Begin typing your search above and press return to search.

ట్రంప్ సేఫ్.. వైట్ హౌస్ వద్ద కాల్పులు.. సీక్రెట్ సర్వీస్ ఎదురుకాల్పుల్లో దుండగుడు హతం

అమెరికాలో గన్ కల్చర్ మరోసారి కలకలం రేపింది. అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ సమీపంలో శనివారం సాయంత్రం భారీ కాల్పుల ఘటన చోటుచేసుకుంది.

By:  A.N.Kumar   |   24 May 2026 11:45 AM IST
ట్రంప్ సేఫ్.. వైట్ హౌస్ వద్ద కాల్పులు.. సీక్రెట్ సర్వీస్ ఎదురుకాల్పుల్లో దుండగుడు హతం
X

అమెరికాలో గన్ కల్చర్ మరోసారి కలకలం రేపింది. అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ సమీపంలో శనివారం సాయంత్రం భారీ కాల్పుల ఘటన చోటుచేసుకుంది. వైట్ హౌస్ పశ్చిమ గేట్ వద్ద ఓ యువకుడు జరిపిన కాల్పులకు ప్రతిగా అమెరికా సీక్రెట్ సర్వీస్ అధికారులు తక్షణమే స్పందించి ఎదురుకాల్పులు జరిపారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన దుండగుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. ఘటన సమయంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్‌లోనే ఉన్నప్పటికీ ఆయన పూర్తిగా సురక్షితంగా ఉన్నట్లు అధికారులు ధృవీకరించారు.

అసలేం జరిగింది?

అమెరికా మీడియా కథనాల ప్రకారం శనివారం సాయంత్రం జరిగింది. సాయంత్రం 6:00 గంటలకు ఒక 21 ఏళ్ల యువకుడు వైట్ హౌస్ పశ్చిమ భాగంలోని గేట్ సమీపానికి చేరుకున్నాడు. 17వ స్ట్రీట్ నార్త్ వెస్ట్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న సదరు యువకుడిని సీక్రెట్ సర్వీస్ అధికారులు గుర్తించారు. అధికారులు అతడిని ప్రశ్నించేందుకు ప్రయత్నించగా అతను ఒక్కసారిగా తన వద్ద ఉన్న హ్యాండ్ గన్‌ తీసి వైట్ హౌస్ గేట్ సమీపంలో పలు రౌండ్లు కాల్పులు జరిపాడు. దీంతో అక్కడ ఒక్కసారిగా భయాందోళనలు నెలకొన్నాయి.

సీక్రెట్ సర్వీస్ మెరుపు స్పందన

దుండగుడు కాల్పులు ప్రారంభించిన కొన్ని సెకన్లలోనే అమెరికా సీక్రెట్ సర్వీస్ సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఎదురుకాల్పులు జరిపి నిందితుడిని అక్కడికక్కడే కూల్చివేశారు. బుల్లెట్ గాయాలతో పడిపోయిన అతడిని వెంటనే జార్జ్ వాషింగ్టన్ యూనివర్సిటీ హాస్పిటల్ కు తరలించారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ అతను మరణించాడు. ఈ ఘటనలో మరొక వ్యక్తి కూడా గాయపడినట్లు సమాచారం అందుతోంది. కానీ అతని ఆరోగ్య పరిస్థితిపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మరోవైపు ఈ ఘటనలో మొత్తం 20 నుంచి 30 రౌండ్ల వరకు కాల్పులు జరిగినట్లు ఎన్.బీసీ న్యూస్ తన నివేదికలో పేర్కొంది.

హై అలర్ట్‌లో వైట్ హౌస్

కాల్పుల శబ్దం వినబడగానే వైట్ హౌస్ కాంపౌండ్‌ను అధికారులు లాక్‌డౌన్ చేశారు. నార్త్ లాన్‌లో ఉన్న జర్నలిస్టులు, మీడియా ప్రతినిధులను సీక్రెట్ సర్వీస్ సిబ్బంది వెంటనే సురక్షితంగా ప్రెస్ బ్రీఫింగ్ రూమ్‌ల్లోకి తరలించారు.

నిందితుడు ఎవరు? మానసిక సమస్యలే కారణమా?

ఈ ఘటనపై ఎఫ్.బీఐ సహా పలు దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం కాల్పులు జరిపిన వ్యక్తిని "నాసిరే బెస్ట్" గా గుర్తించారు. అతడు తీవ్ర మానసిక ఆందోళనలతో బాధపడుతున్నాడని.. ఇటీవల అతని మానసిక స్థితికి సంబంధించి ఒక అధికారిక ఆర్డర్ కూడా జారీ అయినట్లు మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. ఈ ఘటనపై ఎఫ్.బీఐ డైరెక్టర్ కాష్ పటేల్ స్పందిస్తూ.. సీక్రెట్ సర్వీస్‌తో కలిసి పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుపుతున్నట్లు ప్రకటించారు.

ట్రంప్ సోషల్ మీడియా పోస్ట్.. ఆ వెంటనే ఘటన!

ఈ కాల్పుల ఘటన జరగడానికి కేవలం రెండు గంటల ముందే డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియాలో ఒక కీలక పోస్ట్ చేశారు. ఇరాన్‌తో శాంతి ఒప్పందం, సీజ్ ఫైర్ కొనసాగుతున్న విషయాలను ప్రస్తావిస్తూ ఇరు దేశాల మధ్య యుద్ధ పరిస్థితులు ముగిశాయని ఆయన పేర్కొన్నారు. ఆయన పోస్ట్ చేసిన కొద్ది సేపటికే వైట్ హౌస్ వెలుపల ఈ ఘటన జరగడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. అయితే ఈ దాడికి ఇరాన్ లేదా ఇతర అంతర్జాతీయ అంశాలతో ఏమైనా లింక్ ఉందా అనే కోణంలో ఇప్పటికైతే ఎలాంటి అధికారిక ఆధారాలు లభించలేదు.

అధ్యక్ష భద్రతపై మళ్లీ చర్చ

ప్రపంచంలోనే అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే వైట్ హౌస్ ప్రాంగణంలోనే ఇలాంటి ఘటన జరగడం అమెరికాలో గన్ కంట్రోల్ చట్టాలు, విఐపి భద్రతపై మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది. సీక్రెట్ సర్వీస్ అధికారులు క్షణాల వ్యవధిలో స్పందించి ఉండకపోతే పరిస్థితి మరింత ఘోరంగా ఉండేదని భద్రతా నిపుణులు విశ్లేషిస్తున్నారు.