నాటో భవితవ్యం పై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. ప్రపంచ రాజకీయాల్లో మారుతున్న సమీకరణాలు!
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరోసారి అంతర్జాతీయ రాజకీయ వేదికపై ప్రకంపనలు సృష్టించారు.
By: A.N.Kumar | 3 April 2026 4:00 PM ISTఅమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరోసారి అంతర్జాతీయ రాజకీయ వేదికపై ప్రకంపనలు సృష్టించారు. ఉత్తర అట్లాంటిక్ సంధి సంస్థ (నాటో) నుంచి అమెరికా వైదొలగాల్సిన అవసరం ఉందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు అగ్రరాజ్య మిత్రదేశాల్లో ఆందోళనను, రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చను లేవనెత్తాయి. ముఖ్యంగా బ్రిటన్‌కు చెందిన ‘టెలిగ్రాఫ్’ ప్రతినిధితో మాట్లాడుతూ నాటో విషయంలో పునరాలోచన చేసే దశను దాటిపోయామని ఆయన అనడం కూటమి మనుగడపైనే ప్రశ్నలు సంధిస్తోంది.
అసంతృప్తికి అసలు కారణాలు
ట్రంప్ అసంతృప్తికి ప్రధానంగా రెండు కారణాలు కనిపిస్తున్నాయి. నాటో రక్షణ వ్యయంలో సుమారు 60 శాతం పైగా అమెరికానే భరిస్తోంది. ఇతర సభ్యదేశాలు తమ వాటాను సరిగ్గా చెల్లించడం లేదని.. అమెరికా పన్ను చెల్లింపుదారుల సొమ్ముతో యూరప్ దేశాలకు రక్షణ కల్పించడం సమంజసం కాదని ట్రంప్ వాదన. ఇరాన్, మధ్యప్రాచ్యంలో అమెరికా, ఇజ్రాయెల్ చేపడుతున్న సైనిక చర్యలకు నాటో దేశాలు పూర్తి స్థాయిలో సహకరించడం లేదని ఆయన భావిస్తున్నారు.
నాటో నిబంధనలు.. వాస్తవాలు
1949లో ఏర్పడిన నాటో కూటమి ప్రాథమిక లక్ష్యం ఉత్తర అమెరికా, యూరప్ ఖండాల రక్షణ. ఇందులో అత్యంత కీలకమైనది ఆర్టికల్-5. దీని ప్రకారం ఒక సభ్యదేశంపై దాడి జరిగితే అది కూటమిలోని అన్ని దేశాలపై జరిగిన దాడిగానే పరిగణించబడుతుంది. అయితే చరిత్రను పరిశీలిస్తే ఈ నిబంధన 2001 సెప్టెంబర్ 11న అమెరికాపై జరిగిన ఉగ్రదాడుల సమయంలోనే మొదటిసారిగా ఏకైకసారిగా అమలైంది. అంటే అమెరికా కష్టాల్లో ఉన్నప్పుడే మిత్రదేశాలు అండగా నిలబడ్డాయి. అయినప్పటికీ ప్రస్తుత భౌగోళిక పరిస్థితుల్లో యూరప్ భద్రత కంటే అమెరికా ప్రయోజనాలే ముఖ్యమని ట్రంప్ భావిస్తున్నారు.
కూటమి నుంచి నిష్క్రమణ అంత సులభమా?
ట్రంప్ హెచ్చరికలు చేస్తున్నప్పటికీ, అమెరికా నాటో నుంచి బయటకు రావడం రాజ్యాంగపరంగా అంత సులభం కాదు. 2023లో అమెరికా కాంగ్రెస్ ఒక కీలక చట్టాన్ని ఆమోదించింది. దీని ప్రకారం.. అధ్యక్షుడు ఏకపక్షంగా నాటో నుంచి వైదొలిగే నిర్ణయం తీసుకోలేరు. సెనేట్‌లో మూడింట రెండొంతుల (2/3) మెజార్టీ సభ్యుల ఆమోదం తప్పనిసరి. అందువల్ల ట్రంప్ వ్యాఖ్యలను కేవలం రాజకీయ ఒత్తిడి వ్యూహంగా లేదా ఇతర సభ్యదేశాలు తమ రక్షణ వ్యయాన్ని (జీడీపీలో 2%) పెంచేలా చేసే హెచ్చరికగా మాత్రమే చూడాలని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఏర్పడనున్న భద్రతా శూన్యత
ఒకవేళ అమెరికా గనుక నాటో నుంచి పక్కకు తప్పుకుంటే అది ప్రపంచవ్యాప్తంగా అస్థిరతకు దారి తీస్తుంది. వ్లాదిమిర్ పుతిన్ నాయకత్వంలోని రష్యాకు ఇది పెద్ద విజయంగా మారుతుంది. ఉక్రెయిన్ తరహా దాడులు ఇతర తూర్పు యూరప్ దేశాలపై జరిగే ప్రమాదం ఉంది. బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్ వంటి దేశాలు తమ సొంత రక్షణ వ్యవస్థలను బలోపేతం చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థలపై అదనపు భారాన్ని మోపుతుంది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఏర్పడిన అంతర్జాతీయ భద్రతా క్రమం కుప్పకూలే ప్రమాదం ఉంది.
ప్రస్తుత నాటో ప్రధాన కార్యదర్శి మార్క్ రట్టే ముందున్న అతిపెద్ద సవాలు అమెరికాను కూటమిలో భాగస్వామిగా ఉంచుతూనే సభ్యదేశాల మధ్య సమన్వయాన్ని సాధించడం... ట్రంప్ వ్యాఖ్యలు నాటోలోని లోపాలను ఎత్తిచూపుతున్నప్పటికీ ఈ కూటమి విచ్ఛిన్నమైతే అది కేవలం యూరప్‌కే కాదు.. అమెరికా గ్లోబల్ లీడర్‌షిప్‌కు కూడా గొడ్డలిపెట్టు కాగలదు. ఈ చర్చలు యూరప్ దేశాలను మరింత రక్షణాత్మకంగా మార్చవచ్చు..కానీ అమెరికా లేని నాటో ఊహించడం ప్రస్తుతానికి అసాధ్యమే.
