ట్రంప్ సుంకాల ఎఫెక్టును మోడీ ఎలా డీల్ చేస్తే బెటర్?
అగ్రరాజ్య అధినేత ట్రంప్ భారత్ మీద విధించిన సుంకాల షాక్ కారణంగా దేశంలోని పలు రాష్ట్రాలు ప్రభావితమవుతుంటాయి.
By: Garuda Media | 1 Sept 2025 3:17 PM ISTఅగ్రరాజ్య అధినేత ట్రంప్ భారత్ మీద విధించిన సుంకాల షాక్ కారణంగా దేశంలోని పలు రాష్ట్రాలు ప్రభావితమవుతుంటాయి. అమెరికాకు వివిధ ఉత్పత్తుల్ని ఎగుమతులు చేసే రాష్ట్రాల మీద ఈ ప్రభావం నేరుగా ఉంటుంది. ఇలాంటి వేళ.. తమను ఆదుకోవాలని.. తమకు తక్షణ ఉపశమనం కలిగేలా చేయాలని సదరు రాష్ట్రాలకు చెందిన పలు పార్టీ నేతలు కేంద్రాన్ని కోరుతున్నారు
మిగిలిన రాష్ట్రాల విషయాన్ని పక్కన పెడితే.. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు రాష్ట్రాల నుంచి అమెరికాకు ఎగుమతులు ఎక్కువగా ఉంటాయి.ట్రంప్ సుంకాల షాక్ తో.. ఆయా రాష్ట్రాల నుంచి వెళ్లే ఎగుమతులపై ప్రభావం పడుతుంటాయి. దీన్ని ఎలా అధిగమించాలన్న దానిపై కేంద్రం ఒక వ్యూహాన్ని సిద్ధం చేసుకోవాల్సిన అవసరం ఉంది. భారత్ నుంచి ఎగుమతి అయ్యే వస్తువుల మీద ట్రంప్ 50 శాతం సుంకాల్ని విధించిన నేపథ్యంలో.. తీవ్రంగా ప్రభావితమయ్యే రాష్ట్రాల్లో తమిళనాడు ఒకటని.. తమను తక్షణమే ఆదుకోవాలని టీవీకే అధ్యక్షుడు.. ప్రముఖ సినీ నటుడు విజయ్ కేంద్రాన్ని డిమాండ్ చేయటం తెలిసిందే.
భారత్ నుంచి అమెరికాకు జరిగే ఎగుమతుల్లో పది శాతం తమిళనాడు వాటా ఉందన్న ఆయన.. దీనికి సంబంధించి ట్రంప్ సుంకాల కారణంగా ప్రభావితమయ్యే రంగాల్ని ఆదుకోవాలని నరేంద్ర మోడీని సోషల్ మీడియా ద్వారా కోరారు‘దేశం మొత్తం మీదా అమెరికాకు జరిగే మొత్తం ఎగుమతుల్లో తమిళనాడు భాగస్వామ్యం 10 శాతం ఉంటుంది. జౌళి..తోలు.. పాదరక్షలు.. ఆటోమొబైల్ .. ఆటో విడిభాగాలు.. యంత్రాలు.. రసాయనాలు.. ఎలక్ట్రానిక్ వస్తువులు.. ఆభరణాలు తదితర పరిశ్రమలు ఉన్నాయి.వీటిని నమ్ముకొని లక్షలాది కుటుంబాలు జీవనాధారం ఉంది. అమెరికా పన్ను విధింపు అమల్లోకి రావటంతో తమిళనాడు ఎగుమతిదారులు తమను విడిచి పెట్టే పరిస్థితి వచ్చిందని పలువురు ఆందోళన చెందుతున్నారు. వీరి విషయంలో తక్షణ ఉపశమనం పొందేలా చర్యలు తీసుకోవాలి’’ అని కేంద్రాన్ని కోరారు.
సుంకాల కారణంగా నష్టపోయే వారికి సంబంధించి తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవటం లేదన్న విమర్శ చేసిన విజయ్.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జోక్యం చేసుకోవాలని.. వారికి సాయం చేయాలని కోరారు. అమెరికాకు పెద్ద ఎత్తున ఎగుమతులు చేసే రాష్ట్రాల్లో తమిళనాడుతో పాటు. కర్ణాటక.. తెలంగాణ.. ఏపీ రాష్ట్రాలు కూడా ఉన్నాయి. ఈ రాష్ట్రాల్లోని వేలాది కుటుంబాలు ప్రభావితమయ్యే వీలుంది. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి మోడీ మరింత చురుగ్గా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందన్న మాట పరిశ్రమ వర్గాల నుంచి వినిపిస్తోంది.
ఈ నేపథ్యంలో సుంకాల ప్రభావం పడే రాష్ట్రాల్లోని ఎగుమతిదారులకు ప్యాకేజీ ప్రకటించటం.. ఆయా రంగాల మీద ఆధారపడే వారికి భరోసాను కల్పించాల్సిన అవసరం ఉంది. అవసరమైతే.. రాష్ట్రాల్ని సైతం కొంత భాగస్వామ్యాన్ని ఇవ్వాలని.. మెజార్టీ భాగం కేంద్రం చూసుకుంటుందన్న భరోసాను ఇవ్వాల్సిన అవసరం మోడీ సర్కారు మీద ఉంది. ట్రంప్ ను బలంగా ఎదుర్కోవాలని భావిస్తున్న మోడీ.. అందుకు తగ్గట్లు చేపట్టిన చర్యల వేళ..ప్రభావితమయ్యే రాష్ట్రాల డిమాండ్లను సైతం పరగణలోకి తీసుకోవాల్సి ఉంది. సుంకాల షాక్ తో విలవిలలాడే వారిని ఊరడిస్తూ.. వారికి ఇబ్బందులు కలగకుండా చూడటం ద్వారా.. బయట పల్లకీమోత ఇలా ఉన్నా.. ఇంట్లో ఉండే ఈగల మోతకు చెక్ చెప్పాల్సిన బాధ్యత మోడీ మీద ఉందన్న విషయాన్ని మర్చిపోకూడదు. మరి.. మోడీ ఏం చేస్తారో చూడాలి.
