రష్యా పేరు చెప్పి భారత్ పై ఈ బాదుడు ఆలోచనలేంది ట్రంప్?
ఈ క్రమంలో మరింతగా సుంకాల పెంపుకు సంబంధించిన బిల్లుకు తాను మద్దతిస్తున్నట్లు తాజాగా ఆయన వెల్లడించారు.
By: Raja Ch | 18 Nov 2025 1:00 AM ISTరష్యా - ఉక్రెయిన్ మధ్య యుద్ధం ఆపడం సంగతేమో కానీ.. ఈ గ్యాప్ లో ప్రపంచ దేశాలను, ప్రధానంగా భారత్ ను గట్టిగా బాదే ఆలోచనలు చేస్తున్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్! భారత్ తమకు మంచి మిత్రదేశం అని, భారతీయులంతా మంచివారని, ప్రధాని మోడీ తనకు మంచి మిత్రుడని చెబుతూనే చేయాల్సినదంతా చేస్తున్నారు. ఈ సమయంలో మరో భారీ బాంబు పేల్చారు!
అవును... రష్యా - ఉక్రెయిన్ ల మధ్య యుద్ధం ఆపేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా అవి ఫలించకో.. లేక, ఆ పేరు చెప్పి తన పని తాను కానివ్వాలనో తెలియదు కానీ... పలు ప్రపంచ దేశాలను సుంకాలతో గట్టిగా బాదే పనికి పూనుకున్నారు ట్రంప్. ఇందులో భాగంగా... రష్యాతో వ్యాపారం చేసే దేశాలపై సుంకాల పెంపుకు సంబంధించిన బిల్లుకు తాను మద్ధతిస్తున్నట్లు తాజాగా వెల్లడించారు.
వాస్తవానికి రష్యాతో వ్యాపారం చేసే దేశాలపై ఇప్పటికే పెద్ద మొత్తం లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సుంకాలు విధిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మరింతగా సుంకాల పెంపుకు సంబంధించిన బిల్లుకు తాను మద్దతిస్తున్నట్లు తాజాగా ఆయన వెల్లడించారు. మాస్కోతో వాణిజ్యం చేసే దేశాలపై మరిన్ని కఠిన చర్యలకు సిద్ధమవుతున్నట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే బిగ్ బాంబ్ పేల్చారు.
ఇందులో భాగంగా... రష్యాతో వ్యాపారం చేసే దేశాలపై 500శాతం టారిఫ్ లు విధిస్తానన్నారు. అయితే.. ఈ జాబితాలో కచ్చితంగా భారత్, చైనా ఉంటాయని చెబుతున్నారు! వీటీతో పాటు ఇరాన్ కూ ఎఫెక్ట్ తప్పదనే కామెంట్లు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన బిల్లును రిపబ్లికన్ సెనేటర్ లిండ్సే గ్రాహం ఇటీవల ప్రతిపాదించారు.
ఈ బిల్లులో... రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తూ, ఉక్రెయిన్ కు సాయం చేయని దేశాల ఉత్పత్తులపై 500 శాతం సుంకం విధిస్తున్నామని ట్రంప్ అన్నారు. ఇదే సమయంలో.. భారత్, చైనాలే రష్యా నుంచి సుమారు 70శాతం చమురును కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో.. ఈ బిల్లు అమల్లోకి వస్తే ఆ దేశం నుంచి పెద్ద మొత్తంలో ముడి చమురు దిగుమతి చేసుకుంటున్న భారత్, చైనాలపై తీవ్ర ప్రభావం పడనుంది.
కాగా... భారతదేశంపై 50 శాతం సుంకాలు, రష్యా నుంచి ఇంధన కొనుగోళ్లకు సంబంధించి ఇంకో 25 శాతం సుంకం సహా ప్రపంచంలోని పలు దేశాలపై కొన్ని అత్యంత తీవ్రమైన సుంకాలను ట్రంప్ పరిపాలన ఇప్పటికే విధించిన సంగతి తెలిసిందే! అవే బాదుడు అనుకుంటే.. ఇప్పుడు ఏకంగా 500% అని ట్రంప్ అంటుండటంతో ఇది తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
