సంతోషంగా లేను.. ఇండియాపై పన్నులేస్తా.. ట్రంప్ మళ్లీ ఏసేశాడు
ట్యాక్స్.. ట్యాక్స్.. గత ఏడాది జనవరిలో అధికారం చేపట్టినప్పటి నుంచి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒకటే కలవరిస్తున్న మాట ఇది..!
By: Tupaki Political Desk | 5 Jan 2026 12:06 PM ISTట్యాక్స్.. ట్యాక్స్.. గత ఏడాది జనవరిలో అధికారం చేపట్టినప్పటి నుంచి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒకటే కలవరిస్తున్న మాట ఇది..! ఇప్పటికే భారత్ పై పన్నులను ఇష్టారీతిగా పెంచేశాడు..! గత ఏడాది ఆగస్టు నుంచి అమల్లోకి వచ్చిన నిర్ణయాల ప్రకారం.. మన దేశ వస్తువులపై సుంకాలు 50 శాతం పెంచారు. ఇందులో 25 శాతం పరస్పర పన్ను (రెసిప్రొకల్- అంటే మనం టారిఫ్ లు వేస్తున్నందుకు బదులుగా టారిఫ్ లు) కాగా... మిగతా 25 శాతం రష్యా చమురు కొనుగోలు చేస్తున్నందుకు విధించినది కావడం గమనార్హం. రష్యా వివిధ దేశాలకు తన ఆయిల్ ను విక్రయించడం ద్వారా వచ్చిన డబ్బును ఉక్రెయిన్ పై యుద్ధంలో వినియోగిస్తోందని, రష్యాను కట్టడి చేయాలంటే దాని వద్ద నుంచి ఆయిల్ ను కొనే దేశాలపై కొరడా ఝళింపించాలనేది ట్రంప్ ఆలోచన. పర్యవసానంగా భారత్ 25 శాతం ట్యాక్స్ భరించాల్సి వచ్చింది. ఇప్పుడు మళ్లీ అదే భూతాన్ని చూపించి భారత్ పై టారిఫ్ లు పెంచుతానంటూ ట్రంప్ వ్యాఖ్యలు చేస్తున్నారు.
ఇంకా ఎంత బాదుతారో..?
ఇప్పటికే వంద రూపాయిలు ఉన్న ట్యాక్స్ ను 150 చేశారు ట్రంప్. మళ్లీ ఇప్పుడు ఇంకా ఎంత వేస్తారో అనే ఆందోళన వ్యక్తం అవుతోంది. తాజాగా ఈ మేరకు ట్రంప్ టారిఫ్ ల పెంపు హెచ్చరిక వీడియో బయటకు వచ్చింది. అవి కూడా చమురు సంపన్న దేశం వెనెజువెలాను అధ్యక్షుడు మదురోను ఎత్తుకెళ్లిన అనంతరం చేసిన వ్యాఖ్యలు కావడం గమనార్హం.
మోదీ మంచోరే.. కానీ, నేను అన్ హ్యాపీ
ఒకవైపు భారత ప్రధాని నరేంద్ర మోదీ మంచి వ్యక్తి అని పొగుడుతూనే ట్రంప్.. రష్యాతో భారత్ వ్యాపారం కొనసాగించడాన్ని ప్రస్తావించారు. దీని కారణంగా తాను సంతోషంగా లేనని. టారిఫ్ లను వేగంగా పెంచేస్తా అంటూ హెచ్చరించారు. ఈ మేరకు వీడియోను అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ ఎక్స్ లో పోస్ట్ చేసింది. రష్యా నుంచి చమురు కొనొద్దు అనే తమ ఆదేశాలను పాటించకపోతే భారత్ పై టారిఫ్ లు బాదేస్తాం అన్నది ట్రంప్ ఉద్దేశంగా స్పష్టం అవుతోంది. ప్రస్తుతం భారత్-అమెరికా మధ్య వాణిజ్య చర్చలు జరుగుతున్నాయి. ఇలాంటి సమయలో ట్రంప్ టారిఫ్ ల హెచ్చరికలు చేయడం.. అదికూడా కేవలం నాలుగైదు నెలల వ్యవధిలోనే మళ్లీ పెంచేస్తామనడం గమనార్హం.
ఒత్తిడి పెంచే మార్గమా?
ఇప్పటికే మోదీ రష్యా నుంచి చమురు కొనేది లేదంటూ తనకు హామీ ఇచ్చారని చెప్పి ట్రంప్ ఇరకాటంలో పెట్టారు. అయితే, భారతీయుల ప్రయోజనాలు కాపాడేందుకే తమ ప్రాధాన్యం అని, అందుకే రష్యా నుంచి ముడి చమురు కొంటున్నామని భారత్ తేల్చిచెప్పింది. ట్రంప్ తాజా వ్యాఖ్యలను చూస్తే... ఆయన భారత్ పై రష్యా చమురు విషయంలో ఒత్తిడి పెంచే ఉద్దేశంలో ఉన్నట్లుగా కనిపిస్తోంది. ట్రంప్ చర్యలతో ఆంధ్రా రొయ్యలతో పాటు భారతీయ వస్త్ర, వజ్రాలు-నగలు, ఇంజనీరింగ్, తోలు, సముద్ర ఉత్పత్తులపై భారం పడింది. బంగ్లాదేశ్ కంటే భారత వస్తువులు అమెరికా మార్కెట్ లో ఖరీదైనవిగా మారాయి. దీనిని పరిష్కరించేందుకే.. వాణిజ్య చర్చలు జరుగుతుండగా.. మళ్లీ టారిఫ్ లు వేస్తాం అంటూ ట్రంప్ మాట్లాడడం ఏమిటో అర్థం కావడం లేదు.
