Begin typing your search above and press return to search.

చమురుపై ట్రంప్ కు ఈ భారీ మోజు ఎందుకో తెలుసా..!

ప్రపంచ చమురు సామ్రాజ్యాన్ని తాను శాసించాలి అన్నట్లుగా ట్రంప్ ప్రవర్తిస్తున్న సంగతి తెలిసిందే.

By:  Raja Ch   |   11 Jan 2026 7:00 PM IST
చమురుపై ట్రంప్  కు ఈ భారీ మోజు ఎందుకో తెలుసా..!
X

ప్రపంచ చమురు సామ్రాజ్యాన్ని తాను శాసించాలి అన్నట్లుగా ట్రంప్ ప్రవర్తిస్తున్న సంగతి తెలిసిందే. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోళ్లపైనే.. భారత్ ఎక్కడ నుంచి కొనుగోలు చేయాలో కూడా ఆయనే చెబుతారు! ఈ క్రమంలో వెనిజువెలా పై ట్రంప్ కన్నుపడింది.. ఆ దేశంపై నార్కో టెర్రరిస్టు ముద్ర వేశారు. అయితే.. ఇప్పటికే భారీగా నిల్వలున్న అమెరికా.. ఇంకా పెద్ద ఎత్తున కొనుగోళ్లకు ఎందుకు ఈ స్థాయిలో ఆసక్తి చూపిస్తుందనేది ఆసక్తిగా మారింది. దీనికి పలు కారణాలు తెరపైకి వస్తున్నాయి.

అవును... తన మాట వింటే ముద్దులు, లేకపోతే గుద్దులు అన్నట్లుగా ప్రపంచం దేశాలపై పడిపోతున్న ట్రంప్ ఇటీవల వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన భార్య సెలియా ఫ్లోరెస్‌ ను అరెస్ట్‌ చేసి ప్రపంచాన్ని నివ్వెరపోయేలా చేశారు. ఆపై ఆ దేశపు చమురు నిల్వలు పూర్తిగా, నిరవధికంగా తమ ఆధీనంలోనే ఉంటాయని ప్రకటించారు. ఈ స్థాయిలో వెనిజువెల పై ట్రంప్ కన్ను వేయడానికి గల కారణం.. ఈ భూమ్మీద అత్యధిక చమురు నిల్వలు అక్కడే ఉండటం!

వాస్తవానికి ప్రపంచంలో అత్యధికంగా చమురు ఉత్పత్తి అమెరికాలోనే జరుగుతుంది. ఇందులో భాగంగా... గత ఏడాది రోజుకి 1.34 కోట్ల బ్యారెళ్ల క్రూడాయిల్ ను ఆ దేశం అమ్మగలిగింది. అయినప్పటికీ ఇతర దేశాల నుంచి పెద్ద ఎత్తున చమురు కొనాలని ట్రంప్ పంతం పట్టుకుంటున్నారు. ఇందులో భాగంగా... గత ఏడాదిలో సుమారు 20 లక్షల బ్యారెళ్లను కొనుగోలు చేసింది. అయినప్పటికీ ట్రంప్ ఆశ చావడం లేదు. అందుకు కారణం.. హెవీ క్రూడ్, లైట్ క్రూడ్ ఆయిల్ అమ్మకాలు, కొనుగోళ్లలో ఉన్న తేడా కూడా!

వాస్తవానికి 1970లలో అధిక చమురు ధరలు, కొరత కారణంగా అమెరికా ఉత్పత్తి చేసిన దానికంటే ఎక్కువ చమురును వినియోగించింది. అప్పటి నుండి అమెరికా "ఇంధన స్వాతంత్ర్యం" విధానంపై దృష్టి సారించిందని చెబుతారు. పైగా వైశాల్యం దృష్ట్యా చూస్తే అమెరికా చాలా పెద్దది. ఈ క్రమంలో.. అలాస్కా నుండి తూర్పు తీరానికి చమురును రవాణా చేయడం కంటే.. అలాస్కా నుండి ఆసియాకు ముడి చమురును ఎగుమతి చేస్తూ.. దక్షిణ అమెరికా నుండి తూర్పు తీరానికి ముడి చమురును దిగుమతి చేసుకుంటుంది.

ఇదే సమయంలో... అమెరికా ఉత్పత్తి చేసే 'లైట్ క్రూడ్‌' విలువ ఎక్కువ. దీంతో.. వాళ్లు ఉత్పత్తి చేసే తేలికపాటి ముడి చమురును అధిక ధరకు విదేశాలకు అమ్మి.. విదేశాల్లో దొరికే 'హెవీ క్రూడ్‌'ను తక్కువ ధరకే కొంటోంది. అందుకు గల కారణం.. హెవీ క్రూడ్‌ ను శుద్ధి చేసే అత్యాధునిక సాంకేతిక పరిజానం కలిగిన రిఫైనరీలు అమెరికాలో ఉన్నాయి. ఇవి వెనుజెవెలా వంటి దేశాలకు అందుబాటులో లేవు. దీంతో.. అక్కడ నుంచి హెవీ క్రూడ్ ను దిగుమతి చేసుకుని, దాన్ని లైట్ క్రూడ్ గా మార్చి ఎక్కువ ధరకు అమ్ముతుందన్నమాట!