యుద్ధం ముగింపునకు.. ట్రంప్ ప్రకటన వెనుక జరిగింది ఇదే
యుద్ధం ముగింపునకు వచ్చింది. ఇది ట్రంప్ తాజా ప్రకటన. ఈ ప్రకటన క్రూడ్ ఆయిల్ ధరలను తగ్గించింది.
By: A.N.Kumar | 10 March 2026 3:58 PM ISTయుద్ధం ముగింపునకు వచ్చింది. ఇది ట్రంప్ తాజా ప్రకటన. ఈ ప్రకటన క్రూడ్ ఆయిల్ ధరలను తగ్గించింది. కానీ ఇంకా అనిశ్చితి తొలగలేదు. ట్రంప్ తగ్గకపోతే మళ్లీ క్రూడ్ ఆయిల్ ధరలు ఆకాశాన్నంటుతాయి. ఇది సగటు అమెరికన్ ను దెబ్బతీస్తుంది. త్వరలో మిడ్ టర్మ్ ఎన్నికలు ఉన్నాయి. ఇది రిపబ్లికన్లను భయపెడుతున్న అంశం. డెమొక్రాట్లకు లాభం చేకూర్చుతుందన్న భయం. అందుకే ట్రంప్ యుద్ధం ముగింపు గురించి మాట్లాడారన్న చర్చ ఉంది.
అమెరికా, ఇజ్రాయిల్ ఇరాన్ పై దాడితో క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా పెరిగాయి. ఇరాన్ హార్మూజ్ జలసంధిని మూసేసింది. గల్ఫ్ దేశాలపై దాడులు చేస్తోంది. ఫలితంగా ఆయిల్ సరఫరా ఆగిపోయింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి పెరుగుతోంది. దీంతో పాటు అమెరికాలో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. పెరిగిన క్రూడ్ ఆయిల్ ధరలు సగటు అమెరికన్ల జీవనాన్ని భారంగా మార్చుతోంది. త్వరలో అమెరికాలో మిడ్ టర్మ్ ఎన్నికలు రాబోతున్నాయి. ట్రంప్ యుద్ధం కొనసాగిస్తే.. క్రూడ్ ఆయిల్ ధరలు 200 డాలర్లకు వెళ్లినా ఆశ్చర్యపోనక్కరలేదు. అదే జరిగితే మిడ్ టర్మ్ ఎన్నికల్లో ట్రంప్ పార్టీ ఓటమి తప్పదు. ఎందుకంటే క్రూడ్ ఆయిల్ ధరల పెరుగుదల.. అన్ని వస్తువుల ధరలనూ పెంచేస్తుంది. ఫలితంగా సగటు అమెరికన్ జీవనం అద్వానంగా తయారవుతుంది. ఇది ఎన్నికల్లో పెద్ద ప్రభావం చూపుతుంది. డెమొక్రాట్లకు పరిస్థితిని అనుకూలంగా మార్చుతుంది. ట్రంప్ అడ్వయిజర్లు ఈ విషయాన్ని తెలియజేయడంతోనే ట్రంప్ ఇరాన్ తో యుద్ధం ముగింపు గురించి మాట్లాడుతున్నట్టు ప్రచారం సాగుతోంది.
ట్రంప్ తగ్గితే.. ఇరాన్ గెలిచినట్టే !
ఎందుకంటే ఇరాన్ నేరుగా అమెరికాపై దాడి చేయడం లేదు. అమెరికా ఆర్థిక వ్యవస్థపైనా, అమెరికా మిత్రదేశాలపైన గల్ఫ్ దేశాల ఆర్థిక వ్యవస్థ, ఆహార సరఫరాలపై దాడి చేస్తోంది. పెరిగిన క్రూడ్ ఆయిల్ ధరల వల్ల అమెరికన్ కంపెనీలు లాభపడొచ్చు. కానీ సగటు అమెరికన్లు మాత్రం నష్టపోతారు. ఇది ట్రంప్ కు ఎన్నికల్లో ఇబ్బందికర పరిణామం. ట్రంప్ కు మిత్రులైన గల్ఫ్ దేశాల ఆయిల్ సరఫరా వ్యవస్థను ఇరాన్ దెబ్బతీసింది. దీంతో పాటు కీలకమైన ఆహార సరఫరా వ్యవస్థను దెబ్బకొట్టింది. గల్ఫ్ దేశాల్లో పంటలు పండించరు. విదేశాల నుంచి దిగుమతి చేసుకుటారు. మెజార్టీగా హార్మోజ్ జలసంధి నుంచే గల్ఫ్ దేశాలకు కావాల్సిన ఆహారం వస్తుంది. కానీ ఇప్పుడు ఇరాన్ హార్మూజ్ జలసంధిని ఆపేసింది. తద్వారా గల్ఫ్ దేశాల ఆహార సరఫరా వ్యవస్థను దెబ్బకొట్టింది. ఆయిల్ ధరలు పెరిగినా జనం తట్టుకుంటారు. కానీ ఆహారం లేకుండా తట్టుకోలేరు. యుద్ధం నెలలపాటు కొనసాగితే గల్ఫ్ దేశాల్లో ఉన్న ఆహార నిల్వలు తగ్గిపోయి.. ఇబ్బందులు తలెత్తుతాయి. ఇది అమెరికాపై పరోక్ష ఒత్తిడికి కారణం అవుతుంది. అందుకే ఇరాన్ వ్యూహాత్మకంగా ఆయిల్ సరఫరా వ్యవస్థను, ఆహార సరఫరా వ్యవస్థను డ్యామేజ్ చేసి ట్రంప్ ను దారికొచ్చేలా చేస్తోందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ధరలు పెరిగితే. మద్దతు కరువు
క్రూడ్ ఆయిల్ ధరలతో వస్తువుల ధరలు పెరిగితే.. అమెరికన్ల మద్దతు ట్రంప్ కు కరువవుతుంది. యుద్దానికి క్రమంగా అమెరికన్ల మద్దతు కరువవుతుంది. ఇది మిడ్ టర్మ్ ఎన్నికల్లో ప్రభావం చూపుతుంది. మరోవైపు ఇరాన్ తగ్గడంలేదు. వ్యూహాత్మకంగా దాడి చేస్తోంది. ఇరాన్ తో పోల్చితే అమెరికాకే యుద్ధం ఖర్చు ఎక్కువగా ఉందన్న అంచనా ఉంది. ఇరాన్ తక్కువ ధర డ్రోన్లను దాడికి ఉపయోగిస్తే.. వాటిని ఆపడానికి అమెరికా మిలియన్ల విలువైన ఆయుధ వ్యవస్థను వాడాల్సి వస్తోంది. తద్వారా యుద్ధం ఖర్చు అమెరికాకే ఎక్కువగా ఉంది. వీటన్నింటిని గమనించాక ట్రంప్ యుద్ధం త్వరలో ముగింపునకు వస్తుందన్న ప్రకటన చేసి ఉంటారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
