Begin typing your search above and press return to search.

తైవాన్‌కు షాకిచ్చిన ట్రంప్.. సంచలన ప్రకటన

అంతర్జాతీయ రాజకీయ యవనికపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తనదైన శైలిలో సంచలనం సృష్టించారు.

By:  A.N.Kumar   |   16 May 2026 11:40 PM IST
తైవాన్‌కు షాకిచ్చిన ట్రంప్.. సంచలన ప్రకటన
X

అంతర్జాతీయ రాజకీయ యవనికపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తనదైన శైలిలో సంచలనం సృష్టించారు. చైనా పర్యటన ముగించుకున్న అనంతరం ఓ ప్రముఖ అంతర్జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తైవాన్ అంశంపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెను దుమారం రేపుతున్నాయి. దశాబ్దాలుగా తైవాన్‌కు బాసటగా నిలుస్తున్న అమెరికా విదేశాంగ విధానాన్ని ఒక్కసారిగా ప్రశ్నించేలా ఉన్న ట్రంప్ ప్రకటన చూసి రాజకీయ విశ్లేషకులు సైతం ముక్కున వేలేసుకుంటున్నారు. ఈ వ్యాఖ్యలు అటు తైవాన్‌లో తీవ్ర ఆందోళనకు కారణమవ్వగా ఇటు చైనా వ్యూహాత్మక వర్గాల్లో హర్షాన్ని వ్యక్తంచేసేలా ఉన్నాయి.

భౌగోళిక దూరంపై ట్రంప్ లాజిక్.. అమెరికా రక్షణ హామీపై నీలినీడలు!

ఈ ఇంటర్వ్యూలో ట్రంప్ ప్రధానంగా తైవాన్ రక్షణ విషయంలో అమెరికాకున్న భౌగోళిక పరిమితులను ప్రస్తావించారు. చైనా వంటి అగ్రరాజ్యంతో నేరుగా తలపడటం అంత సులువు కాదని స్పష్టం చేస్తూ తైవాన్ స్వాతంత్ర్య ప్రయత్నాలు ప్రాంతీయ స్థిరత్వాన్ని దెబ్బతీస్తున్నాయని హెచ్చరించారు. "తైవాన్‌ భౌగోళికంగా చైనాకు కేవలం 95 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంది. కానీ మా అమెరికా నుంచి చూస్తే అది 15 వేల కిలోమీటర్లకు పైగా దూరంలో ఉంది. అంత సుదూర ప్రాంతంలో ఒకవేళ యుద్ధం లాంటి అత్యవసర పరిస్థితి వస్తే, వెంటనే స్పందించడం మాకు అత్యంత సంక్లిష్టమైన కష్టతరమైన విషయం." అని డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు.

ఈ వ్యాఖ్యల ద్వారా భవిష్యత్తులో చైనా గనక తైవాన్‌పై దాడికి దిగితే అమెరికా సైన్యం నేరుగా రంగంలోకి దిగుతుందా లేదా అనే విషయమై ట్రంప్ స్పష్టమైన అనుమానాలను రేకెత్తించారు. ఇప్పటివరకు వాషింగ్టన్ అనుసరిస్తూ వచ్చిన "వ్యూహాత్మక అస్పష్టత" విధానానికి భిన్నంగా , తైవాన్‌ను రక్షించడం ప్రాధాన్యత కాదనే సంకేతాలను ఇవ్వడం గమనార్హం.

"మా చిప్ ఇండస్ట్రీని దొంగిలించారు".. ట్రంప్ తీవ్ర ఆరోపణలు

ట్రంప్ కేవలం భౌగోళిక దూరం గురించే కాకుండా తైవాన్ ఆర్థిక పునాదులపై కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. "తైవాన్‌ మా దేశపు చిప్‌ ఇండస్ట్రీని సెమీకండక్టర్ రంగం దొంగిలించి ప్రపంచంలోనే అగ్రగామిగా ఎదిగింది" అంటూ తీవ్ర ఆరోపణలు గుప్పించారు.

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్‌ఫోన్‌లు, కార్లు, రక్షణ పరికరాలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాలకు అవసరమైన అత్యాధునిక సెమీకండక్టర్ చిప్స్‌ తయారీలో తైవాన్‌కు చెందిన టీఎస్ఎంసీ వంటి సంస్థలు అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నాయి. ప్రపంచ చిప్ మార్కెట్‌లో తైవాన్‌ది గుత్తాధిపత్యం. అలాంటి వ్యూహాత్మక రంగాన్ని ప్రస్తావిస్తూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అమెరికా-తైవాన్ వాణిజ్య సంబంధాలను దెబ్బతీసే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా తైవాన్‌కు ఆయుధాల విక్రయంపై తామింకా ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదని ట్రంప్ తేల్చి చెప్పడం తైవాన్ భద్రతా విభాగాలను ఉలిక్కిపడేలా చేసింది.

జిన్‌పింగ్ భేటీలో అసలు ఏం జరిగింది?

ఇటీవల చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో ట్రంప్ జరిపిన భేటీలో కూడా తైవాన్ అంశమే అజెండాలో అగ్రస్థానంలో నిలిచినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. అమెరికా-చైనా మధ్య సంబంధాలు దెబ్బతినకుండా ఉండాలంటే తైవాన్ సమస్యను అత్యంత జాగ్రత్తగా పరిష్కరించాలని.. లేనిపక్షంలో ఇరు దేశాల మధ్య ప్రత్యక్ష ఘర్షణ తప్పదని జిన్‌పింగ్ ట్రంప్‌ను గట్టిగా హెచ్చరించినట్లు సమాచారం.

అమెరికా, చైనాలు పరస్పరం పోటీపడే ప్రత్యర్థులుగా కాకుండా భాగస్వామ్య దేశాలుగా ముందడుగు వేయాలని జిన్‌పింగ్ ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. ఈ భేటీ తర్వాతే ట్రంప్ వైఖరిలో ఇంతటి నాటకీయ మార్పు రావడం గమనార్హం.

మారనున్న ఆసియా-పసిఫిక్ సమీకరణాలు

చైనా చాలా కాలంగా తైవాన్‌ను తమ భూభాగంలో అంతర్భాగంగా చూస్తూ అవసరమైతే బలప్రయోగం ద్వారా నైనా విలీనం చేసుకుంటామని ప్రకటిస్తోంది. మరోవైపు తైవాన్ ప్రజాస్వామ్యబద్ధంగా స్వతంత్ర అస్తిత్వాన్ని కాపాడుకోవాలని పోరాడుతోంది. ఇప్పటివరకు అమెరికా "తైవాన్‌పై చైనా ఏకపక్షంగా ఎలాంటి చర్యలు తీసుకోకూడదు" అని గట్టిగా వాదిస్తూ వచ్చింది.

కానీ ప్రస్తుత అమెరికా అధ్యక్షుడి వ్యాఖ్యలు చైనాకు పరోక్షంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లేనని విశ్లేషకులు భావిస్తున్నారు. ట్రంప్ వ్యాఖ్యలతో తైవాన్ ప్రభుత్వం తీవ్ర ఆందోళనలో మునిగిపోగా చైనా మాత్రం అంతర్జాతీయంగా తన పట్టు బిగించడానికి ఇదొక సువర్ణావకాశంగా భావిస్తోంది. రాబోయే రోజుల్లో ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో అమెరికా-చైనా-తైవాన్ దేశాల మధ్య వ్యూహాత్మక సమీకరణాలు ఏ మలుపు తిరుగుతాయోనన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.