Begin typing your search above and press return to search.

ట్రంప్ ఖేల్ ఖతం.. 'టారిఫ్' లు బంద్.. నెక్ట్స్ ఏంటి?

వాణిజ్య విధానాల విషయంలో ప్రధాన నిర్ణయాధికారం అమెరికా కాంగ్రెస్‌దేనని కోర్టు గుర్తుచేసింది. అధ్యక్షుడు స్వేచ్ఛగా టారిఫ్‌లు విధించడం వల్ల శాసన వ్యవస్థను పక్కన పెట్టినట్టవుతుందని పేర్కొంది.

By:  A.N.Kumar   |   21 Feb 2026 1:00 AM IST
ట్రంప్ ఖేల్ ఖతం.. టారిఫ్ లు బంద్.. నెక్ట్స్ ఏంటి?
X

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ నకు సుప్రీంకోర్టు నుంచి భారీ ఎదురుదెబ్బ తగిలింది. పలు దేశాలపై ఆయన విధించిన టారిఫ్‌లు చట్టవిరుద్ధమని అమెరికా సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ట్రంప్ తన రాజ్యాంగబద్ధ అధికారాలను అతిక్రమించి ఏకపక్షంగా సుంకాలు విధించారని న్యాయస్థానం స్పష్టం చేసింది.

ట్రంప్ ప్రభుత్వం అత్యవసర అధికారాలను వినియోగిస్తూ వాణిజ్య భాగస్వామ్య దేశాలపై విధించిన టారిఫ్‌లు చట్టబద్ధమైన ప్రక్రియను పాటించలేదని కోర్టు అభిప్రాయపడింది. ముఖ్యంగా కాంగ్రెస్ అనుమతి లేకుండా సరైన న్యాయపరమైన ఆధారాలు లేకుండా సుంకాలు విధించడం రాజ్యాంగ విరుద్ధమని తీర్పులో పేర్కొంది.

- ఆరుగురు జడ్జిల వ్యతిరేక తీర్పు

ఈ కేసులో మొత్తం తొమ్మిది మంది న్యాయమూర్తులు విచారణ జరిపారు. అందులో ఆరుగురు జడ్జిలు ట్రంప్ చర్యలను వ్యతిరేకిస్తూ తీర్పు ఇచ్చారు. మిగిలిన ముగ్గురు మాత్రం ప్రభుత్వానికి అనుకూలంగా అభిప్రాయం వ్యక్తం చేశారు. దీంతో 6-3 మెజారిటీతో ట్రంప్ విధించిన టారిఫ్‌లను సుప్రీంకోర్టు కొట్టివేసింది.

- అత్యవసర అధికారాల దుర్వినియోగం

ట్రంప్ ప్రభుత్వం జాతీయ భద్రత, ఆర్థిక అత్యవసర పరిస్థితులను చూపిస్తూ విదేశీ దేశాలపై భారీ సుంకాలు విధించింది. అయితే ఈ అధికారాలను అలా వినియోగించడం సరైన విధానం కాదని కోర్టు అభిప్రాయపడింది. అత్యవసర అధికారాలు అనేవి పరిమిత సందర్భాల్లో మాత్రమే వినియోగించాల్సి ఉంటుందని, వాటిని సాధారణ వాణిజ్య నిర్ణయాలకు వర్తింపజేయలేమని న్యాయమూర్తులు స్పష్టం చేశారు.

- కాంగ్రెస్ పాత్రపై స్పష్టత

వాణిజ్య విధానాల విషయంలో ప్రధాన నిర్ణయాధికారం అమెరికా కాంగ్రెస్‌దేనని కోర్టు గుర్తుచేసింది. అధ్యక్షుడు స్వేచ్ఛగా టారిఫ్‌లు విధించడం వల్ల శాసన వ్యవస్థను పక్కన పెట్టినట్టవుతుందని పేర్కొంది. ఇది అధికార విభజన సూత్రానికి విరుద్ధమని స్పష్టం చేసింది.

- అమెరికా వాణిజ్య విధానంపై ప్రభావం

ఈ తీర్పు అమెరికా వాణిజ్య విధానాలపై గణనీయమైన ప్రభావం చూపనుంది. ట్రంప్ అమలు చేసిన టారిఫ్‌లు రద్దు కావడంతో అనేక దేశాలతో వాణిజ్య సంబంధాలు మళ్లీ పునరుద్ధరించే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా చైనా, యూరప్ దేశాలపై విధించిన సుంకాలు తొలగిపోతే ప్రపంచ వాణిజ్యంలో మార్పులు చోటుచేసుకునే అవకాశముంది.

- రాజకీయ ప్రభావం కూడా

ఈ తీర్పు అమెరికా రాజకీయాల్లో కూడా చర్చనీయాంశంగా మారింది. ట్రంప్ విధానాలపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తుండగా ఆయన అనుచరులు మాత్రం ఈ తీర్పును వ్యతిరేకిస్తున్నారు. అధ్యక్ష అధికారాల పరిమితులపై దేశవ్యాప్తంగా చర్చ ముదిరే అవకాశముంది.

ముందు ఏమవుతుంది?

సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ట్రంప్ ప్రభుత్వం తదుపరి చర్యలపై ఆలోచనలో పడింది. కాంగ్రెస్ ద్వారా కొత్త చట్టాలను తీసుకురావాలా లేక విధానాలను సవరించాలా అన్నది కీలకంగా మారింది.

మొత్తానికి ఈ తీర్పు అమెరికా అధ్యక్ష అధికారాలపై గట్టి నియంత్రణగా నిలిచింది. వాణిజ్య నిర్ణయాల్లో రాజ్యాంగబద్ధ ప్రక్రియ ఎంత ముఖ్యమో మరోసారి స్పష్టంచేసింది.