Begin typing your search above and press return to search.

ఎట్టకేలకు తలొగ్గాడు.. భారత్ తో న్యాయమైన డీల్ కు ట్రంప్ ఓకే

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చివరకు భారత్‌ ముందు తలవంచినట్లు కనిపిస్తోంది.

By:  A.N.Kumar   |   11 Nov 2025 11:31 AM IST
ఎట్టకేలకు తలొగ్గాడు.. భారత్ తో న్యాయమైన డీల్ కు ట్రంప్ ఓకే
X

మొండి మొగుడు చెబితే వినడు.. గిల్లితే ఏడుస్తాడు.. ఇలానే ఉంటుంది మన ట్రంప్ వైఖరి. ఆయన మాట వినడం లేదని భారత్ పై, మోడీపై కారాలు మిరియాలు నూరి 50 శాతం పన్నులు వేశాడు. అయితే భారత్ తగ్గేదేలే అనడంతో అది బూమరాంగ్ అయిపోయింది. అమెరికాలోనూ ట్రంప్ పై వ్యతిరేకత వచ్చిపడింది. మోడీ వెనక్కి తగ్గకపోవడంతో ఇక తప్పనిసరి పరిస్థితుల్లో ట్రంప్ నే వెనక్కి తగ్గాల్సిన పరిస్థితి ఏర్పడింది.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చివరకు భారత్‌ ముందు తలవంచినట్లు కనిపిస్తోంది. సుంకాల అంశంలో ఆయన చేసిన తాజా ప్రకటన అదే విషయాన్ని స్పష్టంగా సూచిస్తోంది. గత కొంతకాలంగా వాణిజ్య విధానాల కారణంగా భారత్‌పై అధిక సుంకాలు విధించిన అమెరికా.. ఇప్పుడు వాటిని తగ్గించే దిశగా అడుగులు వేస్తోందని ట్రంప్‌ వెల్లడించారు.

“భారత్‌తో మేము న్యాయమైన ఒప్పందం కుదుర్చుకునే దిశగా ఉన్నాం. ఇది గతంలో ఉన్న వాణిజ్య ఒప్పందాలకంటే పూర్తిగా భిన్నంగా ఉంటుంది. మేము దగ్గరగా వచ్చాం” అని ట్రంప్‌ విలేకరులతో మాట్లాడారు. “ప్రస్తుతం వారు (భారతదేశం) మమ్మల్ని అంతగా ఇష్టపడడం లేదు, కానీ త్వరలోనే మళ్లీ ప్రేమిస్తారు,” అని వ్యాఖ్యానించారు.

రష్యాతో చమురు వ్యాపారం కారణంగా భారత్‌ అమెరికా సుంకాలను ఎదుర్కొంటోందని ఆయన మరోసారి ప్రస్తావించారు. అయితే న్యూఢిల్లీ రష్యా చమురు కొనుగోళ్లను నిలిపివేసిందని ట్రంప్‌ వెల్లడించారు. గమనించాల్సిన విషయం ఏంటంటే.. ఆగస్టులో భారత దిగుమతులపై సుంకాలను 50 శాతానికి పెంచిన అమెరికా.. ఇప్పుడు తగ్గించడానికి సన్నద్ధమవుతోంది.

ఇది కేవలం వాణిజ్య అంశం మాత్రమే కాకుండా.. భారత్‌-అమెరికా సంబంధాల్లో కొత్త దశకు నాంది కావచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని ట్రంప్‌ పలు సందర్భాల్లో చెప్పినా భారత్‌ తరఫున ఈ వ్యాఖ్యలకు ఎప్పుడూ అధికారిక సమాధానం రాలేదు.

ఇదిలావుంటే.. అమెరికాలో 41 రోజులుగా కొనసాగుతున్న ప్రభుత్వ షట్‌డౌన్‌ ముగింపు దశకు చేరుకుంది. సెనెట్‌ ఇటీవల నిధుల వినియోగ తీర్మానానికి ఆమోదం తెలిపింది. దీంతో ఫెడరల్‌ శాఖలు, సంక్షేమ పథకాలు, విమానయానం వంటి రంగాల్లో నిలిచిపోయిన కార్యకలాపాలు త్వరలోనే సాధారణ స్థితికి రావచ్చని ట్రంప్‌ వెల్లడించారు.

డెమోక్రాట్లు అఫర్డబుల్‌ కేర్‌ చట్టం సబ్సిడీల పొడిగింపు కోరినప్పటికీ దానిపై హామీ లభించకపోవడంతో చర్చలు తీవ్రంగా సాగాయి. అయితే ఈ బిల్లుకు ప్రతినిధుల సభ ఆమోదం తెలపగానే అమెరికా ప్రభుత్వ కార్యకలాపాలు పునరుద్ధరించబడే అవకాశం ఉంది.

ట్రంప్‌ తాజాగా భారత్‌పై చూపిన సాఫ్ట్‌ వైఖరి.. ఒకవైపు వాణిజ్య ఒత్తిడి తగ్గించాలన్న అమెరికా ప్రయత్నంగా మరోవైపు భారత్‌తో మైత్రి సంబంధాలను బలోపేతం చేయాలన్న రాజకీయ వ్యూహంగా భావిస్తున్నారు.