పట్టుబడ్డ కాలిఫోర్నియా టీచర్.. అమెరికా భద్రతా వైఫల్యంపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
ఈ ప్రమాదకర ఘటన తర్వాత డొనాల్డ్ ట్రంప్ స్పందించిన తీరు ఆయన మద్దతుదారులను విశేషంగా ఆకట్టుకుంది.
By: A.N.Kumar | 26 April 2026 10:48 AM ISTఅమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై జరిగిన కాల్పుల ప్రయత్నం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది. వాషింగ్టన్ డీసీలోని వాషింగ్టన్ హిల్టన్ హోటల్‌లో ఏర్పాటు చేసిన వైట్ హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్ సందర్భంగా చోటుచేసుకున్న ఈ ఘటన అమెరికా భద్రతా వైఫల్యాలను మరోసారి ఎత్తిచూపింది.
వాషింగ్టన్ హిల్టన్ హోటల్‌లో నిర్వహించాల్సిన ప్రతిష్టాత్మక డిన్నర్ కార్యక్రమానికి అతిరథ మహారథులు హాజరవుతున్న సమయంలో భద్రతా తనిఖీల వద్ద ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. ఆయుధాలతో లోపలికి ప్రవేశించేందుకు ప్రయత్నించిన ఒక అనుమానితుడిని సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు అడ్డుకున్నారు. ఈ క్రమంలో కాల్పులు జరగడంతో అక్కడున్న వారంతా భయాందోళనకు గురయ్యారు. దురదృష్టవశాత్తూ ఈ కాల్పుల్లో ఒక సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ గాయపడగా భద్రతా దళాలు అత్యంత వేగంగా స్పందించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నాయి.
నిందితుడిని కాలిఫోర్నియాలోని టోరెన్స్‌కు చెందిన 31 ఏళ్ల కోలో టామోస్ అలెన్‌గా గుర్తించారు. వృత్తిరీత్యా ఉపాధ్యాయుడైన అలెన్ వద్ద ఒక షాట్‌గన్ పలు రకాల కత్తులు లభించడం అధికారులను విస్మయానికి గురిచేసింది. ప్రస్తుతం అతని నివాసంలో సోదాలు నిర్వహిస్తున్న పోలీసులు.. ఈ దాడి వెనుక ఉన్న అసలు ఉద్దేశాలను ఆరా తీస్తున్నారు.
ఈ ప్రమాదకర ఘటన తర్వాత డొనాల్డ్ ట్రంప్ స్పందించిన తీరు ఆయన మద్దతుదారులను విశేషంగా ఆకట్టుకుంది. తన పదవి, హోదా ఎంతటి ప్రాణాపాయంతో కూడుకున్నదో తనకు మొదటి నుంచీ తెలుసని ఆయన స్పష్టం చేశారు. "అమెరికా అధ్యక్షుడిగా ఉండటం అంటే ప్రమాదాలను ఆహ్వానించడమేనని నాకు తెలుసు. కానీ నేను భయపడే వ్యక్తిని కాదు. ఇలాంటి బెదిరింపులకు వెరసి నేను వెనకడుగు వేయబోను" అని ట్రంప్ ధీమా వ్యక్తం చేశారు.
అంతేకాకుండా కాల్పులు జరిగినప్పటికీ తాను హోటల్ నుంచి వెళ్లడానికి ఇష్టపడలేదని.. కార్యక్రమాన్ని యథావిధిగా కొనసాగించాలని పట్టుబట్టానని ఆయన వెల్లడించారు. అయితే భద్రతా కారణాల దృష్ట్యా సీక్రెట్ సర్వీస్ అధికారులు గట్టిగా కోరడంతో వారి సూచన మేరకు ప్రాంగణాన్ని వీడాల్సి వచ్చిందని ఆయన పేర్కొన్నారు.
భద్రతా వ్యవస్థపై ప్రశ్నలు.. సూచనలు
ఈ ఘటన నేపథ్యంలో అమెరికాలోని హై-ప్రొఫైల్ వ్యక్తుల రక్షణపై పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. గతంలోనే తనకు మార్కో రూబియో, పీట్ హెగ్సెత్ వంటి నేతలు భద్రతా పరమైన హెచ్చరికలు చేశారని ట్రంప్ గుర్తుచేశారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే వైట్ హౌస్‌లో ప్రత్యేకంగా ఒక పెద్ద బాల్‌రూమ్ నిర్మించాలని, అక్కడ కట్టుదిట్టమైన భద్రత మధ్య ఇటువంటి ఈవెంట్లు నిర్వహించాలని ఆయన సూచించారు.
ప్రస్తుత పరిస్థితి ఏంటంటే?
భద్రతా కారణాల దృష్ట్యా ఈ డిన్నర్ కార్యక్రమాన్ని 30 రోజులకు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. కోలో టామోస్ అలెన్ నేపథ్యంపై ఎఫ్.బి.ఐ , స్థానిక పోలీసులు లోతుగా విచారణ చేస్తున్నారు. గాయపడిన సీక్రెట్ సర్వీస్ ఏజెంట్‌కు వైద్య చికిత్స అందుతోంది. ప్రస్తుతం ఆయన ప్రాణాపాయం నుండి బయటపడినట్లు సమాచారం.
ఈ కాల్పుల ఘటన సోషల్ మీడియాలో కార్చిచ్చులా వ్యాపించింది. ట్రంప్ ప్రదర్శించిన స్థైర్యం ఆయన రాజకీయ వర్గాల్లో కొత్త ఉత్సాహాన్ని నింపగా, అగ్రరాజ్యంలో రాజకీయ నేతలపై పెరుగుతున్న దాడుల సంస్కృతి పట్ల మేధావులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భద్రతా వలయాలను ఛేదించుకుని ఒక సామాన్య టీచర్ ఆయుధాలతో రావడం అమెరికా ఇంటెలిజెన్స్ వ్యవస్థకు పెద్ద సవాలుగా మారింది.
