Begin typing your search above and press return to search.

భారత్ పై ట్రంప్ సుంకాల వెనుక అసలు కారణం అదా?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయంతో భారత ఎగుమతులపై 50 శాతం వరకు సుంకాలు విధింపబడ్డాయి.

By:  A.N.Kumar   |   28 Aug 2025 5:00 PM IST
భారత్ పై ట్రంప్ సుంకాల వెనుక అసలు కారణం అదా?
X

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయంతో భారత ఎగుమతులపై 50 శాతం వరకు సుంకాలు విధింపబడ్డాయి. ఈ చర్య ఒకే ప్రశ్నను రేకెత్తిస్తోంది. ఇది నిజంగా రష్యా చమురు కారణంగానా? లేక భారత్‌పై వ్యూహాత్మక ఒత్తిడా? అన్నది తేలాల్సి ఉంది.

నీతిఆయోగ్ మాజీ సీఈఓ అమితాబ్‌కాంత్ సూటిగా చెప్పినట్లే, ఈ టారిఫ్‌లకు రష్యా చమురుతో సంబంధం లేదని స్పష్టమవుతోంది. రష్యా చమురుకు అతిపెద్ద కొనుగోలుదారు చైనా. యూరప్‌ కూడా రష్యా ఇంధనంపై బాగా ఆధారపడి ఉంది. అయినా ఎందుకు భారత్‌పైనే కఠిన సుంకాలు? అమెరికా తన “మిత్రదేశం”పై ఇంత కఠినంగా వ్యవహరించడం సహజంగానే సందేహాలను రేకెత్తిస్తోంది.

విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌ ఇప్పటికే స్పష్టంచేశారు. రష్యా నుంచి అత్యధిక దిగుమతులు భారత్‌ కాదని, చైనా, యూరప్ అని. అంతేకాదు, రష్యా నుంచి చమురు కొనుగోలు చేయాలని అమెరికానే సూచించిందని ఆయన గుర్తుచేశారు. అయినా ఇప్పుడు అదే విషయాన్ని ఆయుధంలా ఉపయోగించి భారత్‌పై సుంకాల మోత మోగించడం తార్కికతను కోల్పోయిన నిర్ణయమే.

- భారత్‌కు మేల్కొలుపు

ఈ పరిస్థితిని ఓ మేల్కొలుపుగా తీసుకోవాలని అమితాబ్‌కాంత్ పిలుపు గమనార్హం. నిజమే భారత్‌ తన ఇంధన భద్రత, వ్యూహాత్మక స్వయంపత్రిపత్తిపై రాజీపడలేడు. అంతర్జాతీయ ఒత్తిళ్లను ఎదుర్కొంటూ వచ్చిన దేశం మనది. ఈసారి కూడా అదే ధైర్యంతో నిలబడాల్సిన అవసరం ఉంది.

- వాణిజ్యంపై ప్రభావం

సుమారు 48 బిలియన్‌ డాలర్ల ఎగుమతులపై నేరుగా ప్రభావం చూపే ఈ సుంకాలు తాత్కాలికంగా మన ఆర్థిక వ్యవస్థకు భారమవుతాయి. వాణిజ్య రంగం ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేస్తోంది. అమెరికా ఉత్పత్తులపై ప్రతీకార సుంకాల విధానం పరిగణనలోకి తీసుకోవాలని పరిశ్రమ వర్గాలు సూచిస్తున్నాయి. ఇది సమంజసమే. ఎందుకంటే, ఏకపక్ష చర్యలకు ఎదురు ప్రతిస్పందన అవసరం.

- ముందున్న సవాలు.. అవకాశం కూడా..

ప్రపంచ వాణిజ్యంలో అమెరికా చూపుతున్న ద్వంద్వ వైఖరి భారత్‌ను కొత్త దారుల వైపు నడిపే అవకాశముంది. సుంకాల దెబ్బ మనకు ఇబ్బందే అయినా అదే సంస్కరణలకు, కొత్త వాణిజ్య భాగస్వామ్యాల అన్వేషణకు కారణమవ్వాలి.

మొత్తం మీద ట్రంప్ టారిఫ్‌లు కేవలం రష్యా చమురు కారణం కాదని స్పష్టమవుతోంది. ఇవి భారత్‌పై వ్యూహాత్మక ఒత్తిడికి మరో రూపం. ఇలాంటి సందర్భాల్లో భారత్‌ వెనకడుగు వేయకుండా తన స్వయంపత్రిపత్తిని కాపాడుకుంటూ ముందుకు సాగాల్సిందే.