Begin typing your search above and press return to search.

ట్రంప్ చేసిందేమీ లేదు.. అమెరికా నిర్ణయాల్లో అతడిదే కీరోల్

ఇరాన్‌పై దాడులు, సిరియా మీద బాంబుల దాడులు, ఉక్రెయిన్‌ వ్యవహారంలో పుతిన్‌తో స్నేహం చేస్తూనే వెనక నుంచి సపోర్ట్ చేయడం వంటి చర్యలు ట్రంప్ నిజంగా "శాంతి దూత"నా అనే ప్రశ్నను తలెత్తిస్తున్నాయి.

By:  A.N.Kumar   |   12 Oct 2025 4:00 AM IST
ట్రంప్ చేసిందేమీ లేదు.. అమెరికా నిర్ణయాల్లో అతడిదే కీరోల్
X

డొనాల్డ్ ట్రంప్ మళ్లీ ప్రపంచ రాజకీయాల్లో హాట్ టాపిక్ అవుతున్నారు. "నేనే ప్రపంచ శాంతి దూతను," "నా పాలనలో యుద్ధాలు ఆగిపోయాయి" అంటూ ఆయన చేస్తున్న ప్రచారం అంతా ఒకవైపు అతిశయోక్తి మాత్రమే అని ఇప్పుడు స్పష్టమవుతోంది. వాస్తవానికి ట్రంప్ దశలో అమెరికా సామ్రాజ్యవాదం మరింత దూకుడుగా మారింది. ఇరాన్‌పై దాడులు, సిరియా మీద బాంబుల దాడులు, ఉక్రెయిన్‌ వ్యవహారంలో పుతిన్‌తో స్నేహం చేస్తూనే వెనక నుంచి సపోర్ట్ చేయడం వంటి చర్యలు ట్రంప్ నిజంగా "శాంతి దూత"నా అనే ప్రశ్నను తలెత్తిస్తున్నాయి.

ఇజ్రాయిల్–హమాస్ ఒప్పందం: ట్రంప్ కాదని, కుష్నర్ అని వాస్తవం

ఇటీవల ఇజ్రాయిల్–హమాస్ మధ్య పీస్ డీల్ కుదిరి కాల్పుల విరమణ అమల్లోకి రావడంతో గ్లోబల్ మీడియా దీని వెనక ట్రంప్ ఉన్నాడని ప్రచారం చేసింది. కానీ ఇప్పుడు వెలుగులోకి వస్తున్న వివరాలు వేరే వాస్తవాన్ని చెబుతున్నాయి. ఈ ఒప్పందం వెనుక కీలక పాత్ర పోషించిన వ్యక్తి ట్రంప్ అల్లుడు, వైట్ హౌస్ సీనియర్ సలహాదారు అయిన జారెడ్ కుష్నర్.

అమెరికా రాయబారి స్టీవ్ విట్కాఫ్‌తో కలిసి కుష్నర్ నేరుగా ఇజ్రాయిల్ ప్రధానమంత్రి నెతన్యాహూ‌తో చర్చలు జరిపాడు. సమస్యను కేవలం దౌత్య మార్గంలో కాకుండా ఒక వ్యాపార దృక్పథంతో పరిష్కారం కనుగొనడానికి ప్రయత్నించాడు. హమాస్ మొదట అంగీకరించినప్పటికీ, ఇజ్రాయిల్ కొన్ని కారణాల వల్ల వెనుకంజ వేసిన సందర్భంలో కుష్నర్ చేసిన మధ్యవర్తిత్వం, గరిష్ట ఒత్తిడి వ్యూహం కీలకమైంది. ఈ ఒత్తిడి వల్లే ఇజ్రాయిల్ ఒప్పందానికి అంగీకరించింది. ఒప్పందానికి ట్రంప్ 20-పాయింట్ల ప్రణాళిక మార్గదర్శకంగా ఉన్నప్పటికీ, దాన్ని అమలు చేయడంలో కుష్నర్ పాత్రే ప్రముఖంగా ఉంది.

* ట్రంప్‌కు క్రెడిట్ పోతే, కుష్నర్‌కి లాభం!

ఈ శాంతి ఒప్పందంతో ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకోవాల్సిన ట్రంప్ క్రెడిట్ అతని అల్లుడికి వెళ్లడం రాజకీయంగా ఆసక్తికర పరిణామం. దీనివల్ల కుష్నర్‌ భవిష్యత్ రాజకీయ ప్రాధాన్యం మరింత పెరిగిందని అమెరికా రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఇంతవరకు ట్రంప్ ఫ్యామిలీ లోపలే శక్తి సమీకరణలు ఉన్నా, ఈ పీస్ డీల్ తర్వాత జారెడ్ కుష్నర్‌ను అధికార పార్టీ తరఫున వచ్చే ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పరిగణలోకి తీసుకోవచ్చనే చర్చలు మొదలయ్యాయి. ఒక విజయవంతమైన అంతర్జాతీయ ఒప్పందం అతనికి గట్టి పునాది వేసింది.

* అమెరికా ఆధిపత్యం – ముసుగులో శాంతి రాజకీయాలు

ఇజ్రాయిల్–హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒక సానుకూల పరిణామం అయినప్పటికీ, దీని వెనుక ఉన్న అమెరికా వ్యూహం ముఖ్యమైనది. ఇది మధ్యప్రాచ్యంలో తన ఆధిపత్యాన్ని బలోపేతం చేసుకునే చర్యగా కనిపిస్తోంది.

అమెరికా తాను "శాంతి దూత" గా చెప్పుకోవడం వెనుక అసలు ఉద్దేశం ప్రపంచ వేదికపై తన ప్రభావాన్ని నిలబెట్టుకోవడమే. ముఖ్యంగా ఇరాన్ వంటి దేశాలను ఏకాకిని చేసి, ఈ ప్రాంతాన్ని తన చెప్పుచేతల్లో ఉంచుకోవడానికి శాంతి చర్చలను ఒక సాధనంగా వినియోగిస్తున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ట్రంప్ తన అబ్రహాం ఒప్పందాలను మరింత విస్తరించడానికి ఈ కాల్పుల విరమణను ఒక అవకాశంగా చూస్తున్నారు.

ట్రంప్ చేస్తున్న "ప్రపంచ శాంతి దూత" ప్రచారం వాస్తవానికి రాజకీయ మేకప్ మాత్రమే. వాస్తవ శాంతి చర్చల వెనక, ముఖ్యంగా తుది దశ చర్చల్లో కీలక పాత్ర పోషించింది ఆయన అల్లుడు జారెడ్ కుష్నర్‌ వ్యూహం.. అమెరికా యొక్క గరిష్ట ఒత్తిడి విధానం. ట్రంప్‌ పాత్ర కేవలం ఆ ప్రణాళికను ప్రకటించడం.. రాజకీయంగా దానికి మద్దతు ఇవ్వడం ద్వారా సింబాలిక్‌గా మాత్రమే ఉంది. అయినా ప్రపంచ మీడియా ఆయనను ముందుకు నెట్టడం, అమెరికా రాజకీయాలు ఎలా ఇమేజ్ పాలిటిక్స్ చుట్టూ తిరుగుతున్నాయో చూపిస్తోంది.

ట్రంప్ చేసినది శాంతి కోసం కాదు.. అమెరికా ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడానికే. కానీ చరిత్రలో గుర్తింపుని పొందేది చివరకు ఆయన అల్లుడు కుష్నర్ అయ్యే అవకాశముంది.