Begin typing your search above and press return to search.

మోడీ నా స్నేహితుడు… మళ్లీ దువ్వుతున్న ట్రంప్

డొనాల్డ్ ట్రంప్.. ఎప్పుడు ఎలా ఉంటాడో తెలియదు..ఎప్పుడు ఎవరిని మిత్రులుగా ఉంచుతారో అర్థం కాదు.. ఎవరినీ దూరం కొడుతాడో.. ఎవరినీ దగ్గరకు కొడుతాడో తెలియడం లేదు.

By:  A.N.Kumar   |   22 Jan 2026 11:47 AM IST
మోడీ నా స్నేహితుడు… మళ్లీ దువ్వుతున్న ట్రంప్
X

డొనాల్డ్ ట్రంప్.. ఎప్పుడు ఎలా ఉంటాడో తెలియదు..ఎప్పుడు ఎవరిని మిత్రులుగా ఉంచుతారో అర్థం కాదు.. ఎవరినీ దూరం కొడుతాడో.. ఎవరినీ దగ్గరకు కొడుతాడో తెలియడం లేదు. ఇదే అందరినీ కలవరానికి గురిచేస్తోంది. ప్రపంచ రాజకీయాల్లో అత్యంత అనిశ్చిత, అనూహ్య నిర్ణయాలతో ఎప్పుడూ వార్తల్లో నిలిచే వ్యక్తి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఒకవైపు భారత్‌పై టారిఫ్‌లు విధించిన ట్రంప్ మరోవైపు మాత్రం భారత్‌తో త్వరలోనే మంచి వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంటామని వ్యాఖ్యానించడం ఆసక్తికరంగా మారింది.

ఇటీవల భారత్–అమెరికా సంబంధాలపై ప్రశ్నించగా ట్రంప్ తనదైన శైలిలో స్పందించారు. భారత్‌తో సాధ్యమైన వాణిజ్య ఒప్పందం గురించి మాట్లాడుతూ “భారత ప్రధాని నరేంద్రమోడీ అంటే నాకు చాలా గౌరవం. ఆయన అద్భుతమైన వ్యక్తి, నా స్నేహితుడు కూడా. భారత్‌తో మేం మంచి డీల్ చేయబోతున్నాం” అని చెప్పారు.

ఈ వ్యాఖ్యలు వినడానికి ఎంతో సానుకూలంగా ఉన్నప్పటికీ ట్రంప్ స్వభావం దృష్ట్యా ఇవి ఎంతవరకు కార్యరూపం దాలుస్తాయన్నది వేచి చూడాల్సిన అంశమే. గతంలోనూ ట్రంప్ మాటల్లో మిత్రభావం కనిపించినా విధానాల్లో మాత్రం కఠిన నిర్ణయాలు తీసుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. భారత్‌పై టారిఫ్‌లు విధించిన నేపథ్యంలో నిజంగా అర్థవంతమైన చర్చలు జరగాలంటే అమెరికా వాటిని సడలించాల్సిన అవసరం ఉంది.

ముఖ్యంగా ఈ వ్యాఖ్యల టైమింగ్ రాజకీయంగా ఆర్థికంగా కీలకంగా మారింది. ఎందుకంటే ట్రంప్ వ్యాఖ్యలకు కేవలం ముందే యూరోపియన్ యూనియన్ భారత్‌తో ‘మదర్ ఆఫ్ ఆల్ డీల్స్’గా అభివర్ణిస్తున్న భారీ వాణిజ్య ఒప్పందాన్ని త్వరలో కుదుర్చుకునే అవకాశముందని సంకేతాలు ఇచ్చింది. ఇది భారత్‌కు గ్లోబల్ మార్కెట్లలో మరింత బలం చేకూర్చే అంశంగా భావిస్తున్నారు.

ఈ పరిస్థితుల్లో అమెరికా కూడా భారత్‌తో పోటీగా ముందుకు రావాల్సిన అవసరం ఏర్పడుతోంది. భారత్ వంటి వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థతో బలమైన వాణిజ్య భాగస్వామ్యం అమెరికాకు కూడా లాభదాయకమే. అయితే మాటలకే పరిమితం కాకుండా ట్రంప్ ప్రభుత్వం టారిఫ్‌లు, వాణిజ్య అడ్డంకులపై స్పష్టమైన సడలింపులు తీసుకువస్తేనే ఈ ‘మంచి డీల్’ వాస్తవంగా మారే అవకాశం ఉంది.

మొత్తానికి “మోడీ నా స్నేహితుడు” అనే ట్రంప్ వ్యాఖ్యలు భారత్‌లో రాజకీయ, ఆర్థిక వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. కానీ ట్రంప్ మాటలు చర్యల మధ్య తేడా ఉన్న దృష్ట్యా భారత్–అమెరికా వాణిజ్య సంబంధాల్లో నిజంగా కొత్త అధ్యాయం మొదలవుతుందా? లేక ఇవి కేవలం దౌత్యపరమైన మాటలకే పరిమితమవుతాయా? అన్నది రాబోయే రోజుల్లో స్పష్టమవుతుంది.