రక్షణ రంగానికి రెట్టింపు బడ్జెట్.. ట్రంప్ నిర్ణయంతో ఉలిక్కిపడ్డ ప్రపంచం..
కొత్త సంవత్సరంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకునే నిర్ణయాలు ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేస్తున్నాయి.
By: Tupaki Political Desk | 8 Jan 2026 5:00 PM ISTకొత్త సంవత్సరంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకునే నిర్ణయాలు ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేస్తున్నాయి. ఒకవైపు వాణిజ్య యుద్ధాలు, మరోవైపు జియోపాలిటికల్ హెచ్చరికలు, ఇంకోవైపు సైనిక శక్తి ప్రదర్శన.. అన్నీ కలిపి ట్రంప్ పాలన మరింత దూకుడుగా మారిందన్న సంకేతాలు ఇస్తున్నాయి. ఈ క్రమంలో ఆయన తీసుకున్న తాజా నిర్ణయం ప్రపంచ రాజకీయాల్లో సంచలనంగా మారింది. అమెరికా రక్షణ బడ్జెట్‌ను అనూహ్యంగా భారీగా పెంచే ప్రకటన చేయడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. 2027 నాటికి అమెరికా సైనిక బడ్జెట్‌ను ఇప్పటి వరకు ఊహించని స్థాయిలో ట్రిలియన్ డాలర్ల నుంచి 1.5 ట్రిలియన్ డాలర్లకు పెంచనున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ఈ సంఖ్య కేవలం గణాంకం మాత్రమే కాదు. దేశం మొత్తం ఆర్థిక వ్యవస్థతో పోలిస్తే ఇది సుమారు 36 శాతం వరకూ ఉంటుంది. అంటే ఒక్క ఏడాదిలో అమెరికా సైన్యం మీద ఖర్చు చేయబోయే మొత్తం ఎంత భారీగా ఉందో అర్థమవుతుంది. ఈ నిర్ణయం వెనుక కారణంగా ‘ప్రపంచ భద్రతా పరిస్థితులు తీవ్రంగా దిగజారుతున్నాయి’ అని ట్రంప్ స్పష్టంగా చెబుతున్నారు.
ట్రూత్ వేధికగా ప్రకటించిన ట్రంప్..
ట్రూత్ సోషల్ వేదికగా ఈ ప్రకటన చేసిన ట్రంప్.. ఈ బడ్జెట్ అమెరికా సైన్యాన్ని ఒక ‘డ్రీమ్ మిలిటరీ’గా తీర్చిదిద్దుతుందని వ్యాఖ్యానించారు. సెనేట్, కాంగ్రెస్, ఇతర కీలక ప్రభుత్వ విభాగాలతో విస్తృత చర్చల తర్వాతే ఈ నిర్ణయానికి వచ్చామని తెలిపారు. ప్రస్తుతం ప్రపంచం చాలా సున్నితమైన దశలో ఉందని, చిన్న తప్పిదం కూడా పెద్ద యుద్ధాలకు దారితీయగల పరిస్థితి ఉందని అభిప్రాయం. అందుకే జాతీయ భద్రతకు అత్యున్నత ప్రాధాన్యత ఇవ్వడం అనివార్యం అని ట్రంప్ నొక్కి చెప్పారు. ఈ భారీ బడ్జెట్ పెంపు వెనుక అమెరికా ఎదుర్కొంటున్న భద్రతా సవాళ్లు మాత్రమే కాదు.. భవిష్యత్తులో ఎదురయ్యే ప్రమాదాలపై ముందస్తు సిద్ధత కూడా అన్నది విశ్లేషకుల అభిప్రాయం. ఉక్రెయిన్ యుద్ధం, మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు, ఆసియా–పసిఫిక్ ప్రాంతంలో చైనా దూకుడు, ఉత్తర కొరియా అణు బెదిరింపులు అన్నీ కలిసి ప్రపంచాన్ని ఒక అస్థిర దశలోకి నెడుతున్నాయి. ఈ నేపథ్యంలో ‘బలమే భద్రత’ అన్న సూత్రాన్ని ట్రంప్ మరింత గట్టిగా అమలు చేయాలనుకుంటున్నారని తెలుస్తోంది.
ప్రపంచానికి చెప్పకనే చెప్పిన ట్రాంప్ విధానం..
ఇంకొక ఆసక్తికరమైన అంశం ఏంటంటే.. ఈ రక్షణ బడ్జెట్ పెంపు కారణంగా ట్రంప్ తన టారీఫ్ విధానాన్ని పేర్కొనడం. అమెరికా విధించిన దిగుమతి సుంకాల వల్ల దేశానికి భారీగా ఆదాయం వచ్చిందని, ఆ డబ్బుతోనే సైనిక శక్తిని పెంచడమే కాకుండా దేశభక్తిగల మధ్య తరగతి ప్రజలకు ఆర్థిక ప్రయోజనాలు కల్పించవచ్చని వ్యాఖ్యానించారు. అంటే, వాణిజ్య యుద్ధాల ద్వారా వచ్చిన డబ్బుతో యుద్ధాలకు సిద్ధం కావడం అన్న వ్యూహం స్పష్టంగా కనిపిస్తోంది. వాస్తవానికి ఇది పూర్తిగా కొత్త నిర్ణయమేమీ కాదు. గత డిసెంబర్‌లోనే అమెరికా సెనేట్ 2026 సంవత్సరానికి 901 బిలియన్ డాలర్ల రక్షణ బడ్జెట్ ఆమోదించింది. కానీ ఇప్పుడు 2027కి దాన్ని ఏకంగా 1.5 ట్రిలియన్ డాలర్లకు తీసుకెళ్లడం ట్రంప్ ఆలోచనల దూకుడును చూపిస్తోంది. ఆధునిక ఆయుధాలు, హైపర్‌సోనిక్ మిసైళ్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత యుద్ధ వ్యవస్థలు, స్పేస్ డిఫెన్స్ ఈ అన్నింటిపై పెట్టుబడులు పెంచే దిశగా ఈ బడ్జెట్ ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.
విమర్శలు కురిపిస్తున్న ఆయా దేశాలు..
ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయంపై విమర్శలూ లేకపోలేదు. ఒకవైపు అమెరికాలో ఆరోగ్య, విద్య, సామాజిక భద్రత రంగాల్లో ఖర్చులు తగ్గుతున్నాయన్న విమర్శలు వినిపిస్తుండగా.. ఇంత భారీగా సైనిక వ్యయం అవసరమా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కానీ ట్రంప్ మాత్రం దీనిని ‘భవిష్యత్తు భద్రత కోసం చెల్లించాల్సిన ధర’గా చూస్తున్నారు. మొత్తానికి ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం అమెరికా మాత్రమే కాదు.. ప్రపంచ శక్తి సమీకరణాలపై కూడా ప్రభావం చూపేలా ఉంది. ఇది భద్రతకు గ్యారంటీనా? లేక కొత్త ఆయుధ పోటీకి నాందినా? అన్నది రాబోయే రోజుల్లో తేలనుంది. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు ట్రంప్ కాలంలో అమెరికా సైనిక శక్తి ప్రపంచ రాజకీయాల కేంద్రబిందువుగా మారనుంది.
