అమెరికా సుంకాలతో భారత ఎగుమతులకు భారీ దెబ్బ!
డొనాల్డ్ ట్రంప్ నాయకత్వంలోని అమెరికా విధించిన కొత్త సుంకాలు భారత ఎగుమతి రంగానికి తీవ్ర సవాల్‌గా మారాయి.
By: A.N.Kumar | 28 Aug 2025 5:00 AM ISTడొనాల్డ్ ట్రంప్ నాయకత్వంలోని అమెరికా విధించిన కొత్త సుంకాలు భారత ఎగుమతి రంగానికి తీవ్ర సవాల్‌గా మారాయి. ఈ చర్య భారత ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నంగా కనిపిస్తోంది. అమెరికా ఆగస్టు 7న 25% సుంకాలు విధించింది. ఆగస్టు 27 నుంచి మరో 25% అదనపు సుంకాలు అమలు చేసింది. దీంతో మొత్తం సుంకాలు 50%కి పెరిగాయి. ఈ నిర్ణయం వల్ల అమెరికా మార్కెట్‌లో భారత ఉత్పత్తుల ధరలు గణనీయంగా పెరిగి, పోటీతత్వాన్ని కోల్పోతున్నాయి. ఈ పరిస్థితి దేశవ్యాప్తంగా వివిధ రంగాలకు చెందిన లక్షలాది ఉద్యోగాలను ప్రమాదంలో పడేస్తోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
-సీటీఐ ఆందోళన, ప్రభుత్వానికి సూచనలు
ది ఛాంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ (CTI) ఛైర్మన్ బ్రజేష్ గోయల్ ఈ సమస్యపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. అమెరికా సుంకల వల్ల జౌళి, తోలు, ముత్యాలు, ఆభరణాలు, ఇంజినీరింగ్ వస్తువులు, ఫార్మా రంగాలు తీవ్రంగా దెబ్బతింటాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మొత్తం 48 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 4 లక్షల కోట్ల) విలువైన ఎగుమతులు ఈ సుంకాల వల్ల ప్రభావితం కానున్నాయని తెలిపారు.
- ఈ సమస్యకు పరిష్కారంగా సీటీఐ కొన్ని కీలక సూచనలు చేసింది.
అమెరికా మార్కెట్‌పై ఆధారపడటం తగ్గించుకొని, జర్మనీ, యూకే, సింగపూర్, మలేసియా వంటి ఇతర దేశాల్లో కొత్త మార్కెట్లను వెతకాలని సూచించింది. అమెరికాకు తగిన గుణపాఠం చెప్పాలంటే, భారత్ కూడా ప్రతీకార సుంకాలు విధించడాన్ని పరిశీలించాలని అభిప్రాయపడింది.
- ఎగుమతిదారుల గందరగోళం, పరిష్కారం
ఎగుమతిదారులు ఇప్పటికే రవాణాలో ఉన్న వస్తువుల భవిష్యత్తుపై ఆందోళన చెందారు. అయితే అమెరికా హోంలాండ్ సెక్యూరిటీ విభాగం ఒక ముఖ్యమైన ఆదేశం జారీ చేసింది. దీని ప్రకారం ఆగస్టు 27 ఉదయం 12.01 గంటల (భారత కాలమానం ప్రకారం ఉదయం 9.30) లోపు రవాణా ప్రారంభమైన వస్తువులకు ఈ అదనపు సుంకాలు వర్తించవు. ఇది ఎగుమతిదారులకు కొంత ఊరటనిచ్చింది.
మొత్తానికి ఈ కొత్త సవాళ్ళను ఎదుర్కొనేందుకు భారత ప్రభుత్వం, ఎగుమతిదారులు కొత్త వ్యూహాలను రూపొందించుకోవడం తప్పనిసరి. దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడకుండా చూడాల్సిన అవసరం ఉంది.
