ప్రతి అమెరికన్‌కు $2000.. యాంటిమెంట్ పూస్తోన్న ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తమ వినూత్న ఆర్థిక ఆలోచనలతో ప్రపంచ దృష్టిని ఆకర్షించారు.
By: A.N.Kumar | 10 Nov 2025 11:10 AM ISTఇటీవల లక్షలాది మంది అమెరికన్లు రోడ్డుకెక్కారు. ట్రంప్ అమెరికాను కింగ్ లా పాలిస్తున్నాడని అమెరికా చరిత్రలోనే అతిపెద్ద నిరసన తెలిపారు. ట్రంప్ కు కూడా ఈ సెగ తగిలింది. అందుకే కాలిన గాయాలపై యాంటిమెంట్ పూసే ప్రయత్నాలకు దిగారు. ఎవరైతే రోడ్డెక్కారో ఆ అమెరికన్లకు డాలర్ల వల వేస్తున్నారు. వారికి ఆర్థిక సాయం అందించే కొత్త ఎత్తుగడ వేశారు. మరి ఈ సాయం ట్రంప్ పాలనపై వ్యతిరేకత తగ్గిస్తుందా? లేదా చూడాలి.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తమ వినూత్న ఆర్థిక ఆలోచనలతో ప్రపంచ దృష్టిని ఆకర్షించారు. ఆయన తాజాగా ప్రకటించిన "టారిఫ్ డివిడెండ్ పథకం" అమెరికాలో పెద్ద చర్చకు దారి తీస్తోంది. ఈ ప్రణాళిక ప్రకారం టారిఫ్‌ల ద్వారా ప్రభుత్వం వసూలు చేసిన భారీ ఆదాయాన్ని ప్రజలకే తిరిగి పంచాలని ఆయన ప్రతిపాదిస్తున్నారు.
* ప్రతి అమెరికన్‌కు $2000 డివిడెండ్
ట్రంప్ కొత్త ప్లాన్ ప్రకారం.. టారిఫ్‌ల ద్వారా వచ్చే ఆదాయంలో నుంచి "ప్రతి అమెరికన్‌కు కనీసం $2000 టారిఫ్ డివిడెండ్‌గా ఇవ్వబడుతుంది." అయితే ఈ పథకం కేవలం మధ్యతరగతి.. తక్కువ ఆదాయ వర్గాలకే పరిమితమవుతుందని, అధిక ఆదాయ వర్గానికి చెందినవారు దీనికి అనర్హులని ఆయన తెలిపారు. ఈ ప్రతిపాదన అమల్లోకి వస్తే, కోట్లాది మంది అమెరికన్లకు నేరుగా ఆర్థిక ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది.
* టారిఫ్‌లు: అప్పు తీర్చే సాధనం
తన టారిఫ్ విధానాలను సమర్థించుకుంటూ ట్రంప్ మాట్లాడుతూ "మా ప్రభుత్వం భారీగా టారిఫ్‌లు విధించి ట్రిలియన్ల డాలర్లు వసూలు చేస్తోంది. ఈ ఆదాయంతో మేము $37 ట్రిలియన్ డాలర్ల జాతీయ అప్పు తీర్చబోతున్నాం" అని పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ టారిఫ్‌ల కారణంగానే అమెరికాలో పెట్టుబడులు, కొత్త ఫ్యాక్టరీలు.. పరిశ్రమలు పెరుగుతున్నాయని ఆయన నొక్కి చెప్పారు. టారిఫ్ విధానాలను విమర్శిస్తున్న వారిని ఆయన "ఫూల్స్’ అని అభివర్ణించారు. "ఈ టారిఫ్‌ల లాభాలను వారు గ్రహించడం లేదు" అని ఆయన వ్యాఖ్యానించారు.
* సుప్రీంకోర్టులో విచారణ
ట్రంప్ ప్రభుత్వం విధించిన "అసాధారణంగా అధిక టారిఫ్‌లు"పై దాఖలైన కేసు ప్రస్తుతం సుప్రీంకోర్టులో విచారణలో ఉంది. ఈ టారిఫ్ రేట్లు గ్లోబల్ వాణిజ్యానికి ఆటంకం కలిగిస్తున్నాయని ప్రతిపక్షాలు వాదిస్తుండగా.. ట్రంప్ మాత్రం ఇవే అమెరికా ఆర్థిక పునరుజ్జీవానికి మూలం అని బలంగా వాదిస్తున్నారు.
* రాజకీయ లబ్ధిపై అంచనాలు
ఆర్థిక నిపుణులు మాత్రం ఈ $2000 టారిఫ్ డివిడెండ్ పథకాన్ని ప్రజల్లో అసంతృప్తిని, అసమ్మతిని తగ్గించే ఒక ప్రజాఅనుగ్రహ హామీగా చూస్తున్నారు. ట్రంప్ ఆర్థిక విధానాలు ఎప్పుడూ వివాదాస్పదంగా ఉన్నప్పటికీ ఆయన ప్రజాదరణ మాత్రం తగ్గలేదు. ఈ కొత్త పథకం ఆయనకు రాజకీయంగా ఎంత మేలు చేస్తుందో, తద్వారా రాబోయే ఎన్నికల్లో విజయం సాధించడానికి ఎంతవరకు దోహదపడుతుందో అనేది సమయం చెప్పాల్సిన విషయం.
