Begin typing your search above and press return to search.

ఒక మీడియాపై ట్రంప్ నిషేధం.. దేశంలోని మొత్తం మీడియా వ్యవస్థే ఏకమై అధ్యక్షుడిని బ్యాన్ చేసేసింది..

విషయం చాలా సింపుల్. సెప్టెంబర్ 18న ట్రంప్ మహానుభావుడికి హఠాత్తుగా కోపం వచ్చింది.

By:  A.N.Kumar   |   22 Sept 2026 10:27 AM IST
ఒక మీడియాపై ట్రంప్ నిషేధం.. దేశంలోని మొత్తం మీడియా వ్యవస్థే ఏకమై అధ్యక్షుడిని బ్యాన్ చేసేసింది..
X

అమెరికా రాజకీయాల్లో నాటకీయ పరిణామాలకు ఏమీ కొదవలేదు.. కానీ ఈసారి డ్రామా వైట్‌హౌస్ ప్రెస్ రూమ్‌ నుంచి నేరుగా కోర్టు మెట్ల వరకు చేరింది. "నాకు నచ్చని వార్తలు రాస్తే గేటు బయట నిలబెడతా" అని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హుకుం జారీ చేస్తే "అయితే మేం కూడా కెమెరాలు మోసేది లేదు.. రికార్డు చేసేది లేదు" అంటూ అమెరికా ప్రధాన న్యూస్ ఛానెళ్లు గట్టిగానే షాకిచ్చాయి. 'ట్రంప్ మాస్టర్ ప్లాన్' అనుకున్న చోట మీడియా కూటమి 'రివర్స్ స్కెచ్' వేయడంతో కథ ఆసక్తికరంగా మారింది.

ఏం జరిగింది? నచ్చకపోతే ఫేక్ న్యూస్ యేనా?

విషయం చాలా సింపుల్. సెప్టెంబర్ 18న ట్రంప్ మహానుభావుడికి హఠాత్తుగా కోపం వచ్చింది. సీఎన్ఎన్ , ఎమ్ఎస్ నౌ , పొలిటికో సంస్థలు తనపై "ఫేక్ న్యూస్" ప్రసారం చేస్తున్నాయంటూ వాటిని వైట్‌హౌస్ నుంచి నిషేధిస్తున్నట్లు ప్రకటించారు. మరుసటి రోజే ఆయా సంస్థల విలేకరులకు ఎంట్రీ పాస్‌లు రద్దయిపోయాయి. "మా ఇష్టం.. మా వైట్‌హౌస్" అనే తరహాలో ప్రెస్ యాక్సెస్ నిలిపివేశారు.

అసలు ‘పూల్ కవరేజ్’ ట్విస్ట్ ఏంటంటే..

అధ్యక్షుడు ఎక్కడికి వెళ్లినా ఏం మాట్లాడినా ప్రతి రోజూ డజన్ల కొద్దీ ఛానెళ్లు కెమెరాలు పట్టుకుని వెంటపడటం కష్టం కాబట్టి వారు ఒక 'పూల్ కవరేజ్' విధానాన్ని పాటిస్తారు. రోజూ ఒక నెట్‌వర్క్ ఫుటేజ్ తీస్తే మిగతా ఛానెళ్లన్నీ దానిని వాడుకుంటాయి. ఒకరోజు సీఎన్ఎన్ వంతు వచ్చింది. అయితే ట్రంప్ సర్కార్ సీఎన్ఎన్‌ను నిషేధించడంతో మిగతా ఛానెళ్లు "పోనీలే ఆ రోజు మేం తీస్తాం" అని బాధ్యత తీసుకుంటాయనుకుంటే పొరపాటే.. ఏబీసీ, సీబీఎస్, ఎన్బీసీ, చివరకు ట్రంప్‌కు కొంచెం క్లోజ్ అనుకునే ఫాక్స్ న్యూస్ కూడా చేతులు కలిపాయి. "ఒకరిని తొక్కేస్తే మేమందరం చూస్తూ ఊరుకోం" అంటూ సంయుక్తంగా 'పూల్ కవరేజ్'ను నిలిపివేశాయి. "మీరు సీఎన్ఎన్‌ను రానీయకపోతే మేం అసలు కెమెరాలే ఆన్ చేయం" అని అధ్యక్షుడికే పెద్ద షాకిచ్చాయి.

సొంతంగా రీల్స్ చేసుకుంటున్న వైట్‌హౌస్

ఛానెళ్లన్నీ చేతులెత్తేయడంతో వైట్‌హౌస్‌కు ఏం చేయాలో తోచలేదు. చివరికి తమ సొంత సిబ్బందితో వీడియోలు తీయించి ప్రజలకు ప్రసారం చేయడం మొదలుపెట్టింది. అంటే ఒక రకంగా అధికారిక రీల్స్ అన్నమాట.. వార్తలు కవర్ చేయడానికి మీడియా లేకపోతే, సొంతంగా 'సెల్ఫీ వీడియోలు' తీసుకుని ప్రచారం చేసుకోవాల్సిన పరిస్థితి ప్రెసిడెంట్‌కు రావడం నిజంగానే పెద్ద విచిత్రం.

కోర్టు మెట్లెక్కిన పత్రికా స్వేచ్ఛ

ఇక నిషేధానికి గురైన సీఎన్ఎన్, పొలిటికోలు ఊరికే ఉంటాయా? అమెరికా రాజ్యాంగంలోని 'ఫస్ట్ అమెండ్‌మెంట్' పత్రికా స్వేచ్ఛ ను చూపించి ఫెడరల్ కోర్టులో కేసు వేశాయి. జర్నలిజం అంటే ప్రభుత్వానికి భజన చేయడం కాదు.. ప్రశ్నించడం అని గుర్తుచేస్తూ న్యాయపోరాటానికి దిగాయి.

ఒక నెట్‌వర్క్‌ను తొక్కిపడేయాలని చూస్తే దేశంలోని మొత్తం మీడియా వ్యవస్థే ఏకమై అధ్యక్షుడికే సవాలు విసిరింది. ఇది కేవలం "ట్రంప్ వర్సెస్ సీఎన్ఎన్" వార్ మాత్రమే కాదు.. "ప్రభుత్వ నియంత్రణ వర్సెస్ పత్రికా స్వేచ్ఛ" మధ్య జరుగుతున్న అసలైన సమరం. మరి ఈ పవర్ గేమ్‌లో కోర్టులు ఎవరికి సపోర్ట్ చేస్తాయో వైట్‌హౌస్ తదుపరి ఎలాంటి డ్రామాకు తెరతీస్తుందో చూడాలి.