ఇరాన్ యుద్ధానికి సంబంధించి ఈ రోజుకు ట్రంప్ ప్రకటన ఇది
ప్రపంచానికి పెద్దన్న అమెరికా అధ్యక్షుడు అనేటోడి నోటి నుంచి ఒక మాట వచ్చిందంటే.. దానికో విలువ.. మర్యాద ఉండేది.
By: Garuda Media | 2 April 2026 9:40 AM ISTప్రపంచానికి పెద్దన్న అమెరికా అధ్యక్షుడు అనేటోడి నోటి నుంచి ఒక మాట వచ్చిందంటే.. దానికో విలువ.. మర్యాద ఉండేది. అదేమీ లేకుండా చేసిన ఘనత ట్రంప్ కు మాత్రమే దక్కుతుంది. ఏ నిమిషాన ఏం మాట్లాడతారో అర్థం కాని పరిస్థితి. ఆచితూచి మాట్లాడాల్సిన ఆయన.. ఆ క్షణంలో తన మూడ్ కు తగ్గట్లుగా రియాక్టు కావటం.. అంతలోనే భీకర దాడులు అంటూనే.. అంతలోనే వెనక్కి తగ్గటం లాంటివి ఎక్కువ అయ్యాయి. ఇరాన్ తో యుద్ధం మొదలైన నాటి నుంచి ఇలాంటి వేరియేషన్స్ మరింత పెరిగిన పరిస్థితి. ఇదిలా ఉండతా.. తాజాగా ఇరాన్ యుద్ధం మీద భీకర వార్నింగ్ ఇచ్చారు.
ఇరాన్ తనతో ఒప్పందానికి రావాలని.. లేకుంటే ఆ దేశాన్ని రాతియుగానికి తీసుకెళతామని వార్నింగ్ ఇచ్చిన ట్రంప్.. ‘‘రానున్న రెండు.. మూడు వారాల్లో ఇరాన్ పై భీకర దాడులు చేస్తాం. యుద్ధం ఇప్పట్లో ఆగే పరిస్థితి లేదు. ఆపరేషన్ ఎపిక్ ప్యూరీ కొనసాగుతుంది. ఇరాన్ నాయకత్వం అంతమైంది. ఆ దేశ నౌకాదళం.. ఎయిర్ ఫోర్స్ తుడిచి పెట్టుకుపోయాయి’’ అని వ్యాఖ్యానించారు.
ఇరాన్ విషయంలో తాము ఏం అనుకున్నామో అన్ని లక్ష్యాల్ని పూర్తి చేసే దిశగా ముందుకు వెళుతున్నట్లుగా చెప్పిన ట్రంప్.. తాజాగా జరుగుతున్న యుద్ధంలో ఇరాన్ భారీగా నష్టపోయిందన్నారు. వారి సైనిక సామర్థ్యాలు పూర్తిగా ధ్వంసమైనట్లుగా పేర్కొన్న ట్రంప్.. ‘వారి నేవీ.. వైమానిక దళాలు తుడిచిపెట్టుకుపోయాయి. ఆ దేశంలోని కీలక నాయకత్వాల్ని తొలగించాం. ఇరాన్ అణ్వాయుధాలు కలిగి ఉండేందుకు వీల్లేదు. ఇరాన్ చమురును లక్ష్యంగా చేసుకొని ఇప్పటివరకు దాడి చేయలేదు. అవసరమైతే మేం వాటిని కూడా లక్ష్యంగా చేసుకుంటాంః’ అంటూ హెచ్చరించారు.
యుద్ధం నేపథ్యంలో ఇంధన ధరలు పెరిగినప్పటికీ.. అదంతా తాత్కాలికమేనని.. త్వరలోనే యుద్ధం ముగుస్తుందని పేర్కొన్నారు. అమెరికాను అంతం చేయాలని ఇరాన్ భావించిందని.. అందుకే దాని పని తాము పట్టినట్లుగా ఆయన మాటలు ఉన్నాయి. త్వరలోనే ఇరాన్ పై యుద్ధాన్ని ముగిస్తామని చెప్పిన ట్రంప్.. తాము నిర్దేశించుకున్న లక్ష్యాల్ని చేరుకున్నట్లు ప్రకటించారు. అసలు మొత్తం యుద్ధాన్నినాలుగు వారాల్లో పూర్తి చేస్తామనిచెప్పిన పెద్దమనిషి.. మరో మూడు వారాలు సాగుతుందని చెబుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ట్రంప్ చేసే ఏ వ్యాఖ్యను అయినా.. ఆరోజుకు.. ఆ పరిస్థితికి మాత్రమే తప్పించి.. అదే మాట మీద ఆయన నిలుస్తారని.. నిలబడతారన్న గ్యారెంటీ లేని పరిస్థితి.
ఇలా ఎందుకు చెప్పాల్సిన వస్తుందంటే.. ఆయన మాటలు తరచూ మారిపోవటమే. ఉదాహరణకు హర్మూజ్ జలసంధి విషయాన్నే తీసుకుంటే.. తొలుత సదరు జలసంధిని తెరిపించటం తమ పని కాదన్న ఆయన.. ఆ తర్వాత తన స్వరాన్ని మార్చి.. హర్మూజ్ ను తెరిచి.. స్వేచ్ఛగా ఉంచే వరకు దాడులు చేస్తామని చెప్పటమే ఇందుకు నిదర్శనం. బుధవారం ఉదయం ట్రంప్ మాట్లాడిన మాటలకు సాయంత్రానికి ఆయన చేసిన వ్యాఖ్యలకు సంబంధం లేకపోవటం లాంటివి చూస్తే..ట్రంప్ చెప్పే ఏ మాట అయినా.. ఆ రోజుకు.. ఆ మాటకు వస్తే ఆ పూటకు మాత్రమే అన్న భావన కలుగక మానదు.
