Begin typing your search above and press return to search.

తగిన శాస్తి తప్పదన్న వార్నింగ్ వెంటనే.. వైట్ హౌస్ లో భేటీకి ట్రంప్ ఇన్విటేషన్

ప్రపంచంలో ఏది శాశ్వితమైనా కాకున్నా.. మారే కాలం మాత్రం శాశ్వితమన్న నానుడికి తగ్గట్లే.. తన నోటి మాట ఎప్పుడైనా ఇట్టే మారిపోవచ్చన్న దానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.

By:  Garuda Media   |   8 Jan 2026 1:23 PM IST
తగిన శాస్తి తప్పదన్న వార్నింగ్ వెంటనే.. వైట్ హౌస్ లో భేటీకి ట్రంప్ ఇన్విటేషన్
X

ప్రపంచంలో ఏది శాశ్వితమైనా కాకున్నా.. మారే కాలం మాత్రం శాశ్వితమన్న నానుడికి తగ్గట్లే.. తన నోటి మాట ఎప్పుడైనా ఇట్టే మారిపోవచ్చన్న దానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. కత్తి దూసిన కాసేపటికే.. స్నేహ హస్తాన్ని చాటటం ట్రంప్ కు మాత్రమే సాధ్యమవుతుందని చెప్పాలి. గ్యాప్ తీసుకోకుండానే వేరియేషన్స్ ను మార్చేసే విషయంలో ఇప్పటికే ప్రపంచాన్ని పలుమార్లు విస్మయానికి గురి చేస్తున్న ట్రంప్.. తాజాగా మరోసారి తన మార్క్ ను ప్రదర్శించారు.

వెనెజువెలా అధ్యక్షుడి అధికార నివాసానికి వెళ్లి మరీ.. ఆయన భార్యతో సహా నిర్బంధంలోకి తీసుకొని న్యూయార్క్ కు తరలించిన ట్రంప్ సర్కారు.. ఆ తర్వాత మీరే.. బీరెఢీ అంటూ మెక్సికో.. క్యూబా.. కొలంబియాలకు వార్నింగ్ ఇచ్చి సంచలనాన్ని క్రియేట్ చేశారు. ట్రంప్ హెచ్చరికలకు కొలంబియా అధ్యక్షుడు అంతే ధీటుగా స్పందించారు. మదురో మాదిరి తన విషయంలో రిపీట్ అయితే.. అందుకు అమెరికా తగిన శాస్తి తప్పదని చెప్పటమే కాదు.. ఏమేం జరుగుతుందో వివరించి మరీ చెప్పటం తెలిసిందే. తమపై అమెరికా సైనిక చర్య చేపడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని రిటర్న్ వార్నింగ్ ఇచ్చేశారు.

ఈ నేపథ్యంలో ట్రంప్ ఎలా రియాక్టు అవుతారన్న ఆసక్తి వ్యక్తమైంది. విచిత్రమైన రీతిలో కొలంబియా అధ్యక్షుడి పదునైన స్పందన అనంతరం ట్రంప్ తన స్వరాన్ని పూర్తిగా మార్చేశారు. కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రోతో చర్చలకు సిద్ధమని ఆయన ప్రకటించారు. అంతేకాదు.. వైట్ హౌస్ కు రావాలని ఆహ్వానించారు. డ్రగ్స్, ఇతర విభేదాల గురించి తాము ఫోన్ లో చర్చించుకున్నామని.. ఆయనతో భేటీ కోసం ఎదురుచూస్తున్నానని.. త్వరలోనే ఆ సమావేశం జరుగుతుందని ప్రకటించటం గమనార్హం. ఏమైనా.. ఓ చేత్తో కత్తి.. మరో చేత్తో స్నేహహస్తాన్ని చాటే తీరు మాత్రం ట్రంప్ కు మాత్రమే సాధ్యమవుతుందని చెప్పాలి.