ట్రంప్ కొరడాకు భయపడ్డ చైనా, భారత్.. రష్యా చమురు బంద్
ఉక్రెయిన్ పై యుద్దంలో నిప్పులు కురిపించేందుకు రష్యాకు ఆ దేశ చమురు ఆయుధంగా ఉపయోగపడుతోంది అన్నది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బలమైన నమ్మకం.
By: Tupaki Political Desk | 21 Nov 2025 12:22 PM ISTఉక్రెయిన్ పై యుద్దంలో నిప్పులు కురిపించేందుకు రష్యాకు ఆ దేశ చమురు ఆయుధంగా ఉపయోగపడుతోంది అన్నది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బలమైన నమ్మకం. అందుకే పశ్చిమ దేశాలు నాలుగేళ్లుగా ఎన్ని ఆంక్షలు విధిస్తున్నా రష్యాపై పెద్దగా ప్రభావం చూపకపోవడానికి కారణం ఇదేనని కూడా ఆయన గట్టి విశ్వాసం. ఇప్పుడు ఆ చమురు పైప్ లైన్ పీక నొక్కితే రష్యాను దారికి తేవచ్చని, ఉక్రెయిన్ పై ఆ దేశ యుద్ధాన్ని ఆపవచ్చని ట్రంప్ నిర్ణయించారు. ఈ క్రమంలో రష్యా నుంచి చమురు కొనే దేశాలపై రెట్టింపు ఆంక్షలు విధిస్తామంటూ హెచ్చరికలు మొదలుపెట్టారు. చివరకు అన్నంత పని చేశారు. మొదట్లో ట్రంప్ హెచ్చరికలను లెక్కచేయని చైనా, భారత్ వంటి దేశాలు ఇప్పుడు ఆయన దారికి వచ్చాయి. రష్యాకు చెందిన అతిపెద్ద చమురు సంస్థలు రోస్ నెస్ట్, లుక్ ఆయిల్ నుంచి కొనుగోళ్లను నిలిపివేశాయి. ఇవి ఎంత పెద్ద కంపెనీలు అంటే.. రష్యా చమురు ఎగుమతుల్లో దాదాపు సగం ఈ రెండింటిదే. ఈ నేపథ్యంలోనే ట్రంప్ ఆంక్షలు చైనా, భారత్ ను సైతం కదిలించాయని తెలుస్తోంది.
అమల్లోకి ఆంక్షలు..
ట్రంప్ ప్రభుత్వం విధించిన ఆంక్షలు శుక్రవారం నుంచి అమల్లోకి వచ్చాయి. మరోవైపు ఆయన చర్యలు రష్యా దిగ్గజ చమురు సంస్థలు రోస్ నెస్ట్, లుక్ ఆయిల్ పై తీవ్ర ప్రభావం చూపాయని అమెరికా ట్రెజరీ శాఖ చెబుతోంది. భారత్, చైనా దూరం కావడంతో రష్యా చమురు ధరలు పతనం అయ్యాయని తెలిపింది. ఉక్రెయిన్ పై యుద్ధానికి రష్యాకు ఇకమీదట నిధుల కొరత తప్పదని పేర్కొంది. రష్యా ఆయిల్ ముందస్తు కొనుగోళ్ల రద్దు లేదా నిలుపుదల చేసి కొనుగోలుదారులు తప్పించుకునేందుకు చూస్తున్నారని, తమ సలహాలు అడుగుతున్నారని అమెరికా తెలిపింది. ట్రంప్ గత నెల 22న విధించిన ఆంక్షల ప్రకారం రోస్ నెఫ్ట్ అనుబంధ సంస్థల నుంచి చమురు కొన్నా చర్యలు తప్పవు.
రిలయన్స్ కూడా కొనుగోళ్లు బంద్..
రష్యా చమురును భారత్ లో అత్యధికంగా దిగుమతి చేసుకునే భారత సంస్థల్లో ప్రసిద్ధ రిలయన్స్ ఒకటి. ఇప్పుడు ఈ సంస్థ కూడా కొనుగోళ్లు బంద్ చేసింది. అయితే, చమురుతో ఇప్పటికే రష్యా నుంచి బయల్దేరిన నౌకల పరిస్థితి ఏమిటి? అన్నది తేలలేదు. ఓవైపు ఆంక్షల కొరడా ఝళిపిస్తూనే.. మరోవైపు ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం ముగిసేలా తాజాగా 28 సూత్రాల శాంతి ప్రణాళికను ట్రంప్ ఆమోదించారు. అయితే, ఇది ఎక్కువ శాతం రష్యాకే అనుకూలంగా ఉందనే విమర్శలు వచ్చాయి. ఏకంగా కొంత భూమిని కూడా రష్యాకు ఉక్రెయిన్ వదులుకోవడం.. అందులోనూ అత్యంత సంపన్న డాన్ బాస్ ప్రాంతాన్ని వదులుకోవాల్సి ఉండడం గమనార్హం. మరి ఈ ప్రతిపాదనలపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ స్పందన ఏమిటో బయటకు రావాల్సి ఉంది.
