Begin typing your search above and press return to search.

స్నేహితుడు కాదు ఓన్లీ టారిఫ్ కింగ్... భారత్ లో ఈ రంగాలకు భారీ దెబ్బ!

ట్రంప్ తరచుగా భారతదేశాన్ని 'స్నేహితుడు' అని పిలుస్తూనే.. మరోవైపు మన దేశాన్ని 'టారిఫ్ కింగ్' అని ముద్ర వేస్తూ వ్యాఖ్యానించేవారు.

By:  Raja Ch   |   1 Aug 2025 4:00 AM IST
స్నేహితుడు కాదు ఓన్లీ టారిఫ్  కింగ్... భారత్  లో ఈ రంగాలకు భారీ దెబ్బ!
X

ట్రంప్ తరచుగా భారతదేశాన్ని 'స్నేహితుడు' అని పిలుస్తూనే.. మరోవైపు మన దేశాన్ని 'టారిఫ్ కింగ్' అని ముద్ర వేస్తూ వ్యాఖ్యానించేవారు. ఈ క్రమంలో ఆయన రెండో మాటకే ఎక్కువగా కట్టుబడినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో... ఆగస్ట్ 1 నుంచి భారత దిగుమతులపై 25 శాతం టారిఫ్ విధిస్తున్నట్టు ప్రకటించారు. ఈ నేపథ్యంలో.. ట్రంప్ నిర్ణయం వల్ల ఏయే రంగాలకు భారీ దెబ్బ అనే విషయంపై విశ్లేషణలు తెరపైకి వచ్చాయి.

అవును... ట్రంప్ తాజా 25% సుంకాల విధింపు నిర్ణయం భారతదేశాన్ని తీవ్రంగా ప్రభావితం చేయబోతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ టారిఫ్ వల్ల ప్రధానంగా... ఎలక్ట్రానిక్స్, ఫార్మా, టెక్స్ టైల్స్ రంగాలు తీవ్ర నష్టాన్ని ఎదుర్కొంటాయని అభిప్రాయపడుతున్నారు. ఇదే సమయంలో రత్నాలు, ఆభరణాలు, సముద్ర ఆహార ఎగుమతులు, ఆటో భాగాలు వంటి రంగాలు తక్షణ ప్రభావాలను అనుభవించే అవకాశం ఉందని చెబుతున్నారు.

వాస్తవానికి 2025 ఆర్థిక సంవత్సరానికి గాను అమెరికాతో భారత ట్రేడ్ సర్ ప్లస్ 41.18 బిలియన్ డాలర్స్ దాటగా.. ఇందులో భారత్ నుంచి అమెరికాకు ఎగుమతులు 11.6 శాతం పెరిగి 86.5 బిలియన్ డాలర్స్ కు చేరుకొంది! ఇదే క్రమంలో... దిగుమతులు 7.4 శాతం పెరిగి 45.3 బిలియన్ డాలర్స్ కు చేరుతుంది! ఈ నేపథ్యంలో... వ్యత్యాసాన్ని తగ్గించాలనే ఉద్దేశంతో ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెబుతున్నారు.

ఈ క్రమంలో... 2024 లో భారత్ నుంచి అమెరికాకు ప్రధానంగా ఉన్న ఎగుమతుల్లో ఫార్మా రంగం ఉంది. గత ఏడాది ఈ రంగం నుంచి అమెరికాకు 8.1 బిలియన్ డాలర్ల ఎగుమతులు జరిగాయి. ఆ తర్వాత స్థానాల్లో వరుసగా... టెలికాం సామాగ్రి (6.5 బిలియన్ డాలర్లు), రత్నాలు (5.3 బి.డాలర్లు), పెట్రోలియం ఉత్పత్తులు (4.1 బి.డాలర్లు) గా ఉన్నాయని నివేదికలు చెబుతున్నాయి.

ఇదే క్రమంలో... పసిడి, ఇతర ఆభరణాలు (3.2 బి.డాలర్లు).. వాహనాలు, వాహన విడిభాగాలు (2.8 బిలియన్ డాలర్లు).. రెడీమేడ్ దుస్తులు (2.8 బి.డాలర్లు).. ఇనుము, ఉక్కు (2.7 బి.డాలర్లు) గా ఉన్నాయి.

ఈ నేపథ్యంలోనే... ట్రంప్ కొత్త టారిఫ్ విధానం భారత వ్యాపార రంగాలకు గట్టి దెబ్బగా మారనుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీనికి వ్యతిరేకంగా భారత్ ప్రభుత్వం, వ్యాపార సంఘాలు ఎలా స్పందిస్తాయనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఈ సమయంలో ఐరోపా యూనియన్ దేశాల మధ్య చర్చలు, వ్యూహాత్మక నిర్ణయాలే ఈ సమస్య నుండి భారత్ కు ఉపశమనం కలిగించే అవకాశాలున్నాయని అంటున్నారు.

ప్రధానంగా తగ్గింపు ధరల కారణంగా భారతదేశం ప్రస్తుతం రష్యా నుండి దాదాపు 37% చమురును కొనుగోలు చేస్తోంది. ఈ దిగుమతులను లక్ష్యంగా చేసుకుని అమెరికా జరిమానా విధించడం వల్ల ఇంధన ఖర్చులు పెరగవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇదే సమయంలో... సుంకాలు తక్కువగా ఉన్న దేశాల నుండి గట్టి పోటీని ఎదుర్కొంటున్నందు వల్ల భారతీయ ఆటో విడిభాగాల తయారీదారులు స్వల్పకాలంలో నష్టపోవచ్చని అంటున్నారు.