Begin typing your search above and press return to search.

టారిఫ్‌లపై సుప్రీంకోర్టు తీర్పు : ట్రంప్ తిరగబడుతారా? అంగీకరిస్తారా?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన వివాదాస్పద టారిఫ్‌ల పై ప్రస్తుతం అమెరికా సుప్రీంకోర్టులో కీలక విచారణ జరుగుతోంది.

By:  A.N.Kumar   |   13 Jan 2026 10:51 AM IST
టారిఫ్‌లపై సుప్రీంకోర్టు తీర్పు : ట్రంప్ తిరగబడుతారా? అంగీకరిస్తారా?
X

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన వివాదాస్పద టారిఫ్‌ల పై ప్రస్తుతం అమెరికా సుప్రీంకోర్టులో కీలక విచారణ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ట్రంప్ చేసిన తాజా వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ఒకవేళ సుప్రీంకోర్టు టారిఫ్‌లకు వ్యతిరేకంగా తీర్పు ఇస్తే, అమెరికా మునిగిపోతుంది అంటూ ఆయన చేసిన హెచ్చరికలు ఆర్థిక రంగంలో కలకలం రేపుతున్నాయి.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన టారిఫ్ విధానంపై అత్యున్నత న్యాయస్థానం ఇచ్చే తీర్పు గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్, చైనా వంటి దేశాల నుంచి వచ్చే దిగుమతులపై ఆయన విధించిన భారీ సుంకాలు చట్టవిరుద్ధమని కోర్టు తేల్చితే అది అమెరికాకు కోలుకోలేని దెబ్బ అవుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

ట్రంప్ వాదన ఏంటి? అమెరికా మునిగిపోతుంది అని ఎందుకు అన్నారు?

ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ 'ట్రూత్ సోషల్' వేదికగా సుప్రీంకోర్టును ఉద్దేశించి ఘాటైన పోస్ట్ చేశారు. ఒకవేళ టారిఫ్‌లు రద్దయితే గతంలో కంపెనీల నుంచి వసూలు చేసిన వందల బిలియన్ డాలర్లను ప్రభుత్వం తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. టారిఫ్‌లను తప్పించుకోవడానికి అనేక దేశీయ విదేశీ కంపెనీలు అమెరికాలో కొత్త ప్లాంట్లు, ఫ్యాక్టరీలు నిర్మించాయి. కోర్టు తీర్పుతో ఈ ప్రాజెక్టులన్నీ కుప్పకూలితే ఆ నష్టం వందల బిలియన్ల నుండి ట్రిలియన్ల డాలర్లకు చేరుతుందని ట్రంప్ హెచ్చరించారు. ఈ టారిఫ్‌లను ఆయన ఒక "నేషనల్ సెక్యూరిటీ బోనాంజా"గా అభివర్ణించారు. కోర్టు దీనిని అడ్డుకుంటే మనం మునిగిపోయినట్లే అని తనదైన శైలిలో వ్యాఖ్యానించారు.

కేసు నేపథ్యం ఏమిటి?

1977 నాటి 'ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్ యాక్ట్' కింద ట్రంప్ ఈ టారిఫ్‌లను విధించారు. సాధారణంగా టారిఫ్‌లను విధించే అధికారం కాంగ్రెస్ పార్లమెంట్ కు ఉంటుంది. కానీ ట్రంప్ అత్యవసర అధికారాలను ఉపయోగించి వీటిని అమలు చేశారు. దీనిపై దిగువ కోర్టులు ఇదివరకే "ప్రెసిడెంట్‌కు ఇంతటి అపరిమిత అధికారం ఉండదు" అని తీర్పునిచ్చాయి. ఇప్పుడు తుది నిర్ణయం సుప్రీంకోర్టు చేతుల్లో ఉంది.

అమెరికా ఆర్థిక వ్యవస్థపై ప్రభావం ఎలా ఉంటుంది?

నిపుణుల విశ్లేషణ ప్రకారం.. కోర్టు తీర్పు వ్యతిరేకంగా వస్తే అమెరికాకు పెను సవాళ్లు ఎదురవుతాయి. ఇప్పటికే వసూలు చేసిన సుమారు $100 బిలియన్లకు పైగా నిధులను కంపెనీలకు రీఫండ్ చేయాల్సి వస్తే అమెరికా బడ్జెట్ లోటు భారీగా పెరుగుతుంది. స్టాక్ మార్కెట్లు ఒక్కసారిగా కుప్పకూలే ప్రమాదం ఉంది. ముఖ్యంగా టారిఫ్‌ల వల్ల లాభపడ్డ అమెరికా స్థానిక తయారీ కంపెనీల షేర్లు పడిపోవచ్చు. ఒకవేళ టారిఫ్‌లు రద్దయితే అమెరికాకు ఎగుమతులు చేసే భారత్, మెక్సికో వంటి దేశాలకు ఇది పెద్ద ఊరటనిస్తుంది. భారతీయ వస్తువులపై ఉన్న 50% సుంకం తొలగిపోయే అవకాశం ఉంటుంది.

ట్రంప్ మాటల్లో కొంత అతిశయోక్తి ఉన్నప్పటికీ తీర్పు వ్యతిరేకంగా వస్తే మాత్రం అది అమెరికా వాణిజ్య విధానంలో ఒక చారిత్రాత్మక సంక్షోభానికి దారితీస్తుందని ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. సుప్రీంకోర్టు తీర్పు మరో రెండు మూడు రోజుల్లో లేదా రానున్న వారాల్లో వచ్చే అవకాశం ఉండటంతో ప్రపంచ దేశాలన్నీ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి.

ట్రంప్ భయపడుతున్నట్టుగా అమెరికా నిజంగా మునిగిపోతుందా? లేదా అనేది సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పు పాఠం మీద ఆధారపడి ఉంటుంది.