ట్రంప్ తదుపరి టార్గెట్..? ఆ మూడు దేశాల గుండెల్లో రైళ్లు!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎంతటి తెపరివాడో వెనెజులా అధ్యక్షుడు మదురోను ఎత్తుకెళ్లడంతోనే తెలిసింది.
By: Tupaki Political Desk | 5 Jan 2026 9:35 AM ISTఅమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎంతటి తెపరివాడో వెనెజులా అధ్యక్షుడు మదురోను ఎత్తుకెళ్లడంతోనే తెలిసింది. కారణాలు ఏమైనా కానీ, ఒక సార్వభౌమ దేశాధిపతిని చాలెంజ్ చేసి మరీ దించేసినట్లయింది. ట్రంప్ రెండో విడత అధికారంలోకి వచ్చింది మొదలు ఇలాంటిది ఏదో ఒక ఉపద్రవం తెస్తాడని అందరూ ఊహించారు. సరిగ్గా ఏడాది పాలన పూర్తవబోతున్న సమయంలో అనుకున్నంత చేశారు. వెనెజులా మదురో వంటి కొరకరాని కొయ్యను ట్రంప్ తర్వాతి కాలంలో ఏం చేస్తారు? అసలు ప్రాణాలతో వదిలేస్తారా? అన్నది చర్చనీయాంశంగా మారింది. ఈ పరిణామాలతో మరో మూడు దేశాల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ట్రంప్ ఎప్పుడు తమ మీద పడతారో అని అవి ఆందోళన చెందుతున్నాయి. వాస్తవానికి వెనెజులా కంటే ఈ దేశాల విషయంలోనే ట్రంప్ గత ఏడాది జనవరిలో అధ్యక్షుడు అయ్యాక ఎక్కువగా స్పందించారు. పెద్ద ఎత్తున విమర్శలు రాగా.. ఆ తర్వాత నోరు మెదపలేదు. కానీ, మదురో ఉదంతం తర్వాత అమెరికా అధ్యక్షుడు తమవైపు చూస్తాడని ఆ మూడు దేశాలు ఆలోచనలో పడి ఉంటాయని చెప్పొచ్చు. ఇంతకూ ఏమిటి ఆ దేశాలు..?
డెన్మార్క్ నుంచి గుంజుకుంటాడా?
గ్రీన్ ల్యాండ్.. ప్రపంచ పటంలో పెద్దగా కనిపించినా అత్యంత తక్కువ జనాభా ఉన్న ప్రపంచంలోనే అతిపెద్ద ద్వీపం. ఉత్తర అట్లాంటిక్-ఆర్కిటిక్ మహా సముద్రాల మధ్య ఉండే ఈ ప్రాంతం భౌగోళికంగా ఉత్తర అమెరికా ఖండంలోనిదే. కానీ, డెన్మార్క్ పాలనలో స్వయం ప్రతిపత్తి (అటానమస్) కలిగి ఉంది. 80 శాతం మంచుతో ఉండే గ్రీన్ ల్యాండ్ జనాభా కేవలం 56 వేలు. అయితే, సహజ వనరులు, చమురు సంపద అత్యంత పుష్కలం. అందుకే ట్రంప్ దీనిపై కన్నేశారు. దీనిని కొనేస్తామంటూ ప్రకటనలు చేశారు. గత డిసెంబరులో లూసియాన గవర్నర్ జెఫ్ లాండ్రీని గ్రీన్ ల్యాండ్ ప్రత్యేక దూతగానూ నియమించారు. గ్రీన్ ల్యాండ్ ను ఏదో ఒక విధంగా (కొనడం ద్వారా కూడా) అదుపులోకి తీసుకోవాలనేది ట్రంప్ గట్టి పట్టుదల. ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా, చైనా నౌకలు మోహరింపుతో
తమ దేశ భద్రత రీత్యా ఇది ముఖ్యమని.. అవసరమైతే సైనిక చర్య కూడా చేపడతామని ఆయన ప్రకటించడం గమనార్హం.
51వ రాష్ట్రం చేస్తారా?
విస్తీర్ణంలో అమెరికా కంటే కాస్త పెద్దగా... దాని పొరుగునే ఉండే దేశం కెనడా. ఇరు దేశాల మధ్య సరిహద్దు గోడలు, కంచెలు కూడా లేని ప్రాంతాలు ఉన్నాయంటే ఈ రెండు దేశాలు ఎంత సన్నిహితమో తెలుస్తోంది. అయితే, అది ఒకప్పుడు. ట్రంప్ రెండోసారి అధ్యక్షుడు అయ్యాక కెనడాను తమ దేశంలో 51వ రాష్ట్రంగా చేస్తామంటూ వ్యాఖ్యలు చేశారు. అప్పటి కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోతో ట్రంప్ నకు సత్సంబంధాలు లేవు. అందుకే కెనడా విషయంలో తరచూ కాలుదువ్వేశారు. ట్రూడో దిగిపోయాక మాత్రం ట్రంప్ నోరు మెదపడం లేదు. అయితే, ముప్పు మాత్రం పొంచి ఉందనడంలో సందేహం లేదు.
పనామాతో కాల్వ పంచాయతీ...
పనామా కాల్వ... మనుషులు నిర్మించిన జల మార్గం. ప్రపంచ వాణిజ్యంలో అత్యంత కీలక పాత్ర పోషించే మార్గం. అట్లాంటిక్ మహా సముద్రం-పసిఫిక్ మహా సముద్రాలను కలిపే, ఉత్తర అమెరికా-దక్షిణ అమెరికాలను వేరు చేసే కాల్వ. దీని నిర్మాణాన్ని ఫ్రాన్స్ మొదలుపెట్టినా.. 1914లో అమెరికానే పూర్తిచేసింది. 1999లో దీనిపై పెత్తనాన్ని పనామా దేశానికి అప్పగించింది. అయితే, ఆ దేశం తమ నౌకల నుంచి అధిక చార్జీలు వసూలు చేస్తోందని ట్రంప్ ఆరోపిస్తున్నారు. ఓడరేపులను చైనా కంపెనీలు నిర్వహిస్తుండడంతో ఆ దేశ ప్రభావం పెరుగుతోంది. దీంతో పనామా కాల్వను తాము స్వాధీనం చేసుకుంటామని పదేపదే ప్రకటించారు. పనామా గట్టిగానే ప్రతిఘటించింది. అమెరికా నౌకలకు రుసుములు తగ్గించకున్నా.. ప్రాధాన్యం ఇస్తోంది.
...గత ఏడాది జనవరిలో అధ్యక్షుడు అయ్యాక హడావుడి చేసినా... ఇప్పటికైతే పై మూడు అంశాలపై ట్రంప్ మౌనంగానే ఉన్నారు. కానీ, ఏం జరుగుతుందో చెప్పలేం.
