Begin typing your search above and press return to search.

అనుకున్నంత అయింది..కొరుకుడుప‌డ‌ని దేశంపై ట్రంప్ క‌న్ను

అమెరికాకు కేవ‌లం కొన్ని మైళ్ల దూరంలో ఉండే ఈ దేశం మూడు చెరువుల నీళ్లు తాగిస్తోంది. అందుకే ట్రంప్ టార్గెట్ చేశాడు.

By:  Tupaki Political Desk   |   12 Jan 2026 8:30 AM IST
అనుకున్నంత అయింది..కొరుకుడుప‌డ‌ని దేశంపై ట్రంప్ క‌న్ను
X

చేగువేరా పోరాట‌ కాలంలో మింగుడుప‌డ‌ని గుళిక‌.. ఫిడేల్ క్యాస్ట్రో ఆధ్వ‌ర్యంలో కొర‌క‌రాని కొయ్య‌.. రౌల్ క్యాస్ట్రో సార‌థ్యంలో అమెరికాకు పంటికింది రాయి.. చిన్న దేశ‌మే అయినా అమెరికా ప‌క్క‌లో బ‌ల్లెం.. ద‌శాబ్దాలుగా ఎన్ని ప్ర‌య‌త్నాలు చేసినా లొంగ‌ని శ‌త్రువు.. ఇప్పుడు ఈ దేశంపై అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ క‌న్నుప‌డింది. అస‌లే బాగా ఇబ్బందుల్లో ఉంది. ఇదే స‌మ‌యం అనుకున్న‌ట్లున్నాడు. మొత్తానికి అన్నంత అన్నంత ప‌ని చేసేలా ఉన్నాడు ఆయ‌న‌. అందుకే వెనెజులా త‌ర్వాత ఇప్పుడు ఆ దేశానికి హెచ్చ‌రిక‌లు పంపాడు. వెనెజులా నుంచి ఇక చ‌మురు, డ‌బ్బు రాదంటూ సందేశం ఇచ్చాడు. త‌మ‌తో ఒప్పందానికి రావాలంటూ సూచించాడు. అమెరికాకు కేవ‌లం కొన్ని మైళ్ల దూరంలో ఉండే ఈ దేశం మూడు చెరువుల నీళ్లు తాగిస్తోంది. అందుకే ట్రంప్ టార్గెట్ చేశాడు.

ఒప్పందం చేసుకుంటారా? లేదా?

అమెరికాకు అత్యంత ద‌గ్గ‌ర‌గా ఉంటూనే ఆ దేశానికి ఏమాత్రం వ‌శ‌ప‌డని దేశం క్యూబా. విప్లవ యోధుడు చేగువెరా నుంచి ఆయ‌న బాట‌లో న‌డిచిన ఫిడేల్ క్యాస్ట్రో, ఆయ‌న త‌మ్ముడు రౌల్ క్యాస్ట్రో ద‌శాబ్దాలుగా అమెరికాను ఎదిరించారు. అంతెందుకు? ఫిడేల్ ను హ‌త‌మార్చేందుకు అమెరికా 643 సార్లు ప్ర‌య‌త్నాలు చేసిందంటేనే క్యూబాపై ఎన్ని కుట్ర‌లు చేసిందో తెలుస్తుంది. ఫిడేల్, రౌల్ శ‌కం ముగియ‌డంతో క్యూబా కాస్త వెనుక‌బ‌డింది కానీ.. లేదంటే అమెరికా క‌ళ్ల‌లో నిప్పులు పోసుకునేది. అందుకే ఇప్పుడు ట్రంప్.. ఒప్పందానికి రావాలంటూ హెచ్చ‌రిక‌లు చేస్తున్నారు. వెనెజులా-క్యూబా స‌హ‌జ మిత్రులు. ఇంత‌కాలం వెనెజులా చ‌మురు, డ‌బ్బుతో క్యూబా మ‌నుగ‌డ సాధించింది... ఇక‌మీద వెళ్ల‌వ‌ని స్ప‌ష్టం చేశారు. ప‌రిస్థితి చేయిదాట‌క‌ముందే త‌మ‌తో ఒప్పందానికి రావాలంటూ ట్రంప్ త‌న సొంత సోష‌ల్ మీడియా ట్రూత్ లో పోస్ట్ చేశారు.

వెనెజులా పాల‌కుల‌కు ర‌క్ష‌ణ‌

వెనెజులా నుంచి అందిన డ‌బ్బు, చ‌మురుకు గాను ఆ దేశ మాజీ అధ్య‌క్షులు హ్యూగో చావెజ్, నికొల‌స్ మ‌దురోల‌కు క్యూబా భ‌ద్ర‌తా సేవ‌లు అందించింద‌ని ట్రంప్ ఆరోపించారు. మ‌దురో నిర్బంధం సంద‌ర్భంగా త‌మ దాడిలో చాలా మంవ‌ది క్యూబా భ‌ద్రతాధికారులు చ‌నిపోయార‌ని తెలిపారు. వీరంతా గూండాలు, దోపిడీదారుల‌ని నిందించారు. వీరి అవ‌స‌రం ఇక‌పై వెనెజులాకు లేద‌ని, ప్ర‌పంచంలో అత్యంత శ‌క్తిమంత‌మైన అమెరికా సైన్యం అండగా ఉంద‌ని తెలిపారు.

క్యూబాకు క‌ష్టాలేనా?

క్యూబా చాలా చిన్న దేశం. 30 శాతం చ‌మురు అవ‌స‌రాల‌ను వెనెజులానే తీరుస్తుంది. అదే స‌మ‌యంలో ఇప్పుడు ఆ దేశం అమెరికా చేతుల్లోకి వెళ్లింది. మ‌దురో నిర్బంధం స‌మ‌యంలో ఆయ‌న చుట్టూ ఉన్న‌ది క్యూబా భ‌ద్ర‌తాధికారులేన‌ని తెలుస్తోంది. ఆ స‌మ‌యంలో 32 మంది చ‌నిపోయార‌ని క‌థ‌నాలు వ‌చ్చాయి. ప్ర‌స్తుతం క్యూబాకు మిగెల్ డియ‌జ్ అధ్య‌క్షుడిగా ఉన్నారు.