Begin typing your search above and press return to search.

చరిత్రను తిరగరాయనున్న 'ట్రంప్ సంతకం'

అమెరికా కరెన్సీ చరిత్రలో 1861 నుంచి ఒకే సంప్రదాయం కొనసాగుతోంది. డాలర్ నోట్లపై కేవలం ట్రెజరీ కార్యదర్శి , ట్రెజరర్ సంతకాలు మాత్రమే ఉండటం ఇన్నాళ్లూ ఆనవాయితీ.

By:  A.N.Kumar   |   27 March 2026 11:20 AM IST
చరిత్రను తిరగరాయనున్న ట్రంప్ సంతకం
X

అమెరికా రాజకీయ యవనికపై మరో అపూర్వ ఘట్టం ఆవిష్కృతమవబోతోంది. అగ్రరాజ్య చరిత్రలో మున్నెన్నడూ లేని విధంగా సుమారు 165 ఏళ్ల నాటి సంప్రదాయానికి స్వస్తి పలుకుతూ డొనాల్డ్ ట్రంప్ సర్కార్ ఒక సంచలన నిర్ణయానికి శ్రీకారం చుట్టింది. అమెరికా స్వాతంత్య్రం పొంది 250 వసంతాలు పూర్తి చేసుకుంటున్న శుభతరుణంలో ఈ వేడుకలను చిరస్మరణీయం చేసేందుకు సరికొత్త ప్రణాళికలు సిద్ధమయ్యాయి.

చరిత్రను తిరగరాయనున్న 'ట్రంప్ సంతకం'

అమెరికా కరెన్సీ చరిత్రలో 1861 నుంచి ఒకే సంప్రదాయం కొనసాగుతోంది. డాలర్ నోట్లపై కేవలం ట్రెజరీ కార్యదర్శి , ట్రెజరర్ సంతకాలు మాత్రమే ఉండటం ఇన్నాళ్లూ ఆనవాయితీ. అయితే, 2026 జూలై 4న జరగనున్న 250వ స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా కొత్తగా ముద్రించబోయే డాలర్ నోట్లపై స్వయంగా అధ్యక్షుడి సంతకాన్ని ముద్రించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయం అమలులోకి వస్తే అమెరికా కరెన్సీపై సంతకం చేసిన తొలి అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ చరిత్ర సృష్టించనున్నారు. ఇది కేవలం ఒక సంతకం మార్పు మాత్రమే కాదు, అమెరికా ఆర్థిక ,రాజకీయ వ్యవస్థలో ఒక భారీ సంస్కరణగా విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు.

బంగారు నాణెం.. దేశభక్తికి ప్రతీక

కేవలం కరెన్సీ నోట్లే కాకుండా ఈ వేడుకల కోసం ప్రత్యేకంగా 24 క్యారెట్ల బంగారు నాణెం నమూనాను కూడా ట్రంప్ ప్రభుత్వం ఆవిష్కరించింది. ఈ నాణెంపై ట్రంప్ చిత్రంతో పాటు 'అమెరికా 250' అనే చిహ్నాన్ని ముద్రించారు.దీన్ని కేవలం కరెన్సీగా కాకుండా, ఒక చారిత్రాత్మక జ్ఞాపికగా ప్రపంచవ్యాప్తంగా విక్రయించనున్నారు. అమెరికా వైభవాన్ని ప్రపంచానికి చాటిచెప్పడంతో పాటు, పౌరులలో దేశభక్తిని పెంపొందించడం ఈ నిర్ణయం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశమని శ్వేతసౌధ వర్గాలు పేర్కొన్నాయి.

ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయంపై అమెరికాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రతిపక్షాలు, కొందరు చరిత్రకారులు ఈ చర్యను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కరెన్సీ అనేది వ్యవస్థకు చిహ్నమని, దానిపై ఒక వ్యక్తి అధ్యక్షుడి సంతకం ఉండటం వల్ల వ్యవస్థ 'రాజకీయీకరణ' అవుతుందని వారు వాదిస్తున్నారు.

మరోవైపు ట్రంప్ అభిమానులు ఇది ఒక విప్లవాత్మక మార్పు అని కొనియాడుతున్నారు. 250 ఏళ్ల వేడుక అంటే సామాన్యమైన విషయం కాదని.. ఆ జ్ఞాపకం కలకాలం నిలిచిపోవాలంటే ఇలాంటి సాహసోపేత నిర్ణయాలు అవసరమని వారు సమర్థిస్తున్నారు.

2026 లక్ష్యంగా అడుగులు

మొత్తానికి అమెరికా 250వ జన్మదిన వేడుకలు కేవలం బాణసంచా వెలుగులకే పరిమితం కాకుండా డాలర్ రూపంలో ప్రతి అమెరికన్ జేబులోనూ ఒక కొత్త చరిత్రను నింపబోతున్నాయి. 165 ఏళ్ల నాటి సంప్రదాయాన్ని పక్కన పెట్టి తనదైన ముద్ర వేయాలనుకుంటున్న ట్రంప్ వ్యూహం ఏ మేరకు సఫలమవుతుందో చూడాలి. ఈ మార్పు ప్రపంచ ఆర్థిక మార్కెట్లపై ఎలాంటి ప్రభావం చూపుతుందనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారింది.