అర్హత లేని వారి పౌరసత్వాన్ని క్షణాల్లో రద్దు చేస్తా.. ట్రంప్ మరో బాంబ్
ట్రంప్.. ఎప్పుడు ఏం మాట్లాడుతాడో ఎవరికీ తెలియదు. అమెరికా ఫస్ట్ నినాదంతో ముందుకెళుతున్న ఈ అధ్యక్షుడు తమ దేశంలోని వారినే కాదు.. ప్రపంచంలోని అందరినీ ఆగమాగం చేస్తున్నాడు.
By: A.N.Kumar | 12 Jan 2026 3:00 PM ISTట్రంప్.. ఎప్పుడు ఏం మాట్లాడుతాడో ఎవరికీ తెలియదు. అమెరికా ఫస్ట్ నినాదంతో ముందుకెళుతున్న ఈ అధ్యక్షుడు తమ దేశంలోని వారినే కాదు.. ప్రపంచంలోని అందరినీ ఆగమాగం చేస్తున్నాడు. తలతిక్క పనులతో విసుగు తెప్పిస్తున్నారు. వలసవాదులకు రోజుకో నిబంధన.. చర్యలు చేపడుతూ చుక్కలు చూపిస్తున్నాడు. తాజాగా ఇతర దేశం నుంచి వచ్చిన వారిని.. అమెరికన్లను వివాహం చేసుకొని పౌరసత్వం తీసుకున్న వారి అర్హతను ప్రశ్నిస్తూ.. క్షణాల్లో వీసా రద్దు చేస్తానంటూ బాంబు పేల్చారు. ఈ ప్రకటన వలసవాదుల్లో గుబులు రేపుతోంది.
అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి తనదైన శైలిలో దూకుడు ప్రదర్శిస్తున్న డొనాల్డ్ ట్రంప్ తాజాగా 'సహజీకరణ' ద్వారా పౌరసత్వం పొందిన వారిపై చేసిన వ్యాఖ్యలు అగ్గి రాజేస్తున్నాయి. అర్హత లేని వారి పౌరసత్వాన్ని "క్షణాల్లో రద్దు చేస్తానని" ఆయన హెచ్చరించడం ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది.
ఇటీవల ద న్యూయార్క్ టైమ్స్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ పలు వివాదాస్పద.. కఠినమైన నిర్ణయాలను వెల్లడించారు. పౌరసత్వం పొందే క్రమంలో ఎవరైనా తప్పుడు సమాచారం ఇచ్చినా లేదా మోసానికి పాల్పడినా వారి పౌరసత్వాన్ని తక్షణమే రద్దు చేస్తామని ట్రంప్ స్పష్టం చేశారు. సోమాలియా నుంచి వచ్చిన వలసదారుల వల్ల అమెరికా భద్రతకు ముప్పు పొంచి ఉందని ఆయన ఆరోపించారు. అబద్ధాలు చెప్పి పౌరసత్వం పొందిన సోమాలి వంశస్థులపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. డెమోక్రాటిక్ కాంగ్రెస్‌వుమన్ ఇల్హాన్ ఒమర్‌ను లక్ష్యంగా చేసుకుంటూ ఆమె పౌరసత్వాన్ని రద్దు చేసి సోమాలియాకు పంపాలన్న తన ఆలోచనను ట్రంప్ బయటపెట్టారు.
ఇన్సరెక్షన్ యాక్ట్ ప్రస్తావన
దేశంలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం అవసరమైతే ఇన్సరెక్షన్ యాక్ట్‌ను ప్రయోగించి సైన్యాన్ని రంగంలోకి దింపడానికి కూడా వెనకాడబోనని ట్రంప్ పేర్కొన్నారు. అధ్యక్షుడికి ఈ విషయంలో విస్తృత అధికారాలు ఉన్నాయని ఆయన నొక్కి చెప్పారు.
చట్టపరమైన సవాళ్లు
ట్రంప్ వ్యాఖ్యలు వినడానికి కఠినంగా ఉన్నప్పటికీ అమెరికా రాజ్యాంగం ప్రకారం పౌరసత్వాన్ని రద్దు చేయడం అంత సులభం కాదు. పౌరసత్వం రద్దు చేసే అధికారం కేవలం అధ్యక్షుడికే ఉండదు. దీనికి న్యాయస్థానాల అనుమతి తప్పనిసరి. కేవలం రాజకీయ కారణాలతో కాకుండా, తీవ్రమైన నేరపూరిత మోసం నిరూపితమైతేనే రద్దు చేస్తారు. ఇది సుదీర్ఘమైన న్యాయ ప్రక్రియ. క్షణాల్లో రద్దు చేయడం అనేది అమెరికా ప్రస్తుత చట్టాల ప్రకారం అసాధ్యం.
"దేశాన్ని ప్రేమించే వారే మాకు కావాలి" అన్న ట్రంప్ నినాదం ఆయన మద్దతుదారులను ఉత్సాహపరుస్తున్నప్పటికీ శాశ్వత నివాసితులు .. సహజీకరణ ద్వారా పౌరసత్వం పొందిన భారతీయ అమెరికన్లతో సహా ఇతర దేశస్థుల్లో ఒక రకమైన అభద్రతా భావాన్ని కలిగిస్తోంది. ట్రంప్ హెచ్చరికలు కేవలం మాటలకే పరిమితమవుతాయా లేక చట్ట సవరణల వైపు దారితీస్తాయా అన్నది వేచి చూడాలి.
మొత్తంగా ట్రంప్ తాజా వ్యాఖ్యలు అమెరికాలో వలసలు, పౌరహక్కులు అధ్యక్ష అధికారాల పరిమితులపై మరోసారి పెద్ద ఎత్తున చర్చను రేపుతున్నాయి.
