Begin typing your search above and press return to search.

ట్రంప్ కు షాక్ : ఏకమవుతున్న మోడీ-పుతిన్-జిన్ పింగ్

ప్రపంచానికి పెద్దన్నగా వ్యవహరించాల్సిన డొనాల్డ్ ట్రంప్ అడ్డగోలు సుంకాల విధానాలు అవలంబించడం వల్ల అమెరికా ప్రతిష్ఠే దెబ్బతింటోందని విశ్లేషకులు అంటున్నారు.

By:  A.N.Kumar   |   27 Aug 2025 12:00 AM IST
ట్రంప్ కు షాక్ : ఏకమవుతున్న మోడీ-పుతిన్-జిన్ పింగ్
X

ప్రపంచానికి పెద్దన్నగా వ్యవహరించాల్సిన డొనాల్డ్ ట్రంప్ అడ్డగోలు సుంకాల విధానాలు అవలంబించడం వల్ల అమెరికా ప్రతిష్ఠే దెబ్బతింటోందని విశ్లేషకులు అంటున్నారు. ఒకప్పుడు అమెరికా సుంకాలు విధిస్తే దేశాలు వణికేవి. కానీ ఇప్పుడు ఆ భయాలు తగ్గిపోయాయి. అంతకుమించి అమెరికాకు ఎదురు తిరగడానికి దేశాలు సిద్ధమవుతున్నాయి.

- షాంఘై వేదిక.. త్రిపాక్షిక సమన్వయం

ట్రంప్ సుంకాలకు ప్రత్యామ్నాయంగా చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ కొత్త వేదికను సిద్ధం చేస్తున్నారు. ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 1 వరకు చైనాలోని తియాంజిన్‌లో జరగనున్న షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) సమ్మిట్‌లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొననున్నారు. ఈ సమ్మిట్‌లో మధ్య ఆసియా, దక్షిణాసియా, ఆగ్నేయాసియా, మధ్య ప్రాచ్య దేశాల నాయకులు కూడా హాజరవుతారు.

గల్వాన్ ఘర్షణల తర్వాత మోదీ తొలిసారిగా చైనాలో పాదం మోపుతున్నారు. 2024లో రష్యాలో జరిగిన బ్రిక్స్ సమ్మిట్ తర్వాత మోదీ, జిన్‌పింగ్ ఒకే వేదికపై కనిపించడం ఇదే మొదటిసారి కావడం విశేషం.

- అమెరికా అహంకారానికి బదులివ్వాలని చైనా యత్నం

గత జనవరి నుంచి అమెరికా... భారత్, చైనా, రష్యాలపై వాణిజ్యపరమైన, దౌత్యపరమైన ఒత్తిళ్లు తీసుకొస్తూనే ఉంది. కానీ ఫలితం లేకపోవడంతో ట్రంప్ మరింత సుంకాల మార్గాన్ని ఎంచుకున్నారు. అమెరికా ఆధిపత్యాన్ని సవాలు చేయడానికి చైనా, రష్యా, భారత్ సమన్వయం చేసుకుంటున్నట్లు గ్లోబల్ మీడియా భావిస్తోంది.

- భారత్ కీలక ప్రకటనకు రంగం సిద్ధం

ఈ వేదికపై భారత్ ఉగ్రవాదంపై ఘాటైన ప్రకటన చేసే అవకాశముందని సమాచారం. సరిహద్దులు దాటి జరుగుతున్న ఉగ్రవాదాన్ని ఖండిస్తూ మోదీ బలమైన సందేశాన్ని ఇవ్వనున్నారని అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విదేశాంగ శాఖ అధికారులు ఉగ్రవాదంపై భారత్ వెనకడుగు వేయదని స్పష్టం చేశారు.

- గ్లోబల్ దృష్టి తియాంజిన్ వైపు

ట్రంప్ సుంకాల నిర్ణయాలతో ఆర్థిక ఉద్రిక్తతలు పెరుగుతున్న ఈ సమయంలో SCO సమ్మిట్ మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. చైనా వేదికపై మోదీ, పుతిన్, జిన్‌పింగ్ ఒకే సారి ప్రత్యక్షం కావడం ప్రపంచ శ్రద్ధను ఆకర్షిస్తోంది. రాబోయే రోజుల్లో అమెరికా-చైనా వాణిజ్యపోరు కొత్త మలుపు తిరుగుతుందా అన్న ప్రశ్న ఇప్పుడు గ్లోబల్ చర్చగా మారింది.