PM ISTడొనాల్డ్ ట్రంప్ నిర్ణయాలు అంతర్జాతీయ రాజకీయాల్లో ఎప్పుడూ సంచలనమే. అయితే ఆయన హయాంలో జరిగిన ప్రధాన దాడులు, ముఖ్యంగా ఇరాన్, వెనిజులా వంటి దేశాలపై తీసుకున్న కఠిన చర్యలన్నీ శని, ఆదివారాల్లోనే జరగడం గమనార్హం. దీనిని కేవలం యాదృచ్చికం అని కొట్టిపారేయలేం. దీని వెనుక ప్రపంచ ఆర్థిక వ్యవస్థను, ముఖ్యంగా స్టాక్ మార్కెట్లను కుప్పకూలకుండా కాపాడే ఒక తెలివైన 'మార్కెట్ ప్లాన్' దాగి ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. అసలు ఈ 'వీకెండ్ వార్స్' వెనుక ఉన్న అసలు కధ గురించి ఇప్పుడు చూద్దాం.
స్టాక్ మార్కెట్ కుదుపులను అడ్డుకునే ప్లాన్:
సాధారణంగా ఏవైనా రెండు దేశాల మధ్య యుద్ధం లేదా దాడులు జరిగితే, దాని ప్రభావం వెంటనే స్టాక్ మార్కెట్లపై పడుతుంది. ఇన్వెస్టర్లు భయంతో తమ షేర్లను అమ్మేయడం వల్ల మార్కెట్లు కుప్పకూలే ప్రమాదం ఉంది. కానీ, ట్రంప్ ఈ దాడులను శని, ఆదివారాల్లో ప్లాన్ చేయడం వల్ల మార్కెట్లకు సెలవు ఉంటుంది. ఇక దీనివల్ల ఇన్వెస్టర్లు తక్షణమే స్పందించి షేర్లను విక్రయించడానికి అవకాశం ఉండదు. యుద్ధం వంటి గంభీరమైన వార్త విన్నప్పుడు కలిగే ఆందోళన మార్కెట్ పనిదినాల్లో అయితే తీవ్ర నష్టాలకు దారితీస్తుంది, అదే వీకెండ్ అయితే ఆ ప్రభావం తగ్గుతుంది.
48 గంటల వెసులుబాటు - ఇన్వెస్టర్ల విశ్లేషణ:
వీకెండ్‌లో దాడి జరగడం వల్ల ఇన్వెస్టర్లకు దాదాపు 48 గంటల సమయం దొరుకుతుంది. ఈ సమయంలో వారు యుద్ధం ఎంత తీవ్రంగా ఉంది? దానివల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై పడే ప్రభావం ఎంత? అన్న విషయాలను నిశ్శితంగా విశ్లేషించుకునే అవకాశం ఉంటుంది. సోమవారం ఉదయం మార్కెట్లు తెరిచే సమయానికి పరిస్థితిపై ఒక స్పష్టమైన అంచనా వస్తుంది. ఇక దీనివల్ల మార్కెట్లలో భారీ పతనం తప్పి, స్థిరత్వం వచ్చే అవకాశం ఉంటుంది. ఇన్వెస్టర్లు కూడా తమ పోర్ట్‌ఫోలియోలను ఎలా కాపాడుకోవాలో ఒక నిర్ణయానికి రావచ్చు.
రాజకీయ వ్యూహం మరియు ఆర్థిక భద్రత:
ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయాలు అమెరికా ఆర్థిక ప్రయోజనాలను కాపాడటంలో కీలక పాత్ర పోషించాయి. ఒకవైపు శత్రు దేశాలపై దాడులు చేస్తూనే, ఇక మరోవైపు స్వదేశీ మార్కెట్లు దెబ్బతినకుండా జాగ్రత్త పడటం ఆయన వ్యూహ చతురతకు నిదర్శనం. ఇరాన్ లాంటి దేశాలపై దాడులు జరిగినప్పుడు చమురు ధరలు పెరిగే అవకాశం ఉన్నా, వీకెండ్ గ్యాప్ వల్ల ఆ పెరుగుదల అదుపులోనే ఉంది.ఇక రాజకీయ లక్ష్యాలను సాధిస్తూనే, ఆర్థికంగా దేశాన్ని సురక్షితంగా ఉంచడం ఈ 'వీకెండ్ వార్స్' వెనుక ఉన్న అసలు రహస్యం. మొత్తానికి యుద్ధం అంటే కేవలం తుపాకులు, బాంబులే కాదు.. దాని వెనుక వందల కోట్ల డాలర్ల ఆర్థిక లెక్కలు కూడా ఉంటాయని ట్రంప్ వ్యూహాలు నిరూపించాయి అంటున్నారు నిపుణులు.
