ఇక న్యూయార్క్ ప్రజలు ఫ్లోరిడాకు పారిపోవాల్సిందే!
న్యూయార్క్ ప్రజలు కమ్యూనిజం ప్రభావంలో ఉన్నారని, త్వరలో ఈ నగరం క్యూబా లేదా వెనెజువెలా లాగా మారిపోతుందని ట్రంప్ వ్యాఖ్యానించారు.
By: A.N.Kumar | 6 Nov 2025 5:00 PM ISTఅమెరికా రాజకీయాలు మరోసారి డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలతో వేడెక్కాయి. భారత సంతతి యువ రాజకీయ నాయకుడు జోహ్రాన్ మమ్దానీ న్యూయార్క్ మేయర్‌గా ఎన్నికైన నేపథ్యంలో ట్రంప్ తీవ్ర విమర్శలు గుప్పించారు. మమ్దానీ విజయాన్ని అమెరికా సార్వభౌమత్వానికే ప్రమాదంగా ఆయన అభివర్ణించారు.
* న్యూయార్క్ 'కమ్యూనిస్టు నగరం'గా మారుతుందా?
న్యూయార్క్ ప్రజలు కమ్యూనిజం ప్రభావంలో ఉన్నారని, త్వరలో ఈ నగరం క్యూబా లేదా వెనెజువెలా లాగా మారిపోతుందని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఫ్లోరిడాలో జరిగిన అమెరికా బిజినెస్ ఫోరంలో మాట్లాడుతూ "ఇక న్యూయార్క్ నివాసులు ఫ్లోరిడాకు పారిపోవాల్సిందే" అని ఆయన వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ట్రంప్ మాటల్లో "డెమోక్రాట్లు అమెరికాను ఎలా మార్చాలని అనుకుంటున్నారో తెలుసుకోవాలంటే న్యూయార్క్ ఎన్నికల ఫలితాలను చూడండి. వారు కమ్యూనిస్టును మేయర్‌గా ఎంచుకున్నారు."
* ట్రంప్ ఆగ్రహం వెనుక కారణాలు: మమ్దానీ హామీలు
జోహ్రాన్ మమ్దానీ ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలు, ముఖ్యంగా ప్రగతిశీల విధానాలు ట్రంప్ దృష్టిలో "కమ్యూనిస్టు విధానాలు"గా కనిపించాయి. ట్రంప్‌కి ఆగ్రహం తెప్పించిన మమ్దానీ ప్రధాన హామీలు చూస్తే.. ఉచిత సిటీ బస్సు ప్రయాణాలు, అద్దె ధరల స్థిరీకరణ , యూనివర్సల్ చైల్డ్ స్కీమ్ అమలు, 2030 నాటికి కనీస వేతనాల పెంపు, సంపన్నులు, కార్పొరేట్లపై పన్ను పెంపు.. ఈ విధానాలు సోషలిస్టు-డెమోక్రాటిక్ భావజాలానికి దగ్గరగా ఉండటంతో ట్రంప్ వీటిని "అమెరికాకు విరుద్ధమైన" కమ్యూనిస్టు ఆలోచనలుగా ప్రచారం చేస్తున్నారు.
* మమ్దానీ విజయం - న్యూయార్క్ రాజకీయాలకు కొత్త దిశ
సామాన్యుల జీవిత ప్రమాణాలు మెరుగుపరచడమే తన లక్ష్యమని మమ్దానీ తన విజయ ప్రసంగంలో స్పష్టం చేశారు. ఆయన ప్రగతిశీల విధానాలు న్యూయార్క్ ప్రజల మద్దతును గెలుచుకున్నాయి. ఈ విజయం అమెరికా నగర రాజకీయాల్లో కొత్త అధ్యాయాన్ని తెరిచిందనే చెప్పాలి.
* ట్రంప్ పాలనపై పెరుగుతున్న ప్రతికూలత
మరోవైపు అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన ట్రంప్‌కి ఈ ఎన్నికల ఫలితాలు ఎదురుదెబ్బగా మారాయి. వర్జీనియా, న్యూజెర్సీ రాష్ట్రాల్లో ఆయన పార్టీకి చెందిన అభ్యర్థులు ఓటమి చెందారు. తాజా సర్వేల్లో 10 మందిలో 6 మంది ప్రజలు ప్రస్తుత పాలనపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘బిగ్ బ్యూటిఫుల్ బడ్జెట్ బిల్లు’, ఫెడరల్ ఉద్యోగుల తొలగింపులు వంటి చర్యలు ప్రజల్లో ప్రతికూల అభిప్రాయాన్ని కలిగించాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
* విభజనాత్మక రాజకీయ వాతావరణం
జోహ్రాన్ మమ్దానీ విజయం న్యూయార్క్ ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబిస్తున్నప్పటికీ, డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలు మళ్లీ ఒకసారి అమెరికాలో విభజనాత్మక రాజకీయ వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి.
న్యూయార్క్ కమ్యూనిస్టు నగరమవుతుందా? లేక ప్రజాస్వామ్య దిశలో కొత్త మలుపు తిప్పుతుందా? అన్నది ఇప్పుడు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. రాబోయే రోజుల్లో న్యూయార్క్ పాలన విధానాలు అమెరికా రాజకీయ భవిష్యత్తుపై ప్రభావం చూపడం ఖాయం.
