Begin typing your search above and press return to search.

భారత్ పై భారీ సుంకాలపై అమెరికా కొత్త మాట వినాల్సిందే..!

అవును... భారత దిగుమతులపై ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భారీ సుంకాలు విధించిన సంగతి తెలిసిందే.

By:  Raja Ch   |   8 Nov 2025 3:00 AM IST
భారత్  పై భారీ సుంకాలపై అమెరికా కొత్త మాట వినాల్సిందే..!
X

తాను ఏమి చేసినా లోక కల్యాణం కోసమే.. తన ప్రభుత్వం ఏమి నిర్ణయం తీసుకున్నా అది మేక్ అమెరికా గ్రేట్ అగైన్ కోసమే అని చెప్పే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అండ్ కో తాజాగా మరో ఆశ్చర్యకరమైన విషయం వెల్లడించారు. ఇందులో భాగంగా... భారత దిగుమతులపై భారీ సుంకాలు విధించడానికి కారణం రష్యా - ఉక్రెయిన్ ల మధ్య యుద్ధం ఆపేందుకే అని చెప్పుకొచ్చారు.

అవును... భారత దిగుమతులపై ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భారీ సుంకాలు విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ట్రంప్‌ నిర్ణయం గురించి అమెరికా వాణిజ్య మంత్రి హోవార్డ్‌ లుట్నిక్‌ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా... రష్యా- ఉక్రెయిన్‌ ల మధ్య యుద్ధం ఆపేందుకు దౌత్యపరమైన మార్గంగానే భారత్‌ పై టారిఫ్‌ లు విధించినట్లు తెలిపారు.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన లుట్నిక్... న్యాయం కోసమే అధ్యక్షుడు ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. రష్యా- ఉక్రెయిన్‌ ల మధ్య యుద్ధం ముగించడానికి ఈ సుంకాలను దౌత్యమార్గంగా ఉపయోగిస్తున్నారని తెలిపారు. రష్యా చమురు కొనుగోలు ఆపేయాలని భారత్‌ కు ట్రంప్ ఇప్పటికే చెప్పారని తెలిపారు.

అయితే... 1977 అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టం (ఐఈఈపీఏ) పరిమితం చేయడం వలన ట్రంప్ ప్రపంచాన్ని, అమెరికాను సురక్షితమైన ప్రదేశంగా మార్చగల సామర్థ్యాన్ని బలహీనపరుస్తుందని అన్నారు.

కాగా... ట్రంప్ భారతదేశంపై 25 శాతం సుంకాలను, రష్యన్ చమురు కొనుగోళ్లపై అదనంగా 25 శాతం సుంకాలను విధించిన సంగతి తెలిసిందే. దీనితో భారతదేశంపై విధించిన మొత్తం సుంకాలను 50 శాతానికి పెంచారు. అయితే.. ఈ చర్యను అన్యాయం, అసమంజసమైనదని భారత్ అభివర్ణించింది. మరోవైపు అతి త్వరలోనే వాణిజ్య ఒప్పందం ఖరారయ్యే అవకాశాలు ఉన్నట్లు అధికార వర్గాలు చెబుతోన్న వేళ.. 50 శాతంగా ఉన్న సుంకాలు 15-16 శాతానికి తగ్గే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.