Begin typing your search above and press return to search.

బ్రేకింగ్ : గ్రీన్ కార్డ్ లాటరీని సస్పెండ్ చేసిన ట్రంప్

అమెరికాలో చోటు చేసుకున్న తాజా కాల్పుల ఘటన గ్రీన్ కార్డ్ లాటరీ ప్రోగ్రామ్ భవితవ్యాన్ని ప్రశ్నార్థకంగా మార్చింది.

By:  A.N.Kumar   |   19 Dec 2025 2:43 PM IST
బ్రేకింగ్ : గ్రీన్ కార్డ్ లాటరీని సస్పెండ్ చేసిన ట్రంప్
X

అమెరికాలో చోటు చేసుకున్న తాజా కాల్పుల ఘటన గ్రీన్ కార్డ్ లాటరీ ప్రోగ్రామ్ భవితవ్యాన్ని ప్రశ్నార్థకంగా మార్చింది. బ్రౌన్ యూనివర్సిటీలో జరిగిన కాల్పుల్లో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనకు కారణమైన నిందితుడు పోర్చుగీస్ జాతీయుడని.. అతడు డైవర్సిటీ వీసా (గ్రీన్ కార్డ్ లాటరీ) ద్వారానే అమెరికాలోకి ప్రవేశించాడని ట్రంప్ ప్రభుత్వం తేల్చింది. ఈ నేపథ్యంలోనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గ్రీన్ కార్డ్ లాటరీ ప్రోగ్రామ్ ను నిలిపివేయాలని కీలక నిర్ణయం తీసుకున్నారు.

ఈ విషయాన్ని హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీ క్రిస్టీ నోయెమ్ అధికారికంగా ప్రకటించారు. సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’లో ఆమె స్పందిస్తూ.. ఇలాంటి దారుణమైన వ్యక్తులను మన దేశంలోకి ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించకూడదు’ అని వ్యాఖ్యానించారు. గ్రీన్ కార్డ్ లాటరీ ప్రోగ్రామ్ ను తక్షణమే నిలిపి వేయాలని యూఎస్ సిటిజన్ షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్.సీ.ఐఎస్)కు ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించారు.

డైవర్సిటీ వీసా ప్రోగ్రామ్‌ను సాధారణంగా గ్రీన్‌కార్డ్ లాటరీగా పిలుస్తారు. ఇమిగ్రేషన్ అండ్ నేషనాలిటీ యాక్ట్ కింద ఈ ప్రోగ్రామ్‌ను అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్ పర్యవేక్షిస్తుంది. అమెరికాకు తక్కువ సంఖ్యలో వలస వచ్చిన దేశాల నుంచి భిన్న జాతీయతల ప్రజలు రావాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. దీని కింద ప్రతి ఏడాది సుమారు 55 వేల గ్రీన్‌కార్డులు మంజూరు చేస్తుంటారు.

అయితే భద్రతా లోపాలే ఇప్పుడు ఈ ప్రోగ్రామ్‌కు పెద్ద సవాలుగా మారాయి. తాజా కాల్పుల ఘటన నేపథ్యంలో గ్రీన్‌కార్డ్ లాటరీ విధానం జాతీయ భద్రతకు ముప్పుగా మారుతుందన్న వాదనలు బలపడుతున్నాయి. ఈ కారణంగానే ట్రంప్ ప్రభుత్వం కఠిన వైఖరి అవలంబిస్తూ ప్రోగ్రామ్‌ను నిలిపివేయాలన్న నిర్ణయానికి వచ్చింది.

ఈ పరిణామంతో గ్రీన్‌కార్డ్ లాటరీపై ఆశలు పెట్టుకున్న లక్షలాది మంది వలసదారుల భవిష్యత్తు అనిశ్చితిలో పడింది. రాబోయే రోజుల్లో ఈ నిర్ణయంపై న్యాయపరమైన, రాజకీయ చర్చలు మరింత వేడెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.